
జైపూర్ : రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం ఎదురైంది. నిర్లక్ష్యంగా కారు నడిపి తమపై బురద పడేసాడంటూ కొంత మంది యువకులు... ఆయనను అడ్డగించి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. అసలేం జరిగిందంటే.... కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవతి లాల్.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో ర్యాలీకి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. జోసావా గ్రామం చేరుకోగానే అక్కడ ఉన్న నీటి గుంటను గమనించకుండా కారును వేగంగా పోనిచ్చారు.
ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న నలుగురు యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఆయన కారును చేజ్ చేసి మరీ ఆపారు. హడావుడిగా వెళ్తున్న కారణంగానే ఇలా జరిగిందని చెప్పినా వినకుండా.. ఆయనను మోకాళ్లపై నిలబెట్టి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా ఈ ఘటనపై దుగన్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురువారం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘భగవతి లాల్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆ యువకులను వారి సామాజిక వర్గానికి(పాటీదార్) చెందిన పెద్దలు పిలిచి మందలించారు. అంతేకాకుండా భగవతిని ఎలా అయితే అవమానించారో అదే రీతిలో(వాళ్లతో నేలకు ముక్కు రాయించి) వారికి క్షమాపణ కూడా చెప్పించారు’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment