Minister Jaitley
-
ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
జైపూర్: ఏడాదికి 30 వేల ప్రభుత్వ, 10 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుల ఆదాయం రెట్టింపు తదితర భారీ హామీలతో రాజస్తాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. వచ్చే నెల 7న ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో అధికార బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విడుదల చేశారు. ముఖ్యమైన హామీలు ►ప్రతీ ఏడాది ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ప్రైవేటు రంగంలో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాల (స్వయం ఉపాధి సహా మొత్తం ఐదేళ్లలో 50 లక్షలు) సృష్టి. ఎన్ఆర్ఈజీఏ తరహాలో పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక ఉపాధి హామీ పథకం. 21 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 భృతి. ►ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల అప్పులను రైతులకు ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగంలో సహకార రుణాలను మరింత విస్తరించడం. ►తూర్పు రాజస్తాన్ కాలువల ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు సాగు, తాగునీరు. దీన్ని ప్రధాన ప్రాజెక్టుగా పరిగణించి త్వరగా పూర్తి చేయడం. ప్రతీ డివిజన్లో ఒక జిల్లాను ఎంచుకుని అక్కడ సేంద్రీయ వ్యవసాయం, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం. ►బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించడంతోపాటు పాక్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం. ►మేవాత్ ప్రాంతంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరిన్ని చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు. ►ప్రస్తుతం మినా (Mina)లు ఎస్టీల్లో ఉండగా, మీనా (Meena)లను కూడా ఎస్టీల్లో చేర్చేలా కేంద్రానికి సిఫారసు. గిరిజనుల ఉప ప్రణాళిక కోసం ఐదేళ్లలో రూ. 5,000 కోట్లు. ►విద్యా విధానాల రూపకల్పనలో ప్రైవేటు పాఠశాలలు లేదా సాధికార కమిటీల సహాయం తీసుకోవడం, వేద విద్య కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు. ►అనైతిక కార్యకలాపాల గురించి చెప్పేందుకు వాడుతున్న ‘గోరఖ్ ధంధా’ పదాన్ని వాడకుండా నిషేధం విధించేందుకు కొత్త చట్టం. ‘గురు గోరఖ్‌నాథ్’ అనుచరులను మనోభావాలను దెబ్బతీసేలా ఈ పదం ఉండటంతో నిషేధం విధించాలని నిర్ణయం. -
పడిపోతూనే ఉన్న రూపాయి..
ముంబై: ఆరో రోజూ రూపాయి నేల చూపులే చూసింది. డాలర్‌తో బుధవారం మరో 17 పైసలు ఆవిరై 71.75 వద్ద స్థిరపడింది. కనిష్టంలో ఇది మరో రికార్డు. వరుసగా ఆరు రోజుల్లో రూపాయి 165 పైసల మేర తన విలువను కోల్పోయింది. ఇంట్రాడేలో రూపాయి నూతన రికార్డు కనిష్టాన్ని 71.97 వద్ద నమోదు చేసింది. ఆ తర్వాత కాస్త రికవరీ అయింది. ఆర్బీఐ రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని కొంత వరకు నిలువరించిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధాలే రూపాయిని పడేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కూడా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. ద్రవ్యలోటు, కరెంటు ఖాతాల లోటుతో దేశ ఆర్థిక రంగానికి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. డాలర్ బలపడిందంతే...: జైట్లీ ‘‘రూపాయి విలువ క్షీణించడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం. దేశీయ ఆర్థిక పరిస్థితి చూడండి. అలాగే, అంతర్జాతీయ పరిస్థితులనూ చూడండి. ఇందుకు దేశీయ కారణాలు ఎంత మాత్రం కాదు. వర్ధమాన దేశాల్లో ప్రతీ కరెన్సీతోనూ డాలర్ బలపడింది. రూపాయి బలహీనపడలేదు. పౌండ్, యూరో తదితర కరెన్సీలతో రూపాయి బలపడింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. -
భారత్‌లో ఐపీవోకి వొడాఫోన్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ తాజాగా తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కి సంబంధించి కొంత కసరత్తు మొదలైందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో తెలిపారు. ఎప్పటిలోగా ఐపీవో సన్నాహాలు పూర్తవుతాయన్నది చెప్పడానికి విటోరియో నిరాకరించారు. చాన్నాళ్లుగా వొడాఫోన్ ఐపీవో యోచనలో ఉన్నప్పటికీ నియంత్రణ, పన్నుపరమైన సమస్యలతో ముందుకెళ్లలేదు. భారత్‌లో రెండో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన వొడాఫోన్‌కి 18 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ‘సరికొత్త భారత్’ను చూస్తున్నాం: విటోరియో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడం తదితర అనేక సానుకూల పరిణామాలు కనిపిస్తుంటే సరికొత్త భారత్‌ను చూస్తున్నట్లు అనిపిస్తోందని విటోరియో పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారం చేయడం చాలా కష్టం అంటూ గతేడాది వ్యాఖ్యానించిన విటోరియో తాజాగా సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అత్యున్నత స్థాయుల్లో కూడా క్రమంగా మార్పు కనిపిస్తోందని, ఇదే వేగం కొనసాగితే భారత డిజిటైజేషన్ సాధ్యమేనని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులతో విటోరియో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశాల వివరాలు ఆయన వెల్లడించలేదు. కాల్ డ్రాప్స్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని విటోరియోకి సూచించినట్లు టెలికం మంత్రి ప్రసాద్ తెలిపారు.