రాజస్తాన్‌లో రాజకీయ పార్టీలకు విద్యార్థులు (18 ఏళ్ల లోపు వారే) తమ డిమాండ్ల చిట్టాను ఇచ్చారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లను ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేదని తమ డిమాండ్లను చిన్న చూపు చూడొద్దని.. భవిష్యత్ ఓటర్లుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ డిమాండ్లకు జైపూర్‌లో జరిగిన ‘దశమ్’ కార్యక్రమం వేదికైంది. రాష్ట్ర విద్యా హక్కు చట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా 18 ఏళ్ల లోపువారే. వీరంతా కలిసి కూర్చుని పలు డిమాండ్లు రూపొందించారు.
అందులో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల సరఫరా, స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం, గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి అంశాలున్నాయి. పలు అంశాలతో ఓ బుక్‌లెట్‌ను రూపొం దించి.. దీన్ని కార్యక్రమానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులకు అందించారు. వీటిని పార్టీలన్నీ తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థి ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఈ అంశాలపై చర్చించాలని కూడా నిర్ణయించారు. రాజస్తాన్ జనాభాలో 41% మంది 18 ఏళ్ల లోపు వారే. వచ్చేసారి వీరి ఓట్లే పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్లపై ఆచితూచి స్పందించాల్సిందే.
అక్కడ మహిళ గెలవలేదు!
రాజస్తాన్‌లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలవలేదు. హదోటీ ప్రాంతంలోని ఈ ఆరు చోట్ల 1952 నుంచి ప్రతిసారీ పురుష ఓటర్లే గెలుస్తూ వస్తున్నారు. ఇవి కోటా (ఉత్తర), కోటా (దక్షిణ), పిపాల్దా, బరన్, అంతా, అత్రు, మనోహర్ థానా, కేశోరాయ్ పటన్ నియోజకవర్గాలు. అయితే ఇక్కడ మహిళలు పోటీ చేయలేదా అంటే.. అదీ కాదు.
ప్రతిసారీ కనీసం ఇద్దరు, ముగ్గురు మహిళలు పోటీలో ఉంటూనే ఉన్నా గెలవడం లేదు. ‘ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు కానీ.. వారికి సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. అవన్నీ పురుషాధిక్య పార్టీలే’ అని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. హదోటీ ప్రాంతంలోని 18 నియోజకవర్గాల్లో మొత్తం మీద ఇప్పటివరకు కేవలం పదంటే పదిమంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో ప్రస్తుత సీఎం వసుంధరా రాజేనే నాలుగుసార్లు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment