'హిందీ' మూడ్‌ 'ఎటో'? | Who is in the heart of people BJP Or Congress | Sakshi
Sakshi News home page

'హిందీ' మూడ్‌ 'ఎటో'?

Published Thu, Nov 15 2018 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Who is in the heart of people BJP Or Congress - Sakshi

రేపటి దేశ భవిష్యత్తును హిందీ మాట్లాడే రాష్ట్రాలే నిర్ణయించబోతున్నాయి. రాజస్తాన్‌ నుంచి బిహార్‌ వరకు విస్తరించి ఉన్న హిందీబెల్ట్‌ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన వారికే ఢిల్లీ పీఠానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లు కీలకంగా మారబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 ఎంపీ స్థానాలుండగా.. 2014లో బీజేపీయే 63 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ మోదీని సీఎం చేయాలంటే ఈ మూడు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం బీజేపీకి అత్యంత ఆవశ్యకం. అటు కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం.

రాహుల్‌ను ప్రధానిని చేయాలనుకుంటున్న ఏఐసీసీ పెద్దల కల నెరవేరాలంటే ఈ మూడు చోట్ల కాంగ్రెస్‌ జెండా ఎగరాల్సిందే. అందుకే ఏదేమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ అస్త్ర, శస్త్రాలకు పదునుపెడుతున్నాయి. మిజోరంలో ఒక్క లోక్‌సభ స్థానమే ఉండటం.. తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడంతో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ తరఫున ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతను ఆరెస్సెస్‌ భుజాన వేసుకుంది. పట్టణ నియోజకవర్గాలతోపాటు, ఎస్సీలు, ఆదివాసీలకు రిజర్వ్‌డ్‌ అయిన చోట్ల కూడా సంఘ్‌ పని కారణంగా బీజేపీపై వ్యతిరేకత ఉండకపోవచ్చని తెలుస్తోంది.  

జోగితో నష్టమెవరికి? 
ఛత్తీస్‌గఢ్‌లో చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య 10 సీట్ల తేడా మాత్రమే ఉంది. 2013లో ఓట్ల తేడా కూడా 0.75% మాత్రమే. చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్లే బీజేపీ నెగ్గిందనే విశ్లేషణలున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్‌కు అజిత్‌జోగి రూపంలో నష్టం జరుగుతుందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ మాజీ సీఎంగా ఉన్న జోగి కొత్త పార్టీ ఏర్పాటుచేయడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రచార బాధ్యతల్ని రాహుల్‌ గాంధీ స్వయంగా మోస్తున్నప్పటికీ.. జోగి రూపంలో ముప్పు కాంగ్రెస్‌కు ఎంత నష్టం చేస్తుందో చెప్పలేని స్థితి. 

రాజేయోగం ఉందా?
బీజేపీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నది రాజస్థాన్‌లోనే. సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల్లో ఆమెకున్న పట్టు, ఆరెస్సెస్‌ అండదండల కారణంగా బీజేపీ అధిష్టానం.. సీఎం అభ్యర్థిని మార్చే సాహసం చేయడంలేదు. అభ్యర్థుల జాబితాలోనూ రాజే మార్క్‌ స్పష్టంగా కనిపించింది. అయితే.. రాజస్తాన్‌లో బలమైన సామాజికవర్గంగా ఉన్న రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన ఆనంద్‌పాల్‌ సింగ్‌ ఎన్‌కౌంటర్‌.. ఆ తర్వాత జస్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం వంటి ఘటనలతో రాజ్‌పుత్‌లు బీజేపీకి ఓటేయరంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇది బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ రాష్ట్రంలో గెలుపు ఖాయం అని నమ్ముతున్న కాంగ్రెస్‌.. ఇతర రాష్ట్రాల్లోలాగా ఆధిపత్య పోరు లేకుండా స్థానిక నేతల మధ్య సమన్వయంతో ముందుకెళ్తోంది. పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలెట్, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కలిసిపని చేస్తుండటం కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. 

శివరాజసం నిలిచేనా!
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ పోరులో హోరాహోరీ పోరు నెలకొంది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయితే దీన్ని పూర్తిగా తనకు అనకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ పడరాని పాట్లు పడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా 8.5%. అయితే ఈసారి ఎవరు గెలవాలన్నా 9–10% తేడా లక్ష్యంగానే ప్రచారం చేయడం, వ్యూహాలను పన్నడం ఆధారపడి ఉంటుంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ మధ్య విభేదాలతో.. కార్యకర్తల్లో ఇంకా పూర్తిగా ఎన్నికల జోష్‌ రాలేదు. అయితే.. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలతో బీజేపీకి దళితులు, అగ్రవర్ణాలు దూరమవుతారని తాజా సర్వేలంటున్నాయి. అటు, కాంగ్రెస్‌ కూడా ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. బుందేల్‌ ఖండ్, మహాకౌశల్, బాఘేల్‌ ఖండ్‌ ప్రాంతాల్లో అగ్రవర్ణాల ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో హిందుత్వ ఓట్లను సంపాదించుకునేందుకు రాహుల్‌ శివభక్తుడిగా మారారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోనూ హిందుత్వ ఛాయలు 
కనబడుతున్నాయి. 
 
