రాజస్తాన్‌లో ముస్లింలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న పలు నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఉండొచ్చన్న అంచనాలు కాంగ్రెస్‌ను భయపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు కలిసి కాంగ్రెస్ కొంప ముంచారు. ఈ నియోజకవర్గాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులకు మధ్య ఓట్ల తేడా సదరు నియోజకవర్గంలో ఇతర ముస్లిం అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. అంటే సదరు రెబెల్స్ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారనేది సుస్పష్టం. అయితే ముస్లిం పెద్దలు మాత్రం బలహీన అభ్యర్థులను నిలబెట్టినందుకే కాంగ్రెస్ ఓటమిపాలయిందని విమర్శిస్తున్నారు.
2013లో కాంగ్రెస్ 16 నియోజకవర్గాల్లో ముస్లింలను నిలబెట్టింది. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. కానీ అందరూ ఓడిపోయారు. ప్రస్తుతం రాజస్తాన్ అసెంబ్లీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అది కూడా బీజేపీ నుంచి గెలిచినవారే. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా తక్కువ మంది ముస్లింలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసినవాళ్లకు గుర్తింపు ఉండదని, చివరి నిమిషంలో ఎవరో వచ్చి టికెట్ తన్నుకుపోతారని టోన్ నియోజకవర్గంలో రెబెల్‌గా పోటీ చేసిన సౌద్ సైదీ విమర్శించారు. ఇలాంటి విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఇటీవలే పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ అసంతృప్తులను చల్లబరిచేందుకు ఓ వేదికను ఏర్పాటుచేశారు. రాజస్తాన్‌లో దాదాపు 14 స్థానాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.
బీజేపీ కారణమా?
ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న స్థానాల్లో బీజేపీ కావాలని స్వతంత్ర ముస్లిం అభ్యర్థులను నియమిస్తోందని కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే కేవలం ఈ ఒక్క అంశమే తమ ఓటమికి కారణం కాదని పీసీసీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నిజామ్ ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులకు సీట్లివ్వడమే తమ కొంపముంచిందని ఆయన విశ్లేషిస్తున్నారు. రెబెల్స్, స్వతంత్రులు లేకుంటే ముస్లి ప్రాబల్యమున్న స్థానాలన్నీ తమ ఖాతాలోకే వచ్చేవని వాపోయారు.
అయితే కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్దులు బలహీనులు కావడం వల్లనే వారు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకుడు అష్ఫాక్ కాయంఖని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బలమైన ముస్లిం లీడర్స్ ఎదగడాన్ని సహించదని, అందుకే కావాలని బలహీనులను బరిలోదింపి ఓడించిందని విమర్శించారు. జనాభాలో 12% ఉన్న ముస్లింల ప్రయోజనాలను కాపాడాలని, వారికి తగినన్ని సీట్లు కేటాయించాలని సెక్యులర్ పార్టీలకు రాజస్తాన్ ముస్లిం ఫోరం విజ్ఞప్తి చేసింది. గౌరవప్రదంగా చూడకుంటే ఇతర అవకాశాలను పరిశీలించడానికి ముస్లింలు వెనుకాడరని, ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడడాన్ని మానుకోవాలని ఫోరం కన్వీనర్ క్వారీ మొయినుద్దీన్ హెచ్చరించారు.
రె‘బెల్స్’ మోగుతాయని..
Published Fri, Nov 9 2018 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment