రాజస్తాన్‌ కాంగ్రెస్‌దే! | India Today analysis on Assembly elections of Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ కాంగ్రెస్‌దే!

Published Fri, Nov 9 2018 1:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

India Today analysis on Assembly elections of Rajasthan - Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు  ఇండియాటుడే  సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం 35% ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 43%, ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని 39% కోరుకున్నారు. 18% తమకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రిత్వం కోసం అశోక్‌ గెహ్లాట్‌(కాంగ్రెస్‌)కు 35%, వసుంధర రాజె(బీజేపీ)కు 31%, సచిన్‌ పైలట్‌(కాంగ్రెస్‌)కు 11% మద్దతిచ్చారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్ల పరిధిలో 10,136 మందిని  సర్వేలో భాగంగా సంప్రదించారు. అత్యధికులు ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధానిగా మోదీపై మాత్రం సానుకూలత వ్యక్తమైంది. ‘కాంగ్రెస్‌ సునాయాసంగా విజయం సాధిస్తుంది. దళితులు, ముస్లింలలో బీజేపీపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కంచుకోటల్లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ పట్టు కోల్పోతోంది’ అని విశ్లేషకులు అంటున్నారు.  
 
మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు ఉంది. బీజేపీ ప్రభుత్వం నిలుపుకునే అవకాశం 52% ఉందని సర్వే పేర్కొంది. ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక కారణంగా బీజేపీకి కొంత  ప్రయోజనం కలిగే అవకాశముందని తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని 42%, ప్రభుత్వం మారాలని 40% కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. 18% తెలియదంటూ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లోని 11,712 మంది నుంచి టెలిఫోన్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నిరుద్యోగం, వ్యవసాయరంగ సమస్యలు, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మారినట్టు తేలింది. జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ మరింత పుంజుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లలో జ్యోతిరాదిత్యకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు వెల్లడైంది. 

ఛత్తీస్‌గఢ్‌: మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని 43%, ప్రభుత్వం మారాలని 41%, తెలియదని 16% స్పందించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 55% ఉందని నిపుణుల సహకారంతో ఇండియా టుడే విశ్లేషించింది. అజిత్‌జోగి ‘జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌’పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్‌పీ, సీపీఐలతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  బీజేపీకి లాభిస్తుందని పేర్కొంది. ఈ కూటమి వల్ల కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమని విశ్లేషించింది. నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వెల్లడైంది. వరసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్నా, జనాదరణలో మాత్రం రమణ్‌సింగ్‌ ముందు వరసలోనే ఉన్నారు. సీఎంగా 44% రమణ్‌సింగ్‌కు, 23% కాంగ్రెస్‌ నేత భూపేష్‌ భాఘేల్,కు, 13% అజిత్‌ జోగికి మద్దతిచ్చారు. జోగి నేతృత్వంలోని కూటమికి 7% సానుకూలత చూపారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ నియోజకవర్గాల్లోని 4,486 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement