ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు | 50 lakh jobs in five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు

Published Wed, Nov 28 2018 2:43 AM | Last Updated on Wed, Nov 28 2018 8:22 AM

50 lakh jobs in five years - Sakshi

జైపూర్‌: ఏడాదికి 30 వేల ప్రభుత్వ, 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల ఆదాయం రెట్టింపు తదితర భారీ హామీలతో రాజస్తాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో అధికార బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విడుదల చేశారు. 

ముఖ్యమైన హామీలు 
ప్రతీ ఏడాది ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ప్రైవేటు రంగంలో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల (స్వయం ఉపాధి సహా మొత్తం ఐదేళ్లలో 50 లక్షలు) సృష్టి. ఎన్‌ఆర్‌ఈజీఏ తరహాలో పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం. 21 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 భృతి. 
ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల అప్పులను రైతులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో సహకార రుణాలను మరింత విస్తరించడం. 
తూర్పు రాజస్తాన్‌ కాలువల ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు సాగు, తాగునీరు. దీన్ని ప్రధాన ప్రాజెక్టుగా పరిగణించి త్వరగా పూర్తి చేయడం. ప్రతీ డివిజన్‌లో ఒక జిల్లాను ఎంచుకుని అక్కడ సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం. 
బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించడంతోపాటు పాక్‌ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం. 
మేవాత్‌ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరిన్ని చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు. 
ప్రస్తుతం మినా (Mina)లు ఎస్టీల్లో ఉండగా, మీనా (Meena)లను కూడా ఎస్టీల్లో చేర్చేలా కేంద్రానికి సిఫారసు. గిరిజనుల ఉప ప్రణాళిక కోసం ఐదేళ్లలో రూ. 5,000 కోట్లు. 
విద్యా విధానాల రూపకల్పనలో ప్రైవేటు పాఠశాలలు లేదా సాధికార కమిటీల సహాయం తీసుకోవడం, వేద విద్య కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు. 
అనైతిక కార్యకలాపాల గురించి చెప్పేందుకు వాడుతున్న ‘గోరఖ్‌ ధంధా’ పదాన్ని వాడకుండా నిషేధం విధించేందుకు కొత్త చట్టం. ‘గురు గోరఖ్‌నాథ్‌’ అనుచరులను మనోభావాలను దెబ్బతీసేలా ఈ పదం ఉండటంతో నిషేధం విధించాలని నిర్ణయం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement