జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్‌పుత్‌లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది.
15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్‌పుత్‌లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్‌లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్‌పుత్‌ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు లాభించనుందని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్‌కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment