Rajput
-
ఖతర్నాక్ కానిస్టేబుల్.. మీసాలపై తగ్గేదేలే... తీయనంటే తీయను, ఇంకేముంది!
భోపాల్: ఉద్యోగం ఊడినా బేఖాతర్.. మెలేయడానికి మీసాలుంటే చాలు.. ఇదీ భోపాల్‌కి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వైఖరి. పొడవుగా పెంచిన జుట్టు, మీసాలు తగ్గించనందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని రవాణా విభాగంలో డ్రైవర్‌గా ఉన్న రాణా ఎంతో మక్కువతో చాలా ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు. అవి ఏకంగా మెడవరకు వచ్చేశాయి. పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు చూడడానికి హుందాగా ఉండాలంటూ సీనియర్లు రాణాని మీసాలు, జుట్టు తగ్గించాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను రాణా ధిక్కరించాడు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే మీసం విషయంలో రాజీ పడలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో రాణాని సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ చెప్పారు. అయినప్పటికీ రాణా తగ్గేదేలే అంటున్నాడు. తాను ఒక రాజ్‌పుత్‌నని మీసం మెలేయడమే తప్ప వాటిని తగ్గించడం చేతకాదని టీవీ ఛానెళ్లకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. -
INS Rajput: ‘రాజ్‌పుత్’కు వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం: ‘రాజ్ కరేగా రాజ్‌పుత్...’ అనే నినాదంతో నాలుగు దశాబ్దాల పాటు సాగర జలాల్ని భద్రతా వ్యవహారాల్లో పాలించిన ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సేవల నుంచి నిష్క్రమించనుంది. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ని విశాఖ నేవల్ డాక్‌యార్డులో శుక్రవారం డీ కమిషన్ చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 41 ఏళ్ల పాటు అవిశ్రాంత సేవలు అందించిన రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు చేసింది. నాదెజ్నీ(ఆశ) పేరుతో 1961లో సోవియట్ యూనియన్‌లోని నికోలావ్ (ప్రస్తుతం ఉక్రెయిన్ ఉంది)లో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిర్మాణాన్ని చేపట్టారు. 1977, సెప్టెంబర్ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్ఎస్ఆర్లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌గా పేరు మార్చి.. భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి... జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్ సుదీర్ఘ సేవలందించింది. పలు ఆపరేషన్లలో... దేశాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్ ఆపరేషన్‌లో రాజ్‌పుత్ పాల్గొంది. వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొంది. 41 ఏళ్ల ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ప్రస్థానంలో 31 మంది కమాండింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. ►బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ట్రయల్ ప్లాట్‌ఫామ్‌గా రాజ్‌పుత్ సేవలందించింది. ►2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్‌పుత్ నుంచి ట్రాక్ చేశారు. ►2007 మార్చిలో పృథ్వి–3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు. డాక్‌యార్డులో వీడ్కోలు నౌకాదళానికి అవిశ్రాంత సేవలం దించిన.. రాజ్‌పుత్‌కు ఘన వీడ్కోలు పలకను న్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాఖలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించనున్నారు. సూర్యాస్తమయ సమయంలో భారత నావికాదళం నుంచి ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిష్క్రమించనుంది. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
రెండు భాషల్లో రాజ్‌పుత్
శంకర్ జాదవ్, అదిరే అభి హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రాజ్‌పుత్’. సిరిరాజ్, కరిష్మారామ్ కథానాయికలు. బంజారా భాషలో ‘గోర్‌మాటి’, తెలుగులో ‘రాజ్‌పుత్’గా రెండు భాషల్లో నిర్మిస్తున్నారు రేఖ్యా నాయక్. శంకర్ జాదవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, ‘టీమా’ సెక్రటరీ వి. తిరుమల దేవి కెమెరా స్విచాన్ చేశారు. లక్ష్మణ్ వేముల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘బంజారాల జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడివరకు వెళ్లింది? వారి సమస్యలేంటి? అనే అంశాలతో తయారవుతున్న చిత్రమిది’’ అన్నారు హీరో, దర్శకుడు శంకర్. -
మొట్టమొదటి ఎన్నికల్లోనూ ‘కుట్ర’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఎన్నికలంటే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలే కాదు. కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951, అక్టోబర్ 25 నుంచి 1952, ఫిబ్రవరి 21 వరకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు తప్పలేదు. నాడు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంటే శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రచారం చేసేందుకు నాటి మహారాష్ట్రలోని ‘సౌరాష్ట్ర’ రాజులు, వారి గిరాసిదార్లు కుట్రలు పన్నారు. గిరాసిదార్లుగా నాడు రాజుల తముళ్లే ఉండేవారు. భారత రాబిన్ హుడ్‌గా, సిసిలీ బందిపోటు సాల్వతోర్ గిలియాగా పేరుపొందిన భూపత్ సింగ్ అలియాస్ భూపత్ మక్వానా (మక్వానా అంటే రాజ్‌పుత్‌లలో ఓ తెగ) అనే బందిపోటుతో సౌరాష్ట్ర రాజులు చేతులు కలిపారు. అతనికి అవసరమైన తుపాకులను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేశారు. అండగా చిల్లర దొంగలను కూడా అతనికి సాయంగా అప్పగించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో బీభత్సం సృష్టించాల్సిందిగా కోరారు. అప్పటి వరకు భూస్వాములను, ధనవంతులను, ముఖ్యంగా దుకాణాదారులను దోచుకోవడం, కిడ్నాప్‌లకు పాల్పడడం, దొరికిన సొమ్ము, సరకులో కొంత భాగాన్ని ముఠా కోసం ఉంచుకొని మిగతా కొంత భాగాన్ని పేదలకు, బడుగు వర్గాలకు పంచడానికి పరిమితమైన భూపత్ సింగ్, ఆ తర్వాత హత్యలు చేయడం కూడా మొదలుపెట్టాడు. ఆయన కాకుండా ఆయన ముఠాలో చిల్లర దొంగల పేరిట చేరిన రాజ సైనికులే ఎక్కువగా హత్యలు చేశారన్న ప్రచారం ఉంది. భూపతి సింగ్ ముఠా అప్పట్లో దాదాపు 70 హత్యలు చేసిందట. మహిళలను గౌరవంగా చూసేవాడన్న మంచి పేరు కూడా భూపత్కు ఉంది. తమ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చి ఈ దారుణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ప్రచారం నాటి రాజులు విస్తృతంగా చేయించారు. బందిపోటు భూపత్ వెనక రాజుల హస్తం ఉందన్న విశయం తెల్సి నాటి భారత ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కింద పలువురు రాజులను, గిరాసీదార్లను అరెస్ట్ చేసింది. సజీవంగా లేదా శవంగా భూపత్ సింగ్‌ను పట్టించినవారికి 50 వేల రూపాయల నగదు బహుమానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎంత దుష్ప్రచారం చేసినా సౌరాష్ట్రలోని మొత్తం ఆరు పార్లమెంటరీ సీట్లను, 60 అసెంబ్లీ సీట్లకుగాను 55 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. (జునాగఢ్, కతియావర్లు కూడా నాడు సౌరాష్ట్రలోనే ఉండేవి. 1956లో వాటిని ‘బాంబే ప్రెసిడెన్సీ’లో విలీనం చేయగా, 1960లో సౌరాష్ట్ర గుజరాత్లో కలిసింది) 1952, మే నెలలో తొలి లోక్‌సభ ఏర్పడింది. రాజులు, బందిపోట్ల అరాచకాలను దృష్టిలో పెట్టుకొని తొలి లోక్‌సభ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కాలపరిమితిని మరి కొంతకాలం పొడిగించింది. 1956లో గిరాసిదార్ల వ్యవస్థను రద్దు చేసింది. బందిపోటు భూపత్ ఛాయాచిత్రం భూపత్ సింగ్ ఏమయ్యాడు ? నాటి సౌరాష్ట్ర రాజధాని రాజ్‌కోట్‌కు పట్టపగలు దర్జాగా వచ్చిపోతూ విలాస జీవితం అనుభవిస్తున్న భూపత్ సింగ్. తనపై ప్రభుత్వం 50 వేల రూపాయల రివార్డును ప్రకటించగానే జనంలో నుంచి అదృశ్యమయ్యరు. అతని ముఖ్య అనుచరుడు దెవాయత్ జాడను పాద ముద్రల నిపుణుల ద్వారా కనుగొన్న భారత సైనికులు దెవాయత్ను చంపారు. దాంతో భూపత్ సౌరాష్ట్ర విడిచి పారిపోయాడు. 1952, జూన్‌లో పాకిస్థాన్‌లోని కరాచి నగరంలో అతను ఆయుధాలతో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అతన్ని అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం ఎంత పెద్ద దౌత్య యుద్ధం చేసినా పాక్ పాలకులు వినిపించుకోలేదు. పాక్ నిర్బంధం నుంచి విడుదలైన భూపత్ కరాచీలోనే మారు పేరుతో పాల వ్యాపారం చేసుకుంటూ సామాన్య జీవితం గడిపాడన్న ప్రచారమూ ఉంది. ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడో భారత్‌కు తెలియరాలేదు. భూపత్పై తెలుగు సినిమా ఎన్టీరామారావు, అంజలీ దేవి నటించిన ‘డాకు భూపత్’ సినిమా 1960లో వచ్చింది. అందులో భూపత్ సింగ్ జీవితం తాలూకు కొన్ని ఛాయలు మాత్రమే కనిపిస్తాయి. (గమనిక: ‘ది న్యూ యార్కర్ (1952, మే)’ పత్రికలో సంతా రామారావు, ‘ది న్యూయార్క్ టైమ్స్‌కు రాబర్ట్ థంబుల్ రాసిన వ్యాసాలు, నాటి ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ వార్తా కథనం) -
సం‘కుల’ సమరం.. ఎవరిదో విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్‌పుత్‌లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది. 15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్‌పుత్‌లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్‌లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్‌పుత్‌ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు లాభించనుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్‌కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది. -
జింబాబ్వే కోచ్‌గా రాజ్‌పుత్
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల కాలానికి రాజ్‌పుత్‌ను కోచ్‌గా నియమించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన 56 ఏళ్ల రాజ్‌పుత్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ‘కోచ్‌గా ఎంపికైనందుకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఆయన అన్నారు. తొలి టి20 వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న ధోని సేనకు రాజ్‌పుత్ మేనేజర్‌గా వ్యవహరించారు. గతంలో ఆయన అఫ్గానిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గాను పనిచేశారు. -
ఆ సినిమాను ఆపకుంటే చచ్చిపోతాం
జైపూర్: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాకు కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌ఫుత్ మహిళలు హెచ్చరించారు. చిత్తోర్‌గఢ్ కోట వద్ద బలిదానాలు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ‘పద్మావత్’కి వ్యతిరేకంగా పలు దశల్లో పోరాటం చేయాలని సర్వసమాజ్ సంఘం సభ్యులు నిర్ణయించారు. చిత్తోర్‌గఢ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి 500 మంది హాజరయ్యారు. వీరిలో 100 మంది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారు. ఈ నెల 17న జాతీయ రహదారులు, రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు ఉదయ్‌పూర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ‘పద్మావత్’ విడుదల కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. అలాగే 16న బార్మర్ జిల్లా పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీని కూడా తమ ప్రతినిధులు కలుస్తారని వెల్లడించారు. తమ ప్రయత్నాలు విఫలమైతే ఈ నెల 24న రాణి పద్మావతి ఆత్మాహుతికి పాల్పడిన చిత్తోర్‌గఢ్ కోటలోనే క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు బలిదానాలకు పాల్పడతారని వీరేంద్ర సింగ్ హెచ్చరించారు. కాగా, సెన్సార్ బోర్డు అనుమతించడంతో ఈనెల 25న పద్మావత్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సరికొత్త కామెడీ థ్రిల్లర్
సత్య సింహా, రుచిక, రాజ్‌పుత్, హారిణి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. దాసరి గంగాధర్ దర్శకుడు. గోపూజి కిరణ్ నిర్మాత. ఈ చిత్రం ముహూర్తపు దృశ్యానికి వ్యాపారవేత్త శ్రీరంగం సత్య కెమె రా స్విచాన్ చేయగా, సీనియర్ దర్శకుడు వి.సాగర్ క్లాప్ కొట్టారు. శిరీష్ భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. సరికొత్త కామెడీ థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: కార్తీక్ నాయుడు శనక్కాయల, సహ నిర్మాత: పెండ్యాల చక్రవర్తి, లైన్ ప్రొడ్యూసర్: పిట్ల పాండు, సమర్పణ: డి.ఎం.ఎం.సదన్.