భారత్‌లో ఐపీవోకి వొడాఫోన్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ తాజాగా తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది. పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కి సంబంధించి కొంత కసరత్తు మొదలైందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో తెలిపారు. ఎప్పటిలోగా ఐపీవో సన్నాహాలు పూర్తవుతాయన్నది చెప్పడానికి విటోరియో నిరాకరించారు. చాన్నాళ్లుగా వొడాఫోన్ ఐపీవో యోచనలో ఉన్నప్పటికీ నియంత్రణ, పన్నుపరమైన సమస్యలతో ముందుకెళ్లలేదు. భారత్‌లో రెండో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన వొడాఫోన్‌కి 18 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
‘సరికొత్త భారత్’ను చూస్తున్నాం: విటోరియో
పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించడం తదితర అనేక సానుకూల పరిణామాలు కనిపిస్తుంటే సరికొత్త భారత్‌ను చూస్తున్నట్లు అనిపిస్తోందని విటోరియో పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపారం చేయడం చాలా కష్టం అంటూ గతేడాది వ్యాఖ్యానించిన విటోరియో తాజాగా సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అత్యున్నత స్థాయుల్లో కూడా క్రమంగా మార్పు కనిపిస్తోందని, ఇదే వేగం కొనసాగితే భారత డిజిటైజేషన్ సాధ్యమేనని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులతో విటోరియో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశాల వివరాలు ఆయన వెల్లడించలేదు. కాల్ డ్రాప్స్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని విటోరియోకి సూచించినట్లు టెలికం మంత్రి ప్రసాద్ తెలిపారు.