పల్లే.. పట్టు!  | Rural vote to be crucial in elections 2018 | Sakshi
Sakshi News home page

పల్లే.. పట్టు! 

Published Mon, Nov 19 2018 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rural vote to be crucial in elections 2018 - Sakshi

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో రైతు సమస్యలను ççప్రసావిస్తూ వెళ్తేనే ఓట్లను ప్రభావితం చేయవచ్చని విపక్షాలు గుర్తించాయి. అందుకే  ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నియోజవకర్గాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికారం అందనుందనేది సుస్పష్టం. 

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలుచేస్తేనే భారత వ్యవసాయ రంగ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు. ఇది గత 15 ఏళ్లుగా దేశమంతా వినిపిస్తున్న డిమాండ్‌. కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి వీలున్నన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అన్నదాతకు పూర్తి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, చీడ పీడ పెరగడం– సరైన నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటివి రైతును కుంగదీస్తున్నాయి.

ఇవి ప్రభుత్వం తీసుకునే ఉపశమన చర్యల కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల ఆత్మహత్యలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో గతేడాది జరిగిన రైతు ఆందోళనలు, తదనంతర పరిణామాల్లో ఆరుగురు రైతులు పోలీసు కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఇది శివరాజ్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీనికితోడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయనే విమర్శలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ.. రైతు సమస్యలే ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతున్నాయనేది నిర్వివాదాంశం.


అసంఘటిత రంగానికి దెబ్బ 
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు కారణంగా అసంఘటిత రంగ కార్మికులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మార్కెట్‌లో చెలామణీకి సరిపోయేంతగా నగదు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనేవారి వద్ద, అమ్మేవారి వద్ద డబ్బుల్లేకపోవడంతో మార్కెట్‌ దెబ్బతింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దీంతో నష్టం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోలాగా డిజిటల్‌ లావాదేవీలు.. గ్రామీణ ప్రాంతాలకు వెంటనే అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే వివిధ అంశాల కారణంగా దేశ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ.. చిరువ్యాపారులు, కార్మికరంగానికి జరిగిన నష్టం పూడ్చలేకపోయారు. అటు రైతుల విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచినప్పటికీ.. రైతులు పండించిన మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో సమస్య మొదటికే వచ్చింది.  

200 జిల్లాల్లో కరువు 
ఈ ఏడాది గతం కన్నా రుతుపవనాలు సరిగ్గానే ఉన్నప్పటికీ.. దేశలోని 600 జిల్లాలకు గానూ 200 జిల్లాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయి. వాటిల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో జిల్లాలు కూడా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో కూలీలు కూడా దుర్భర జీవితాన్నే గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 12.4 కోట్లు. వీళ్లంతా ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నియోజకవర్గాల్లో బీజేపీపై పూర్తి పైచేయి సాధించింది. అయితే ఈ సారి వీరి దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వంపై రైతులు, చిరువ్యాపారలు వ్యతిరేకతను పక్కనపెడితే.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన దానికన్నా.. తాము రైతులకు చేసిన మేలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. 

అసంతృప్తి ఎదురైతే? 
2004లో వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గ్రామీణ భారతంలో పూర్తిగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. రైతులు, రోజు కూలీలు, కార్మికుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే ఎన్డీయే సర్కారు మౌలిక సదుపాయాల రంగం పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారత్‌ వెలిగిపోతోందని విశ్వసించింది. అదే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రామీణ ప్రాంత ఓటరు నిర్ణయం కారణంగా.. బీజేపీ ఓడిపోయింది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజా నిర్ణయానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు గీటురాయిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లలో బ్రాండ్‌ మోదీ, బీజేపీ మధ్య స్పష్టమైన విభజన ఉంది. 2014 తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుస్తోందంటే.. దానికి మోదీ మ్యాజిక్‌ కారణం. మరి ఆ మోదీ మ్యాజిక్‌ ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను మెప్పిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.  

‘గుజరాత్‌’లో మోగిన ఘంటికలు 
గతేడాది డిసెంబర్‌లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల సమస్యలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. అప్పుడే బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగాయి. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై విముఖత వ్యక్తమైంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించింది. గుజరాత్‌ జనాభాలో దాదాపుగా 43% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా బీజేపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ ఎన్నికల్లో గట్టెక్కింది. గుజరాత్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు తక్కువ. మధ్యప్రదేశ్‌లో 28%, రాజస్తాన్‌లో 25%, ఛత్తీస్‌గఢ్‌లో 23% మాత్రమే పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరి సాయంతోనే ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత సులభం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర్‌ ఘటనతో మేల్కొన్న శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో రైతుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ‘భవాంతర్‌’ స్కీమ్‌ ద్వారా సోయా, మొక్కజొన్న వంటి పంటలపై క్వింటాల్‌కు మార్కెట్‌ రేటుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కొంతమేర వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్‌లో పరిస్థితి ఏమాత్రం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు! 
రాజస్తాన్‌లో పాకిస్తాన్‌తో సరిహద్దు రేఖ వెంట గ్రామాల్లో రైతులకు అసెంబ్లీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో శ్రీగంగానగర్‌ జిలాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామస్తుల కదలికలపై పరిమితులు విధించారు. ఈ షరతులతో రైతులకు పొలం పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ జిల్లాలో దాదాపు 50 గ్రామాలు సరిహద్దు రేఖ వెంబడి ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామాల్లో బీఎస్‌ఎఫ్‌ పోస్టులు కూడా ఉన్నాయి. విత్తడం నుంచి కాపు కోతవరకు ప్రతిపనికి రైతులు బీఎస్‌ఎఫ్‌ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఏ పనైనా ఉదయం 9–4 గంటల మధ్యలోనే ముగించాలనడంతో ఇబ్బంది అవుతోందని రైతులంటున్నారు. దీనికితోడు మూడు అడుగులకు పైన పొడవు పెరిగే పంటలు వేయకూడదని ఆంక్షలున్నాయని వాపోయారు. దీంతో చెరకు లాంటి వాణిజ్య పంటలు కాదని కేవలం కూరగాయలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది రైతులు ఈ ఆంక్షలకు జడిసి పొలంపనికి పోవడమే మానేశారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం 1982లో పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో చాలామందికి ఇంతవరకు పరిహారం దక్కలేదని అక్కడి ప్రజల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల కారణంగా పొలాలకు రేట్లు ఎక్కువ. అయితే ఈ ఆంక్షల కారణంగా పెద్దగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అయితే.. ఇన్ని ఇబ్బందులున్నా ఇక్కడి ప్రజలకు మాత్రం బీఎస్‌ఎఫ్‌ వాళ్లంటే చాలా అభిమానం ఉండడం కొసమెరుపు.  

ఒట్టేసి చెబుతున్నా..!  
ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టబోనని ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ అధినేత అజిత్‌ జోగి బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చటానికే జోగి బరిలో ఉన్నారన్న కాంగ్రెస్‌ విమర్శల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వడంమో, బీజేపీ మద్దతు తీసుకోవడమో చేయను’అని భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్‌ సాహెబ్, షాడానీ ప్రకట్‌ తదితర ఎనిమిది మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రమాణం చేశారు. ఇదంతా తనపై బురదజల్లేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కుటిల ప్రచారమని దుయ్యబట్టారు. బీజేపీతో జట్టు కట్టడం కన్నా చావడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో సీజేసీ, బీఎస్‌పీ, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కాంగ్రెస్‌ భయపడుతోంది. ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో బీజేపీపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జోగి వైపుకు మరలించి తద్వారా కూటమిని బలహీనపరచాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement