రాజస్తాన్‌లో ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఇక్కడి ప్రజలు ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఈ ఆనవాయితీని బ్రేక్ చేయాలని తహతహలాడుతోంది. ఒకవేళ బీజేపీ ఈసారి అధికారాన్ని నిలబెట్టుకుంటే.. అది ‘ముఖ్యమంత్రి జల స్వావలంబన యోజన’ కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు 12 వేల గ్రామాల్లో ఈ పథకం విజయవంతగా సాగుతూ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. అంటే సుమారు 60 నియోజకవర్గాల్లో ఈ పథకం బీజేపీకి ఓట్లు కురిపించే అవకాశం ఉంది. విపక్షాలన్నీ మిగిలిన రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తుంటే.. బీజేపీ మాత్రం పథకం ద్వారా లబ్ధిపొందిన నియోజకవర్గాల్లో దీన్నే ప్రచారం చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయి వ్యూహరచన, కార్యాచరణ మొత్తం మన తెలుగు వ్యక్తిదే కావడం గమనార్హం. జలవనరుల నిపుణుడు, తెలంగాణ బీజేపీ నేత వెదిరె శ్రీరాం చేస్తున్న భగీరథ ప్రయత్నమే ఈ ‘ముఖ్యమంత్రి జల స్వావలంభన యోజన’. రాజస్తాన్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ పథకం ద్వారా అమలు చేస్తున్న ఈ చతుర్విధ జల సంరక్షణ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు నీతిఆయోగ్ ప్రణాళిక రచిస్తోందంటే.. మన తెలుగోడి సత్తా ఏ స్థాయిలో సత్ఫలితాలు అందిస్తుందో అవగతమవుతుంది.
రాజకీయంగా కీలకమే
ఇలా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంపిక చేసి ఎడారి రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం వసుంధరా రాజే తీవ్రంగా శ్రమించారు. దీన్నో యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లారు. సాగునీరుతోపాటు తాగునీటిని అందించే విషయంలో తన లక్ష్యాలను నిపుణులతో పంచుకున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమిష్టిగా కదలడంతో ఒక ఉద్యమంలా మారిన ఈ జల సంరక్షణ పథకం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పుడదే రాజకీయంగా ఆమెకు అనుకూలంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 60 నియోజకవర్గాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం రాజకీయంగా వసుంధరకు అత్యంత అవసరం. అటు కాంగ్రెస్‌కు కూడా ఈ పథకం విజయవంతంగా అమలైన ప్రాంతాల్లో రాజే ప్రాభవానికి వీలైనంత గండి కొట్టడం చాలా అవసరమే. అందుకే నీటి వసతి సంగతి సరే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ప్రచారం చేస్తోంది. దీంతో రాజకీయంగా ఈ 60 నియోజకవర్గాలు అధికారంలోకి రావాలనుకునే వారికి కీలకమ్యాయి. జలవనరులను సమకూర్చడంతో బీజేపీ, రాజేపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్నందున దీని ప్రభావం ఈ ప్రాంతాల్లోనూ ఉంటుందనేది కాంగ్రెస్ అభిప్రాయం.
నీటి బొట్టును ఒడిసిపట్టి..
కరవు కాటకాలతో నిత్యం తల్లడిల్లుతున్న రాజస్థాన్‌లో నీటి కొరతను కొంతమాత్రమైనా తీర్చే ప్రయత్నంలో.. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం సాయాన్ని రాజే తీసుకున్నారు. రాజస్తాన్‌లో సగటు వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 970 మి.మీ. వరకు ఉంటుంది. ఇలాంటి ఎడారి ప్రాంతాన్ని శ్రీరాం సాయంతో హరిత రాజస్తాన్‌గా మార్చేందుకు రాజే సంకల్పించారు. ముఖ్యమంత్రి జల స్వావలంబన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణకు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ టి.హనుమంతరావు ప్రతిపాదించిన ‘చతుర్విధ జల సంరక్షణ’ ప్రక్రియను శ్రీరాం వెదిరె ఇక్కడ అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్ నాణ్యత పర్యవేక్షణ అధికారులుగా ప్రత్యేక డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్ మాజీ చీఫ్ ఇంజినీర్ రమేష్ సాంకేతిక సాయం అందిస్తున్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి చుక్కలను ఒడిసిపట్టి వాటిని భూమిలో ఇంకేలా చేసేందుకు మూడు రకాలుగా కందకాలు తవ్వడం, వాటి కింది భాగంలో చిన్న, చిన్న ఊట చెలిమలు సృష్టించడం, ఇంకా కింది ప్రాంతంలో చెరువులు, చెక్ డ్యాములు నిర్మించడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో భాగం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగిస్తున్నారు. శాటిలైట్ మ్యాపులు, డ్రోన్ల సహాయంతో సర్వే చేసి జల సంరక్షణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు.
సమ్మిళిత నీటి సూచికలో పైపైకి
ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన సమ్మిళిత నీటి సూచికలో రాజస్తాన్ 2015–16లో 13వ స్థానంలో ఉండగా 2016–17లో 10వ స్థానానికి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల కంటే 2016–17లో రాజస్తాన్‌కు ఎక్కువ స్కోర్ పెంచుకుంది. భూఉపరితల నీటి వనరులను సృష్టించడం, పాత నీటి వనరులను రీఛార్జ్ చేయడం, నీటి వినియోగ సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రజల భాగస్వామ్యం పెరగడం వంటి అంశాల ఆధారంగా రాజస్తాన్ ఈ స్కోర్ సాధించింది. డ్రోన్లు, శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా నీటి వనరుల అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఈ పథకం రాజస్తాన్ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో.. ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఫలితాలను నిర్ణయించే శక్తిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఐదారేళ్లు చేస్తే.. వంద శాతం..
– శ్రీరాం వెదిరె, ఆర్‌ఎస్‌బీఏ ఛైర్మన్
ఐదారేళ్లు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే రాజస్తాన్‌లో 100% ఫలితాలు సాధించవచ్చు. ఈ ప్రక్రియను స్వయంగా తిలకిస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో అమలు చేయాలని కోరుతున్నారు. ప్రధాని సూచన మేరకు దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని నీతిఆయోగ్ భావిస్తోంది. ఈ పథకం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అమూల్యమైన ప్రయోజనం చేకూరుతుంది. గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తాగునీరందుతోంది. తృణ ధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతోపాటు బత్తాయి వంటి ఉద్యానవన పంటల విస్తీర్ణం కూడా పెరుగుతోంది. బీడు భూముల్లో పంట సాగుతోపాటు పశుగ్రాసం కూడా లభిస్తుండడంతో పశుసంపద కూడా వృద్ధి చెందనుంది.
.:: రాజస్తాన్ నుంచి లెంకల ప్రవీణ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment