మొట్టమొదటి ఎన్నికల్లో ఓటేస్తున్న ఓటరు
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఎన్నికలంటే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలే కాదు. కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951, అక్టోబర్ 25 నుంచి 1952, ఫిబ్రవరి 21 వరకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు తప్పలేదు. నాడు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంటే శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రచారం చేసేందుకు నాటి మహారాష్ట్రలోని ‘సౌరాష్ట్ర’ రాజులు, వారి గిరాసిదార్లు కుట్రలు పన్నారు. గిరాసిదార్లుగా నాడు రాజుల తముళ్లే ఉండేవారు.
భారత రాబిన్ హుడ్‌గా, సిసిలీ బందిపోటు సాల్వతోర్ గిలియాగా పేరుపొందిన భూపత్ సింగ్ అలియాస్ భూపత్ మక్వానా (మక్వానా అంటే రాజ్‌పుత్‌లలో ఓ తెగ) అనే బందిపోటుతో సౌరాష్ట్ర రాజులు చేతులు కలిపారు. అతనికి అవసరమైన తుపాకులను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేశారు. అండగా చిల్లర దొంగలను కూడా అతనికి సాయంగా అప్పగించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో బీభత్సం సృష్టించాల్సిందిగా కోరారు. అప్పటి వరకు భూస్వాములను, ధనవంతులను, ముఖ్యంగా దుకాణాదారులను దోచుకోవడం, కిడ్నాప్‌లకు పాల్పడడం, దొరికిన సొమ్ము, సరకులో కొంత భాగాన్ని ముఠా కోసం ఉంచుకొని మిగతా కొంత భాగాన్ని పేదలకు, బడుగు వర్గాలకు పంచడానికి పరిమితమైన భూపత్ సింగ్, ఆ తర్వాత హత్యలు చేయడం కూడా మొదలుపెట్టాడు. ఆయన కాకుండా ఆయన ముఠాలో చిల్లర దొంగల పేరిట చేరిన రాజ సైనికులే ఎక్కువగా హత్యలు చేశారన్న ప్రచారం ఉంది. భూపతి సింగ్ ముఠా అప్పట్లో దాదాపు 70 హత్యలు చేసిందట. మహిళలను గౌరవంగా చూసేవాడన్న మంచి పేరు కూడా భూపత్‌కు ఉంది.
తమ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చి ఈ దారుణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ప్రచారం నాటి రాజులు విస్తృతంగా చేయించారు. బందిపోటు భూపత్ వెనక రాజుల హస్తం ఉందన్న విశయం తెల్సి నాటి భారత ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కింద పలువురు రాజులను, గిరాసీదార్లను అరెస్ట్ చేసింది. సజీవంగా లేదా శవంగా భూపత్ సింగ్‌ను పట్టించినవారికి 50 వేల రూపాయల నగదు బహుమానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎంత దుష్ప్రచారం చేసినా సౌరాష్ట్రలోని మొత్తం ఆరు పార్లమెంటరీ సీట్లను, 60 అసెంబ్లీ సీట్లకుగాను 55 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. (జునాగఢ్, కతియావర్‌లు కూడా నాడు సౌరాష్ట్రలోనే ఉండేవి. 1956లో వాటిని ‘బాంబే ప్రెసిడెన్సీ’లో విలీనం చేయగా, 1960లో సౌరాష్ట్ర గుజరాత్‌లో కలిసింది) 1952, మే నెలలో తొలి లోక్‌సభ ఏర్పడింది. రాజులు, బందిపోట్ల అరాచకాలను దృష్టిలో పెట్టుకొని తొలి లోక్‌సభ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కాలపరిమితిని మరి కొంతకాలం పొడిగించింది. 1956లో గిరాసిదార్ల వ్యవస్థను రద్దు చేసింది.
బందిపోటు భూపత్ ఛాయాచిత్రం
భూపత్ సింగ్ ఏమయ్యాడు ?
నాటి సౌరాష్ట్ర రాజధాని రాజ్‌కోట్‌కు పట్టపగలు దర్జాగా వచ్చిపోతూ విలాస జీవితం అనుభవిస్తున్న భూపత్ సింగ్. తనపై ప్రభుత్వం 50 వేల రూపాయల రివార్డును ప్రకటించగానే జనంలో నుంచి అదృశ్యమయ్యరు. అతని ముఖ్య అనుచరుడు దెవాయత్ జాడను పాద ముద్రల నిపుణుల ద్వారా కనుగొన్న భారత సైనికులు దెవాయత్‌ను చంపారు. దాంతో భూపత్ సౌరాష్ట్ర విడిచి పారిపోయాడు. 1952, జూన్‌లో పాకిస్థాన్‌లోని కరాచి నగరంలో అతను ఆయుధాలతో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అతన్ని అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం ఎంత పెద్ద దౌత్య యుద్ధం చేసినా పాక్ పాలకులు వినిపించుకోలేదు. పాక్ నిర్బంధం నుంచి విడుదలైన భూపత్ కరాచీలోనే మారు పేరుతో పాల వ్యాపారం చేసుకుంటూ సామాన్య జీవితం గడిపాడన్న ప్రచారమూ ఉంది. ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడో భారత్‌కు తెలియరాలేదు.
భూపత్‌పై తెలుగు సినిమా
ఎన్టీరామారావు, అంజలీ దేవి నటించిన ‘డాకు భూపత్’ సినిమా 1960లో వచ్చింది. అందులో భూపత్ సింగ్ జీవితం తాలూకు కొన్ని ఛాయలు మాత్రమే కనిపిస్తాయి.
(గమనిక: ‘ది న్యూ యార్కర్ (1952, మే)’ పత్రికలో సంతా రామారావు, ‘ది న్యూయార్క్ టైమ్స్‌కు రాబర్ట్ థంబుల్ రాసిన వ్యాసాలు, నాటి ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ వార్తా కథనం)
Comments
Please login to add a commentAdd a comment