
రాజస్తాన్‌లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి, ఎలాగైనా సీఎం పీఠం దక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌కు చోటామోటా పార్టీలు ప్రధాన సమస్యగా మారాయి. పేరుకు జాతీయ పార్టీలైనా ఓట్ల పరంగా ప్రాంతీయ పార్టీలతో సమానమైన సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు, బీవీపీ, ఆర్‌ఎల్‌పీ లాంటి స్థానిక పార్టీల హడావుడి పలు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. తక్కువ ఓట్ల శాతంతో పూర్తి ఫలితాలు తారుమారయ్యే పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండు పెద్ద పార్టీలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాల్లో 30 చోట్ల ఇలాంటి పార్టీల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గ్రామీణ నేపథ్యం, దళితుల ఓట్ల ప్రభావం ఉన్న చోట్ల బీఎస్పీ, సీపీఎం, ఐఎన్‌ఎల్‌డీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)ల ప్రభావం ఎక్కువగానే ఉంది. బీజేపీ రెబల్ నేత ఘన్‌శ్యామ్ తివారీ ఏర్పాటు చేసిన భారత్ వాహినీ పార్టీ (బీవీపీ) ప్రభావం రెండు, మూడు స్థానాలకు మించి ఉండకపోవచ్చంటున్నారు. 2008లో కాంగ్రెస్ పార్టీకి 96 సీట్లు రాగా.. ఆరుచోట్ల గెలుపొందిన బీఎస్పీ.. గెహ్లాట్ ప్రభుత్వంలో చేరేందుకు విముఖత వ్యక్తం చేసింది. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అది పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలమని విశ్లేషకులంటున్నారు. ప్రాంతీయ పార్టీలు 30 చోట్ల ప్రభావం చూపిస్తే.. కాంగ్రెస్‌కు మరోసారి కర్ణాటక లాంటి పరిస్థితులు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు.
హవా ఇలా..
- 2013లో కాంగ్రెస్ అవకాశాలను ఎన్పీపీ, బీఎస్పీలు దెబ్బతీసిన నియోజకవర్గాలు 40
- జాట్ నేత హనుమాన్ బేణీవాల్ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ బీవీపీతో పొత్తు. 200 స్థానాల్లో పోటీ
- మోదీ ప్రభావం ఉన్నా బీఎస్పీకి,ఎన్పీపీకి 12% ఓట్లు వచ్చాయి.
- 2008లో నాలుగుసీట్లలో గెలిచిన ఐఎన్‌ఎల్‌డీ బీఎస్పీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయం
- సికార్, శ్రీ గంగానగర్ జిల్లాల్లో ప్రభావవంతంగా రైతుల ఆందోళనలు ముందుండి నడిపిన సీపీఎం
Comments
Please login to add a commentAdd a comment