రాజస్తాన్‌తోపాటు యావద్భారతం దృష్టిని ఆకర్శిస్తున్న స్థానం రాజస్తాన్‌లోని టోంక్ నియోజకవర్గం. తొలిసారి అసెంబ్లీ బరిలో దిగిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల్లో ఒకడైన సచిన్ పైలట్‌కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఇన్నాళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న టోంక్‌లో గెలవడం సచిన్‌కు ఆవశ్యకం కూడా. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా చివరి నిమిషంలో సచిన్‌ను టోంక్‌నుంచి పోటీ చేయించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు, గుజ్జర్లు ఎక్కువగా ఉండే టోంక్‌లో గుజ్జర్ నేతగా సచిన్ గెలవడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ భావించింది. అయితే.. బీజేపీ కూడా ఆఖరి నిమిషంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే ఇక్కడ బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ముస్లింను బరిలో దించడం ద్వారా సచిన్‌కు సరైన సవాల్ విసరాలనేది బీజేపీ వ్యూహం.
సచిన్ కరిజ్మాపై విశ్వాసం
తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సచిన్‌కు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజేశ్ పైలెట్ కుమారుడిగా ఆయనకో ఇమేజ్ ఉంది. అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా నెగ్గడం సచిన్‌కు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ.. బీజేపీ చివరి నిముషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్‌సింగ్‌ను పక్కన పెట్టి యూనస్ ఖాన్‌కు టిక్కెట్ ఇవ్వడంతో రసవత్తర పోటీకి తెరలేచింది.
ఇద్దరూ కొత్తవారే
టోంక్‌లో కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్లుగా ముస్లిం అభ్యర్థినే నిలబెడుతూ వస్తోంది. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని సచిన్‌ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి సచిన్ పైలెట్ పూర్తిగా కొత్త. కానీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో టోంక్‌లో ‘మేరా బూత్, మేరా గౌరవ్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొంత పట్టు సాధించారు. 2004లో దౌసా నుంచి 2009లో అజ్మీర్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో ఓటమిపాలయ్యారు. లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహించిన దౌసా, అజ్మీర్‌లకు సరిగ్గా మధ్యలో టోంక్ నియోజకవర్గం ఉంది. సచిన్ తన చిన్నతనంలో టోంక్ జిల్లాలోని దేవ్‌నారాయణ్ ఆలయానికి (గుజ్జర్ల తమ కులదైవంగా భావిస్తారు) వస్తూ ఉండేవారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన ఇద్దరు కుమారులతో కలిసి సచిన్ ఈ దేవాలయాన్ని సందర్శించారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న యూనస్ ఖాన్ కూడా నియోజకవర్గానికి కొత్తవారే. ముస్లిం ఓటర్లే అండగా ఉంటారన్న నమ్మకంతో బీజేపీ ఆయన్ను బరిలో దింపింది. రాష్ట్రంలో బీజేపీ టిక్కెట్ ఇచ్చిన ముస్లిం అభ్యర్థి యూనస్ మాత్రమే. దీద్వానా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన యూనస్ ఖాన్.. సీఎం రాజేకు సన్నిహితుడు. రాజస్థాన్ ప్రభుత్వంలో రాజే తర్వాతి స్థానంలో ఉన్నారు. అటు పైలెట్, ఇటు ఖాన్ ఇద్దరూ టోంక్‌కి కొత్తవారే. దీంతో వారి వ్యక్తిగత కరిజ్మా, కులసమీకరణలే కీలకం కానున్నాయి.
మామ అండ కలిసొచ్చేనా?
సచిన్ అభ్యర్థిత్వం స్థానిక ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. మెజార్టీ ఓట్లు ఉన్న తమని కాదని గుజ్జర్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. మైనార్టీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కూడా. అయితే సచిన్ పైలెట్‌కు పిల్లనిచ్చిన మామ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా అల్లుడికి అండగా నిలిచారు. ఫారుఖ్ అబ్దుల్లాకి టోంక్‌లోని సైదీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈ ఇంటి పెద్ద డాక్టర్ అజ్మల్ సైదీ, ఫరూక్ అబ్దుల్లా ఒకే కాలేజీలో చదువుకున్నారు. దీంతో ఫరూక్ తరచూ టోంక్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముస్లిం కుటుంబమంతా సచిన్‌ను తమ అల్లుడిగా భావిస్తోంది. ఒక పేరున్న నేత తమ నియోజకవర్గంలో విజయం సాధిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడుతోంది. సచిన్‌కు అండగా ఉంటామని ఆ కుటుంబం హామీ ఇచ్చింది. అజ్మల్ సైదీ కుమారుడు సాద్ సైదీ మొన్నటివరకు టోంక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న మరో నవాబు అఫ్తాబ్ అలీఖాన్ కూడా సచిన్ పైలట్‌కే మద్దతు తెలిపారు.
కౌన్ బనేగా..టోంక్‌పతి!
Published Sat, Nov 24 2018 3:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment