మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది... | Chandamama movie song story | Sakshi
Sakshi News home page

మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది...

Published Sun, May 31 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది...

మీసాలు గుచ్చాకుండా ఓరి బావో ముద్దాడతావా అంది...

కొందరు ఆడపిల్లలు అస్సలు మొహమాట పడరు. మబ్బులు మూయని చందమామను అడుగుతారు. ముల్లు మొలవని గులాబీలను అడుగుతారు. చేప ముట్టని నీళ్లు అడుగుతారు. మీసాలు గుచ్చుకోని ముద్దు కూడా అడుగుతారు. చారడేసి కళ్లు... చిట్టి పెదాలు... తొలి ప్రవాహపు మేటల్లాంటి నడుములు... ఇవి ఉన్న ఆడపిల్లలు వీటిని అడిగితే ఏం చేయాలి? అబ్బాయిలు... మీసం నిక్కిన మగధీరులు ఎవరితో చెప్పుకోవాలి? పాటతో చెప్పుకోవడమే.
 
మీసాలు గుచ్చాకుండా
ఓరి బావో ముద్దాడతావా అంది...

నాలుక కంటే ముందు పెదాలకే భాష తెలుసు. అవి విచ్చుకుంటే ఒక అర్థం. విడివడితే ఒక అర్థం. ముడుచుకుంటే ఒక అర్థం. బిగదీసుకుంటే ఒక అర్థం. పుట్టిన వెంటనే మనిషి తోడు తెచ్చుకునే కలం కాగితాలవి. కంఠాన్ని మ్యూట్‌లో పెట్టినప్పుడల్లా వాటితోనే పని. వాటి స్పర్శతోనే సంభాషణ. మాటలు చెప్పలేని మగవాళ్లు, కల్లబొల్లి కబుర్లతో మోసపుచ్చలేని మగవాళ్లు, ఒట్టి మాటల్నే నమ్ముకోలేని మగాళ్లు నుదుటి మీద ముద్దాడి ఏదో చెప్తారు.

కనురెప్పలను ముద్దాడి మరేదో చేరవేస్తారు. చెంపలను ముద్దాడారంటే అది అతి పెద్ద ప్రశంసే. ఇక పెదాలపై ఉంచే ముద్దు నేను నీవాణ్ణే అనే సరెండరింగ్. ఇన్ని చెబుతున్నా ఓ కొంటె కోరిక రేగితే? కోరుకున్న వాణ్ణి కాసేపు పరీక్షకు పెడదాం అనే సరదా ఆమెకు పుడితే?
 
కందిపువ్వల్లే ముట్టుకుంటాను
కందిరీగల్లే కుట్టి పోతాను
కుచ్చిళ్లు జారకుండా ఓరి బావో కౌగిళ్లు ఇవ్వా నువ్వూ...

కందిపువ్వుతో ఒక బాధ. కందిరీగతో ఇంకో బాధ. ఈ రెండూ బాధలూ చాలక కుచ్చిళ్లు చెదరకుండా ముద్దు పెట్టడం ఇంకా పెద్ద బాధ. అఆలను బడిలో నేర్పిస్తారు. కర్రసాము ఊరి చావిడిలో సాధన చేయిస్తారు. పంట కోతకూ, కుప్పనూర్పిడికీ పంటపొలాలనే విశ్వవిద్యాలయాలు ఉండనే ఉన్నాయి. మరి ఈ విద్యను నేర్చుకోవడం ఎలా? అమ్మాయి ముచ్చట తీర్చడం ఎలా? అదీ మామూలు అమ్మాయైతే సరే. ఈ పిల్ల ఫిరంగీ.
 
ఆ పిట్ట గోడెక్కి నించుందిరో
కొమ్మొంచి కాయేదో తుంచిందిరో
అది జాంపండులా నను తింటోందిరో....

మరేం పర్లేదురా అబ్బీ. సీనియర్లుంటారు. సలహా అడుగు. చుంబనశాస్త్ర పారంగతులు ఉంటారు. శరణు కోరు. నారీ ఉపాసనలో మెడ లోతు కూరుకుపోయినవారుంటారు. కిటుకులు సంగ్రహించు. ఉత్త చేతులతో శివంగులనే లోబరుచుకున్న చరిత్ర మనది. స్త్రీని జయించడం ఒక లెఖ్ఖా. కాకుంటే పోరాట పద్ధతులే వేరు. కనుచూపుతో కలబడాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రయోగించి అతి సులువుగా బంధించాలి. దట్సాల్. అంతే. చెప్పెయ్. నీ గుండెల్లో ఏముందో అంతా చెప్పెయ్.
 
ఓసారి నాతోని సై అంటెరో
దాసోహమౌతాను నూరేళ్లురో
ఇక తన కాళ్లకే పసుపౌతానురో....

వార్నీ. ఇదా నీ ప్రయోజకత్వం. కాళ్లకు పసుపవుతావా? కంఠానికి చందనమవుతావా? చిటికెన వేలికి మరో చిటికెన వేలు అందిస్తావా? హూ. తరతరాలుగా ఇదే కదా నరుడి ప్రారబ్ధం. నారికి లోబడటం. నువ్వు చేయగలిగిందేముందిలే. సామ్రాట్టులది అదే గతి. సామాన్యుడిదీ అదే రీతి. పోనీయ్. ఆ నీలి చీర కట్టుకుని, ఆ పొడవు జడ చుట్టుని, పాపిటలో నీ చూపులను వేలాడగట్టుకుని ఆ అమ్మాయి అలా నడుచుకొస్తే పాదాలకు పసుపు కావడమే సార్థకత. పెనవేసుకొని పరాజయం ప్రకటించడమే మగాడి సిసలైన పరాక్రమత. ఒప్పుకో. చేతులెత్తెయ్.
 
మీసాలు గుచ్చకుండా
ఒరి భామా ముద్దాడలేనే నేను.....

కుదురుగా లడ్డు కూరినట్టు కొన్ని సినిమాలకు లక్కీగా అన్నీ సమకూరుతాయ్. చందమామ అలాంటి సినిమా. కృష్ణవంశీ, సంగీత దర్శకుడు రాధాకృష్ణన్, సుద్దాల అశోక్ తేజ ఈ పాటను ఒక తిరునాళ్లలా తీర్చిదిద్దారు. విన్నా, చూసినా, పాల్గొన్నా ఉత్సవం రేపే పాట ఇది. తెలుగువారికి పౌరుషం ఎక్కువని అంటారు. దాని దాఖలా కనిపించి చాలా రోజులవుతోంది. వారికి సరసం ఎక్కువ అని కూడా అంటారు. అందుకు దాఖలా మాత్రం- ఆడపిల్ల బుగ్గన అందంగా పండిన తాంబూలం లాంటి ఈ పాటే.
 - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

 సినిమా: చందమామ (2007)
పాట: రేగు ముల్లోలె
రచన: సుద్దాల అశోక్ తేజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement