సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/జైపూర్: బీజేపీ నుంచి రాజస్తాన్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారుచేయడంపై కసరత్తును ముమ్మరం చేసింది. బుధవారం జైపూర్‌లో జరిగిన పార్టీ నూతన శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కొత్త సీఎంను ఎంపికచేసే బాధ్యతను పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ కల్యాణ్ సింగ్‌ను విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సీఎం పదవికి రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్ ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజస్తాన్ కొత్త సీఎంపై రాహుల్ గాంధీ గురువారం నిర్ణయం తీసుకుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే వెల్లడించారు. రాజస్తాన్ అసెంబ్లీలో ఉన్న 200 స్థానాలకు గాను 199 చోట్ల పోలింగ్ జరగ్గా, కాంగ్రెస్ 99 సీట్లు, బీజేపీ 73 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్డీ) ఒక సీటును కైవసం చేసుకోవడంతో ఆ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించింది. ఇతరులు, స్వతంత్రులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.
ఎమ్మెల్యేలతోనూ విడివిడిగా మంతనాలు..
ఏఐసీసీ ప్రతినిధిగా జైపూర్ వెళ్లిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్‌పీ) సమావేశం జరిగింది. గంటల తరబడి చర్చలు జరిపినా తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక చేసేదేమీ లేక సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశం ముగిశాక వేణుగోపాల్ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎల్‌పీ భేటీ, ఎమ్మెల్యేల అభిప్రాయలతో కూడిన నివేదికను రాహుల్‌కు సమర్పిస్తామని అవినాశ్ పాండే తెలిపారు.
రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధేనని, కాబట్టి సీఎంను కూడా ఆయనే ఎంపిక చేయాలని రాష్ట్ర నాయకుడు పరశురాం మోర్దియా అన్నారు. ఇదిలా ఉండగా, సీఎం ఎంపిక బాధ్యతను రాహుల్‌కు కట్టబెట్టాక కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ ప్రశ్నించారు. మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రాక ముందే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కాంగ్రెస్ నాయకుల బృందం గవర్నర్ కళ్యాణ్‌సింగ్‌ను కోరింది. అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌ల నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తమకు ఉందని తెలిపారు.
ఢిల్లీకి గహ్లోత్, పైలట్
అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌లలో ఒకరిని రాజస్తాన్ సీఎంగా ఎంపికచేయడం కాంగ్రెస్ కాస్త తలనొప్పిగా మారింది. ఇక వారిద్దరితోనే నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్న రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకున్నారు. గత ఐదేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడిన పైలట్‌కే సీఎం పదవి అప్పగించాలని రాహుల్ కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే గతంలో పదేళ్లు సీఎంగా పనిచేసిన అశోక్ గహ్లోత్ అంతర్గత వ్యవహారాల్ని చక్కబెట్టడంలో సిద్ధహస్తుడు. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఆయనైతేనే సమర్థంగా నడపగలరని భావిస్తున్నారు. పైలట్, గహ్లోత్‌లను ఒకేచోట కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని రాహుల్ యోచిస్తున్నారు. సీఎం పదవి కోసం వారిద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు తలెత్తినా లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని భావించిన రాహుల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment