
అభ్యర్ధి గుణగణాలు, పార్టీల హామీల కన్నా కులమే మన ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఈ కులాల కుంపట్లు ఎన్నికలప్పుడు ఆగకుండా రగులుతుంటాయి.కుల రహిత సమాజానికి కట్టుబడ్డామనే రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం ఎక్కడికక్కడ కులకుంపట్లు ఆరిపోకుండా రాజేస్తుంటారు. దీంతో ఎన్నికల్లో కులమే బలంగా మారుతోంది. ఈ దఫా రాజస్తానంలో కుల రగడ ఎక్కువైంది. క్యాస్ట్ పాలిట్రిక్స్ ఊపందుకున్నాయి.
భారత ఎన్నికల్లో అర్ధబలానికి ఉన్నంత ప్రాధాన్యం అంగబలానికి కూడా ఉంది. చాలా చోట్ల కులమే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తుంటుంది. రాజస్థాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ ఎన్నికల్లో కులం ప్రభావం అధికం. రాజస్తాన్ ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలు, అంశాలకన్నా కులం,వర్గం డామినేషనే ఎక్కువ. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలు ప్రస్తావించినా చివరికి అభ్యర్థి గెలుపును నిర్ణయించేది ఓటర్ల మదిలో మెదిలేది కులమే. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక కులం మెజారిటీగా ఉండటం, ఎన్నికల్లో దాని ప్రభావం కనబడడం చూస్తాం. రాజస్థాన్‌లో మాత్రం అటు రాజ్‌పుత్‌లు, ఇటు జాట్‌లు సమ ఉజ్జీలుగా ఉన్నారు. వీరితో పాటు గుజర్లు, మీనాలు కూడా ఇటీవల కాలంలో కీలకంగా మారారు.
ఏ కులం ఎక్కడ?
రాష్ట్రంలో ఒక్కోకులానికి ఒక్కో ప్రాంతంలో పట్టు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో రాజ్‌పుత్‌ల వాటా 12శాతం. వీళ్లు దాదాపు 25 నియోజకవర్గాలో నిర్ణయాత్మక శక్తిగా, మరో 25 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నారు. శ్రీగంగానగర్, బికనీర్, జుంజును, సికార్, జోధ్‌పూర్, బర్మార్ జైలస్మేర్, చిత్తోర్‌గఢ్ ప్రాంతాల్లో రాజ్‌పుత్‌లు బలంగా ఉన్నారు. జాట్‌లు కూడా జనాభాలో దాదాపు 12శాతం ఉన్నారు.రాజ్‌పుత్‌ల తర్వాత బలమైన వర్గంగా ఉన్న వీరు డజన్ జిలాల్లోని 25 నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా, మరో 25–30 స్థానాల్లో ప్రభావిత శక్తిగా ఉన్నారు.
రాష్ట్ర జనాభాలో 9 శాతం ఉన్న గుజ్జార్లు, 7 శాతం ఉన్న మీనాలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు. దాదాపు 50 – 60 అసెంబ్లీ స్థానాల్లో వీరు గెలుపోటములను నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారు. మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో వీరు చాలా కీలకంగా మారారు.
మారుతున్న సమీకరణలు
రాజ్‌పుత్‌లు పూర్వకాలం నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంటే, జాట్‌లు, ముస్లింలు, ఎస్సీ,ఎస్టీలు కాంగ్రెస్‌కు మద్దతు నిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ సమీకరణాలు కొంచెం అటూఇటూ అయ్యాయి. బీజేపీకి రాజ్‌పుత్‌లు దూరం కావడం,జాట్‌లు కాంగ్రెస్‌కు ఎదురుతిరిగే పరిస్థితులు ఏర్పడంతో ఈ సారి ఎన్నికల్లో కుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తిదాయకం. మరోవైపు గుజ్జార్‌లు బీజీపీ పంచన చేరుతోంటే మీనాలు కాంగ్రెస్ నీడకు వస్తున్నారు. ఎస్టీలుగా ఉన్న మీనాలకు గుజ్జార్లకు మధ్య రిజర్వేషన్లకు సంబంధించి తీవ్ర పోరాటం జరుగుతోంది. తమను ఓబీసీల్లోంచి ఎస్‌టీలుగా మార్చాలని గుజ్జార్స్, అలా చేస్తే తమకు ఇక్కట్లు వస్తాయని మీనాలు ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లను ఏ పార్టీ కాపాడుతుందో దానికే ఓటు వేయడానికి ఈ రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయి.
మరోవైపు గతంలోలాగా కేవలం రాజ్‌పుత్‌లు, జాట్‌లను నమ్ముకుంటే అధికారం దక్కదని రాజకీయ పార్టీలకు స్పష్టమయింది. అందుకే అన్ని కులాలకు తమ ప్రచారంలో ప్రాధాన్యమిస్తున్నాయి. అంతే కాకుండా అవసరమనుకుంటే రాజ్‌పుత్,జాట్ వర్గాల్లో ప్రధాన నేతలనైనా పక్కకు తప్పిస్తున్నాయి. తాజాగా రాజ్‌పుత్‌లలో మంచి పట్టున్న మానవేంద్ర సింగ్‌ను వదులుకోవడానికి బీజేపీ పెద్దగా ఆలోచించలేదు. అలాగే, మానవేంద్ర సింగ్‌ను పార్టీలోకి చేర్చుకుంటే పార్టీకి ఇప్పటివరకు అండగా ఉన్న జాట్‌లకు ఆగ్రహం వస్తుందని తెలుస్తున్నా కాంగ్రెస్ వెనకడుగు వేయలేదు. ఇరు పార్టీలూ ప్రధాన కులాలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో మెజార్టీ కులం ఏదిఉంటే అక్కడ ఆ కులం అభ్యర్థిని నిలబెడుతున్నాయి.
రెండురకాల రాజకీయం
రాజస్థాన్‌లో రాజకీయాలు రెండు రకాలుగా నడుస్తున్నాయి. కులాల ఆధారంగా నడిచేవి ఒకటయితే, రిజర్వేషన్ల పేరుతో నడిచేవి మరోరకం. కులాల వారి రాజకీయాల్లో కులం వారంతా మూకుమ్మడిగా ఒకరికే ఓటు వేస్తారు. ప్రయోజనాలు కూడా అందరూ పొందుతారు. ఇక రిజర్వేషన్ రాజకీయాల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం తమను లాభదాయక కేటగిరిలో పెడుతుందనే దాన్ని బట్టి ఓట్లు వేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో కులం పేరును తరుచు ప్రస్తావించాలని కూడా అభ్యర్థులకు గట్టిగా చెబుతున్నాయి. ప్రచారంలో ఆయా కులాలకు తమ హయాంలో లభించిన ప్రయోజనాలను వివరిస్తుంటాయి.
రాజపుత్రులు వర్సెస్ జాట్స్
రాజపుత్రుల రాజ్యమైన రాజస్థాన్‌లో చరిత్ర కాలం నుంచి వారిదే ఆధిపత్యం. రాజపుత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాకా కూడా కొంత కాలం వారి హవా నడిచింది. 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో వీరి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లలో రాజ్‌పుత్‌లు గెలిచారు. జాట్‌లు 12సీట్లు,బ్రాహ్మణులు 22స్థానాలు గెలుచుకున్నారు. కాలక్రమేణ ప్రజల మనసుల్లో రాచరిక భావనలు తొలగిపోవడంతో రాజ్‌పుత్‌ల ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఆ మేరకు జాట్‌ల బలం పెరిగింది. 1957లో జరిగిన ఎన్నికల్లో రాజ్‌పుత్‌లు కేవలం 26 స్థానాలు మాత్రమే గెలుచుకోగా జాట్‌లు 23 చోట్ల పాగా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment