భోపాల్: ఉద్యోగం ఊడినా బేఖాతర్.. మెలేయడానికి మీసాలుంటే చాలు.. ఇదీ భోపాల్‌కి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వైఖరి. పొడవుగా పెంచిన జుట్టు, మీసాలు తగ్గించనందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని రవాణా విభాగంలో డ్రైవర్‌గా ఉన్న రాణా ఎంతో మక్కువతో చాలా ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు.
అవి ఏకంగా మెడవరకు వచ్చేశాయి. పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు చూడడానికి హుందాగా ఉండాలంటూ సీనియర్లు రాణాని మీసాలు, జుట్టు తగ్గించాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను రాణా ధిక్కరించాడు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే మీసం విషయంలో రాజీ పడలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో రాణాని సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ చెప్పారు. అయినప్పటికీ రాణా తగ్గేదేలే అంటున్నాడు. తాను ఒక రాజ్‌పుత్‌నని మీసం మెలేయడమే తప్ప వాటిని తగ్గించడం చేతకాదని టీవీ ఛానెళ్లకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment