జైపూర్: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాకు కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాను ప్రదర్శిస్తే ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌ఫుత్ మహిళలు హెచ్చరించారు. చిత్తోర్‌గఢ్ కోట వద్ద బలిదానాలు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ‘పద్మావత్’కి వ్యతిరేకంగా పలు దశల్లో పోరాటం చేయాలని సర్వసమాజ్ సంఘం సభ్యులు నిర్ణయించారు. చిత్తోర్‌గఢ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి 500 మంది హాజరయ్యారు. వీరిలో 100 మంది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నారు.
ఈ నెల 17న జాతీయ రహదారులు, రైలు మార్గాలను దిగ్బంధిస్తామని రాజ్‌పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు ఉదయ్‌పూర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి ‘పద్మావత్’ విడుదల కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. అలాగే 16న బార్మర్ జిల్లా పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీని కూడా తమ ప్రతినిధులు కలుస్తారని వెల్లడించారు.
తమ ప్రయత్నాలు విఫలమైతే ఈ నెల 24న రాణి పద్మావతి ఆత్మాహుతికి పాల్పడిన చిత్తోర్‌గఢ్ కోటలోనే క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో మహిళలు బలిదానాలకు పాల్పడతారని వీరేంద్ర సింగ్ హెచ్చరించారు. కాగా, సెన్సార్ బోర్డు అనుమతించడంతో ఈనెల 25న పద్మావత్ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment