యశ్వంత్ సిన్హాను బీజేపీ సీనియర్ నేతగా పేర్కొంటూ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు
సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నామని బీజేపీ అంటోంది. కానీ..కొన్ని కొన్ని సార్లు ఆ దూకుడే పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. బీజేపీలో ఉన్న విభేదాలను బట్టబయలు చేస్తోంది. బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పుట్టిన రోజునాడు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రాజస్థాన్ బీజేపీ శాఖ చేసిన ట్వీట్ కలకలం రేపింది. ట్విట్టర్‌లో పోస్టు చేసిన శుభాకాంక్షల పోస్టర్‌లో యశ్వంత్ సిన్హాను బీజేపీ నేత అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను దుయ్యబడుతూ, ఆయనపై తిరుగుబాటు చేసి పార్టీకి గుడ్‌బై చెప్పిన ఒక నేతకి జన్మదిన శుభాకాంక్షల్ని చెప్పడం వెనుక రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్న దిశగా రాష్ట్ర బీజేపీలో పుకార్లు వినిపిస్తున్నాయి. వసుంధరా రాజే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు మధ్య నెలకొన్న విభేదాలు అందరికీ తెలిసినవే. ఆరెస్సెస్ అండదండలతోనే నెగ్గుకొస్తున్న రాజే...æ అడ్వాణీ శిబిరంలోనే మొదట్నుంచి కొనసాగుతూ ఉన్నారు. చాలా మంది సీఎంల్లాగా ప్రధాని మోదీ ఇమేజ్‌తోనే పార్టీ గెలుస్తుందని ఆమె ఎన్నడూ చెప్పలేదు. తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉందన్న ధీమాతోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, షా ద్వయానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన యశ్వంత్ సిన్హాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం అంటే అమిత్ షాపై యుద్ధం ప్రకటించిందని అనుకోవాలా? లేదంటే బీజేపీ ఐటీ సెల్ తప్పిదమా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
శుభాకాంక్షలు చెబితే తప్పేంటి?
బీజేపీ ఐటీ సెల్ మాత్రం దీనిని చాలా తేలిగ్గా తీసుకుంది. పార్టీకి చెందినవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఒక నేతకి శుభాకాంక్షలు చెబితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తోంది. ‘రాజకీయ నాయకులకి శుభాకాంక్షలు అందజేయడం మా సంస్కృతి. ప్రత్యర్థి పార్టీల నేతల్ని విష్ చేస్తే తప్పేంటి? సచిన్ పైలట్, అశోక్ గెహ్లట్‌ల పుట్టిన రోజులకూ పోస్టర్లు విడుదల చేశాం. వారికి శుభాకాంక్షలు చెప్పాం. అదేవిధంగా ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన సిన్హాకు చెప్పాం’ అని బీజేపీ రాజస్థాన్ ఐటీ సెల్‌ఇన్‌చార్జ్ హీరేంద్ర కౌశిక్ అన్నారు. సోషల్ మీడియా పోస్టుపై ప్రధాన మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. అయితే పోస్టర్‌లో బీజేపీ నేతగా సిన్హాను పేర్కొనడం పొరపాటేనని అంగీకరించారు. అయితే పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే సిన్హాకు శుభాకాంక్షలు చెప్పారని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొరపాటే అయితే ఎన్నికల వేళ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అంటున్నారు.
రాజస్తాన్‌లో ‘శ్యానా కాకా’ సిరీస్
రాజకీయ నాయకులు ఓట్ల కోసం వింత వింతగా ప్రచారాలు చేయడం చూస్తున్నాం. రాజస్తాన్‌లో పాలన అధికారులు కూడా కొత్త శైలిలో ప్రచారానికి శ్రీకారం చూట్టారు. అయితే వీరి ప్రచారం ఓట్ల కోసం కాదు.. ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపైన ఎక్కువగా ఉండడంతో.. దాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని..రాజస్తాన్‌లోని బూందీ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన మహేశ్ చంద్ డిజిటల్ కార్టూన్ సిరీస్ ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో ఓటు హక్కు పట్ల చైతన్యం కల్పించడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి, ప్రముఖ కార్టూనిస్ట్ సునీల్ జంగీద్‌తో కలిసి ‘శ్యానా కాకా’ (తెలివైన కాకా) అనే కార్టూన్ సిరీస్‌ను ప్రారంభించారు. ఆసక్తి గొలిపే కార్టూన్లతో సందేశాలను ఓటర్ల ఫోన్‌లకు వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నారు. కార్టూన్ రూపంలో సందేశం పంపితే ఓటర్లలో ఆసక్తి పెరగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
రాజేపై ఎస్పీ భార్య పోటీ!
సీఎం వసుంధరా రాజేపై.. రాజస్తాన్ పోలీస్ శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న ఓ అధికార భార్య పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముకుల్ చౌదరీ.. తన భర్త ఎస్పీ పంకజ్ చౌదరీతో కలిసి నేరుగా సోనియా గాంధీని కలవడం రాజస్తాన్‌లో చర్చనీయాంశమైంది. ఝల్రాపటన్‌లో రాజేపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాతో మాట్లాడారని సమాచారం. ముకుల్ తల్లి బీజేపీ ప్రభుత్వంలో (బైరాన్‌సింగ్ షెకావత్ సీఎంగా ఉన్నప్పుడు) మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా? అన్న అంశాన్ని పక్కనపెట్టి రెండు నెలల క్రితమే రాజే లక్ష్యంగా ముకుల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం అవినీతిలో కూరుకుపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఝల్రాపటన్ నేను పుట్టిన ఊరు. అందుకే ఈ గడ్డకు న్యాయం చేయాలని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. వసుంధర రాజే ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నాకు అవకాశం ఇవ్వండి మార్పు చేసి చూపిస్తా’ అని ఆమె తన ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈమె భర్త పంకజ్ ప్రస్తుతం రాజస్తాన్ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్‌సీఆర్బీ) ఎస్పీగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment