Mustaches
-
ఖతర్నాక్ కానిస్టేబుల్.. మీసాలపై తగ్గేదేలే... తీయనంటే తీయను, ఇంకేముంది!
భోపాల్: ఉద్యోగం ఊడినా బేఖాతర్.. మెలేయడానికి మీసాలుంటే చాలు.. ఇదీ భోపాల్‌కి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ వైఖరి. పొడవుగా పెంచిన జుట్టు, మీసాలు తగ్గించనందుకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన రాకేశ్ రాణా అనే పోలీసు కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణా చర్యల కింద అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసుశాఖలోని రవాణా విభాగంలో డ్రైవర్‌గా ఉన్న రాణా ఎంతో మక్కువతో చాలా ఏళ్లుగా మీసాలు పెంచుతున్నాడు. అవి ఏకంగా మెడవరకు వచ్చేశాయి. పోలీసుశాఖలో పనిచేస్తున్నప్పుడు చూడడానికి హుందాగా ఉండాలంటూ సీనియర్లు రాణాని మీసాలు, జుట్టు తగ్గించాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను రాణా ధిక్కరించాడు. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే మీసం విషయంలో రాజీ పడలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో రాణాని సస్పెండ్ చేసినట్టు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ చెప్పారు. అయినప్పటికీ రాణా తగ్గేదేలే అంటున్నాడు. తాను ఒక రాజ్‌పుత్‌నని మీసం మెలేయడమే తప్ప వాటిని తగ్గించడం చేతకాదని టీవీ ఛానెళ్లకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. -
మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి!
Suit Made of Men's Mustache: తలపై జుట్టు ఉన్నప్పుడు, చాలా అందంగా కనిపిస్తుంది. అవే వెంట్రుకలు ధరించే దుస్తులపై కనిసిస్తే చాలా ఆసహ్యంగా ఉంటుంది కదూ! కానీ, మొత్తం మీసాల వెంట్రుకలతో తయారైన ఈ సూటు ఎంత అందంగా ఉందో చూడండి! ఫొటోలో ఉన్న ఈ సూట్ పేరు ‘పొలిటిక్స్ మువెంబర్’. నో షేవ్ నవంబర్‌లో భాగంగా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు దానం చేసే వెంట్రుకలను ఉపయోగించి, మెల్బోర్న్కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ పమేలా క్లీమన్ పాస్సీ దీనిని రూపొందించారు. నిజానికి ఈ రూపకల్పన వెనుక ఓ కథ ఉంది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించకపోవడమే తన భర్త క్యాన్సర్‌తో మరణించడానికి కారణమైందని పమేలా భావించింది. ఆ అవగాహనా కార్యక్రమమేదో తానే మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అలా 2016 నుంచి వివిధ సెలూన్ల నుంచి మీసాల వెంట్రుకలను పోగు చేయసాగింది. రీసైక్లింగ్ ద్వారా వీటిని శుభ్రం చేసి, కాటన్‌తో కలిపి నేయించి, ఓ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ను తయారుచేసింది. ఇందుకు ప్రముఖ సంస్థ ‘పొలిటిక్స్’ సహకారం అందించడంతో అద్భుతమైన ఈ సూటు రూపొందింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఆమెకు నేరుగా వెంట్రుకలను పంపిస్తున్నారు. వీటిని ఉపయోగించి మరెన్నో డిజైన్స్‌ను రూపొందించి, మరింత అవగాహన కల్పిస్తానని డిజైనర్ పమేలా క్లీమన్ పాస్సీ చెప్పింది. -
మీసంపెంగ వాసనలు!
హ్యూమర్ మీసాలకూ... కవులకూ ఒకింత దగ్గరి సంబంధం ఉంది. దీనికి చాలా దృష్టాంతాలూ, బోల్డన్ని తార్కాణాలూ ఉన్నాయి. దాదాపు మీసాల్లోని కేశాలెన్నో ఈ దృష్టాంతాలూ అన్నే ఉన్నాయని కవులనూ, మీసాలనూ నిశితంగా పరిశీలించిన వారు అంటుంటారు. ఉదాహరణకు తిరుపతి వెంకట కవులిద్దరూ కూడబలుక్కొని మీసాలు పెంచారు. ‘సినిమాలకు హాలీవుడ్ హీరోలెలాగో, కావ్యాల్లో కవులలాగ. వాళ్లకు మీసాలెందుకు’ అంటూ కొందరు పెద్దలు కోప్పడ్డారు. అప్పుడు సదరు జంటకవులు కాస్తా పద్యంతో బదులిచ్చారు. ‘మేమే కవీంద్రులమని తెల్పడానికి మీసాలు పెంచాం. రోషం కలిగిన వాళ్లెవరైనా మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మీ పద సమీపాలలో ఉంచి, మొక్కుతాం. కాబట్టి దుందుడుకుగా ఇలా మీసాలు పెంచాం’ అంటూ మీసాలెందుకు పెంచుతున్నారంటూ అడిగిన వాళ్లను కవిత్వంలో నిరసించారు. ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోఫోండి...’ అన్నట్టుగా పద్యంతో ఫెడీ ఫెడీమని కొట్టి చెప్పారు. కాస్త వయసు మీరాక ఈ బాడీ జాడీలోని జీవితప్పచ్చడికి మొదట ఉన్నంత టేస్టు ఉండదు. ఈ లోతైన ఫిలాసఫీని చాలా తేలిక మాటల్లో తెలిపాడు శ్రీశ్రీ. ‘మీసాలకు రంగేస్తే యౌవనం వస్తుందా... సీసా లేబుల్ మారిస్తే సారా బ్రాందీ అవుతుందా’ అన్నాడాయన. అంటే యుక్త వయసులోనూ.. ముదిమిలోనూ మీసం ఈక్వలే అయినా ఆ తర్వాతి సీక్వెల్లో అవి తెల్లబోతాయనీ... తద్వారా తదుపరి దశలో తెల్లబడి వెలవెలబోతాయనీ తేటతెల్లం చేశాడు. ఆ విషయం గుర్తెరిగిన జ్ఞాని కాబట్టే ఆయన మీసాలు పెంచలేదు. చౌడప్ప అనే మరో కవి... ‘మీసాలూ-అవి పెంచాల్సిన వారి లక్షణాలూ’ అనే అంశం మీద పద్యం రాశాడు. ‘ఇవ్వగల, ఇప్పించగల అయ్యలకే మీసాలుండాలనీ, మిగతావాళ్లకు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావ’ని కరాఖండీగా చెప్పాడు. మీసాలు ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిమ్మకాయ నిలబెట్టిన మీసమంత పవర్‌ఫుల్‌గా చెబుతూ... ‘ఆ మాటకొస్తే రొయ్యకు లేవా బారెడు’ అంటూ మిగతా మీసగాళ్లను అలా తీసిపడేశాడు. అత్యద్భుత కావ్యాలు రాసి... తన పద్యాలతో పండిత-పామరులతో ‘వన్స్‌మోర్’ అంటూ జేజేలు చెప్పించుకున్న జాషువా గారికి తన మీసాల పట్ల మోజు ఎక్కువ. ఒకసారి ప్రముఖ రచయిత, చిత్రకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్‌దేవ్‌గారు జాషువాను చూసి ‘ఇంతటి గుబురు మీసాలు లేకపోతే మీరు ఇంకెంత అందంగా ఉండేవారో కదా’ అన్నార్ట. వెంటనే జాషువా గారు తన వేళ్లతో ఒకసారి ఆ మీసాలను పైకి దువ్వుతూ, గట్టిగా నవ్వుతూ ‘నాలో కవిత్వం లేకపోయినా సహించగలను. కానీ మీసాలు లేకపోతే మాత్రం సహించ లేను’ అన్నార్ట. జాషువా గారు తన ఇష్టాన్ని అంత పవర్‌ఫుల్‌గా చెప్పారని అంటారు సంజీవ్‌దేవ్ గారు ‘కవి, మనీషి, జాషువాతో’ అనే తన వ్యాసంలో. జాషువా వంటి మహానుభావుడు మీసాలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడంటే కవిత్వం కంటే బలమైనది ఏదో మీసాల్లో ఉండే ఉంటుందని ఆ మీస వ్యాస రత్నాకరాన్ని పరిశీలిస్తే మనకు తెలిసి వస్తుంది. అలాంటి జాషువాగారు వృద్ధాప్యంలో పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోయేవారట. ఎవరైనా వచ్చి ‘కవిగారూ... ఎలా ఉన్నారు’ అని పలకరిస్తే... హుందాగా మీసం తిప్పి తాను మానసికంగా దృఢంగా ఉన్నానంటూ బదులిచ్చేవారట. అంటే సదరు పలుకుతో వచ్చే జవాబు కంటే మీసం దువ్వడం ద్వారా ఇచ్చే ఆన్సరే బలమైనదని తెలియడం లేదూ. ‘మెలిదిరిగిన మీసాలను సవరించుకుంటూ జాషువా కవిగారు కలియదిరుగుతుంటే చూస్తున్నవారికి శ్రీనాథ మహాకవి తలపునకు రాకమానడు’ అనుకుంటూ ఆయన మీసాలను తలచుకుంటూ ఉంటారు ఆయనతో కలిసి తిరిగినవారు. అంతెందుకు... ‘వియన్నా సులోచనాలూ, స్విట్జర్లాండు రిస్ట్ వాచి, ఫారెన్ డ్రస్, ఫ్రెంచి కటింగు మీసాలును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో...’ సొంత పెళ్లాలయినా మొగుణ్ణి పెద్దగా లెక్కచేయరని మృత్యుంజయ శతకం వంటి మహాద్భుత రచనలు చేసిన మాధవపెద్ది సుందరరామశాస్త్రి అనే కవిగారు మీసాల గొప్పదనాన్ని సెలవిచ్చారు. ‘మీసము పస మగ మూతికి’ అంటూ ఒక పక్క ఒక కవి అంటున్నా... ఇంకెవరో అజ్ఞాత కవి అధిక్షేపణ పూర్వకంగా పవర్‌ఫుల్‌గా తిడుతూ... ‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెతను పుట్టించాడు. ఇంచుమించూ ఇలాంటి అర్థమే వచ్చేలా ‘అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడు ఒకడు’ అంటూ మరొకరు కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. అంటే... మన పస తెలియజేయడానికి మీసాలు పెంచవచ్చు... కావాలంటే వాటికి సంపెంగ నూనె కూడా రాసుకోవచ్చు గానీ... మొదట ఉదర పోషణ జరగాలనీ, ఆ తర్వాతే మీస పోషణకు రావాలని సామెతలు సృష్టించిన ఆయా ప్రజాకవుల భావం. ఎవరేమనుకున్నా క్యాలెండర్ అన్నాక మాసాలూ... మగాడన్నాక మీసాలూ ఉండి తీరాల్సిందేనని కొందరు పురుషపుంగవుల అభిప్రాయం. కానీ పెంపుడు జంతువుల్లాగానే వాటినీ దువ్వుడానికే తప్ప మరో ఉపయోగం లేదని క్లీన్షేవోత్తములు వాకృచ్చుతూ ఉంటారు. పోనీ మీరూ పెంచరాదా అంటే... ‘ఎందుకు పెంచం’ అంటారే తప్ప గబుక్కున పెంచలేరు. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అలా క్యాట్ఫిష్షుల్లా ‘మీనమీసాలు’ లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. - యాసీన్ -
మీసాలు, గడ్డాలు మీకేనా..?
గడ్డాలు, మీసాలు మగవారికే సొంతమా.. ఏ మాకేం తక్కువ.. అనుకున్నారో ఏమో ఈ అతివలు! అందుకే అప్పటికప్పుడే వారికి నచ్చిన డిజైన్లలో గడ్డాలు, మీసాలు తెగ పెంచేశారు! అమ్మాయిలేంటీ.. గడ్డాలు పెంచడమేంటనుకుంటున్నారా.. అదేం లేదండీ.. ఇప్పుడు అమ్మాయిల్లో ఇదో క్రేజ్. జుట్టు మొత్తాన్ని ముందుకు అనుకుని గడ్డం, మీసం మాదిరిగా అల్లుకుని ఇన్స్టాగ్రాం, ట్వీటర్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి హల్చల్ చేస్తున్నారు ఈ భామలు. -
మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది...
కొందరు ఆడపిల్లలు అస్సలు మొహమాట పడరు. మబ్బులు మూయని చందమామను అడుగుతారు. ముల్లు మొలవని గులాబీలను అడుగుతారు. చేప ముట్టని నీళ్లు అడుగుతారు. మీసాలు గుచ్చుకోని ముద్దు కూడా అడుగుతారు. చారడేసి కళ్లు... చిట్టి పెదాలు... తొలి ప్రవాహపు మేటల్లాంటి నడుములు... ఇవి ఉన్న ఆడపిల్లలు వీటిని అడిగితే ఏం చేయాలి? అబ్బాయిలు... మీసం నిక్కిన మగధీరులు ఎవరితో చెప్పుకోవాలి? పాటతో చెప్పుకోవడమే. మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది... నాలుక కంటే ముందు పెదాలకే భాష తెలుసు. అవి విచ్చుకుంటే ఒక అర్థం. విడివడితే ఒక అర్థం. ముడుచుకుంటే ఒక అర్థం. బిగదీసుకుంటే ఒక అర్థం. పుట్టిన వెంటనే మనిషి తోడు తెచ్చుకునే కలం కాగితాలవి. కంఠాన్ని మ్యూట్‌లో పెట్టినప్పుడల్లా వాటితోనే పని. వాటి స్పర్శతోనే సంభాషణ. మాటలు చెప్పలేని మగవాళ్లు, కల్లబొల్లి కబుర్లతో మోసపుచ్చలేని మగవాళ్లు, ఒట్టి మాటల్నే నమ్ముకోలేని మగాళ్లు నుదుటి మీద ముద్దాడి ఏదో చెప్తారు. కనురెప్పలను ముద్దాడి మరేదో చేరవేస్తారు. చెంపలను ముద్దాడారంటే అది అతి పెద్ద ప్రశంసే. ఇక పెదాలపై ఉంచే ముద్దు నేను నీవాణ్ణే అనే సరెండరింగ్. ఇన్ని చెబుతున్నా ఓ కొంటె కోరిక రేగితే? కోరుకున్న వాణ్ణి కాసేపు పరీక్షకు పెడదాం అనే సరదా ఆమెకు పుడితే? కందిపువ్వల్లే ముట్టుకుంటాను కందిరీగల్లే కుట్టి పోతాను కుచ్చిళ్లు జారకుండా ఓరి బావో కౌగిళ్లు ఇవ్వా నువ్వూ... కందిపువ్వుతో ఒక బాధ. కందిరీగతో ఇంకో బాధ. ఈ రెండూ బాధలూ చాలక కుచ్చిళ్లు చెదరకుండా ముద్దు పెట్టడం ఇంకా పెద్ద బాధ. అఆలను బడిలో నేర్పిస్తారు. కర్రసాము ఊరి చావిడిలో సాధన చేయిస్తారు. పంట కోతకూ, కుప్పనూర్పిడికీ పంటపొలాలనే విశ్వవిద్యాలయాలు ఉండనే ఉన్నాయి. మరి ఈ విద్యను నేర్చుకోవడం ఎలా? అమ్మాయి ముచ్చట తీర్చడం ఎలా? అదీ మామూలు అమ్మాయైతే సరే. ఈ పిల్ల ఫిరంగీ. ఆ పిట్ట గోడెక్కి నించుందిరో కొమ్మొంచి కాయేదో తుంచిందిరో అది జాంపండులా నను తింటోందిరో.... మరేం పర్లేదురా అబ్బీ. సీనియర్లుంటారు. సలహా అడుగు. చుంబనశాస్త్ర పారంగతులు ఉంటారు. శరణు కోరు. నారీ ఉపాసనలో మెడ లోతు కూరుకుపోయినవారుంటారు. కిటుకులు సంగ్రహించు. ఉత్త చేతులతో శివంగులనే లోబరుచుకున్న చరిత్ర మనది. స్త్రీని జయించడం ఒక లెఖ్ఖా. కాకుంటే పోరాట పద్ధతులే వేరు. కనుచూపుతో కలబడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రయోగించి అతి సులువుగా బంధించాలి. దట్సాల్. అంతే. చెప్పెయ్. నీ గుండెల్లో ఏముందో అంతా చెప్పెయ్. ఓసారి నాతోని సై అంటెరో దాసోహమౌతాను నూరేళ్లురో ఇక తన కాళ్లకే పసుపౌతానురో.... వార్నీ. ఇదా నీ ప్రయోజకత్వం. కాళ్లకు పసుపవుతావా? కంఠానికి చందనమవుతావా? చిటికెన వేలికి మరో చిటికెన వేలు అందిస్తావా? హూ. తరతరాలుగా ఇదే కదా నరుడి ప్రారబ్ధం. నారికి లోబడటం. నువ్వు చేయగలిగిందేముందిలే. సామ్రాట్టులది అదే గతి. సామాన్యుడిదీ అదే రీతి. పోనీయ్. ఆ నీలి చీర కట్టుకుని, ఆ పొడవు జడ చుట్టుని, పాపిటలో నీ చూపులను వేలాడగట్టుకుని ఆ అమ్మాయి అలా నడుచుకొస్తే పాదాలకు పసుపు కావడమే సార్థకత. పెనవేసుకొని పరాజయం ప్రకటించడమే మగాడి సిసలైన పరాక్రమత. ఒప్పుకో. చేతులెత్తెయ్. మీసాలు గుచ్చకుండా ఒరి భామా ముద్దాడలేనే నేను..... కుదురుగా లడ్డు కూరినట్టు కొన్ని సినిమాలకు లక్కీగా అన్నీ సమకూరుతాయ్. చందమామ అలాంటి సినిమా. కృష్ణవంశీ, సంగీత దర్శకుడు రాధాకృష్ణన్, సుద్దాల అశోక్ తేజ ఈ పాటను ఒక తిరునాళ్లలా తీర్చిదిద్దారు. విన్నా, చూసినా, పాల్గొన్నా ఉత్సవం రేపే పాట ఇది. తెలుగువారికి పౌరుషం ఎక్కువని అంటారు. దాని దాఖలా కనిపించి చాలా రోజులవుతోంది. వారికి సరసం ఎక్కువ అని కూడా అంటారు. అందుకు దాఖలా మాత్రం- ఆడపిల్ల బుగ్గన అందంగా పండిన తాంబూలం లాంటి ఈ పాటే. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి సినిమా: చందమామ (2007) పాట: రేగు ముల్లోలె రచన: సుద్దాల అశోక్ తేజ