రైతే ఎన్ని‘కల’ రాజు! 
మధ్యప్రదేశ్‌లో రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు బీజేపీని భయపెడుతున్నాయి. గతేడాది మందసౌర్లో అల్లర్లు, ఆరుగురు రైతుల మృతి, పలు వ్యవసాయరంగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో రైతులతోపాటు ఇతర వర్గాల్లోనూ ప్రభుత్వంపై కాస్తంత విముఖత వ్యక్తమవుతోంది. అయితే రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలకు ముందే చౌహాన్‌ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పంటలకు అధికర ధర వచ్చేలా భుగ్తానా యోజనను తీసుకొచ్చారు. ఈ పథకమే తన పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. 

ఎంపీల కష్టమే ఎక్కువ! 
పార్లమెంట్‌ సభ్యులతో పోలిస్తే దేశంలోని వివిధ అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు ఏడాదిలో తక్కువ రోజులు పనిచేస్తున్నారని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మరింత తక్కువ రోజులు కష్టపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. సగటున దేశంలో ఎమ్మెల్యేలు ఏడాదికి దాదాపు 28– 46 పనిదినాలు నమోదు చేయగా, పార్లమెంటు సభ్యులు ఏటా 70 పనిదినాలు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. 2011––2016 కాలంలో దేశంలోని 26 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల పనిగంటలను సంస్థ విశ్లేషించింది. ప్రజల తరఫున ఎన్నికైన సభ్యులు ప్రజా సమస్యలను చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నివేదిక గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి.  

26 అసెంబ్లీల్లో 50 శాతం అంటే దాదాపు 13 అసెంబ్లీలు సరాసరిన ఏడాదికి కేవలం 28 రోజులే సమావేశమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎక్కువగా బడ్జెట్‌ సెషన్లోనే అసెంబ్లీలకు హాజరవుతున్నారు. మిగిలిన సెషన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు.  ఏడాదికి కేరళ, కర్నాటక అసెంబ్లీలు సుమారు 46 రోజుల పాటు సమావేశమవుతున్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర(45 రోజులు), ఒడిషా(42 రోజులు), జమ్ము అండ్‌ కాశ్మీర్‌(39 రోజులు) ఉన్నాయి. తక్కువ పనిదినాలు నమోదు చేస్తున్న అసెంబ్లీల జాబితాలో నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం తొలిస్థానాలు ఆక్రమించాయి.  ఇదే సమయంలో పార్లమెంటులో లోక్‌సభ సభ్యులు ఏడాదికి సుమారు 70 పనిదినాలు, రాజ్యసభ సభ్యులు 69 పనిదినాలు నమోదు చేశారు. పార్లమెంటులో కూడా బడ్జెట్‌ సెషన్లోనే హాజరు శాతం ఎక్కువ. 

అసలు కంటే కొసరే ..!
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అక్కడి ఎమ్మెల్యేల వేతనానికి సంబంధించిన వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.  ప్రభుత్వం జీతాలు, అలవెన్సుల రూపంలో ఈ దఫా ఎమ్మెల్యేలకు చెల్లించిన మొత్తం అక్షరాల రూ.149 కోట్లు. ఎన్నికల ప్రచారం ఊపందకున్న నేపథ్యంలో.. సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త చంద్రశేఖర్‌ గౌడ్‌ ఆర్టీఐ కింద సమర్పించిన దరఖాస్తుకు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన సమచారం ఇది. దీని ప్రకారం మొత్తం 231 మంది శాసనసభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ఏప్రిల్‌ 2013 నుంచి సెప్టెంబర్‌ 2018 వరకు జీతాల కింద రూ.32 కోట్లు చెల్లించారు.

అదే సమయంలో అలవెన్సుల కింద రూ.117 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యేల టీఏల కింద రూ. 34.03 కోట్లు వెచ్చించారు. ఇక్కడి ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఎంత కష్టపడి పని చేశారో తెలియదు కానీ.. వారి జీతం కంటే అలవెన్సులే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2017–18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి అదాయం రూ.79,907 కాగా.. శాసన సభ్యుల ఏడాది సగటు ఆదాయం రూ.14.48 లక్షలుగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement