నేటి నుంచి డెరివేటివ్ కాంట్రాక్టులు
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్‌ఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.
మూడో రోజూ సూచీలు ముందుకే...
స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఫాలోఆన్‌ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment