
ముంబై: ఆరో రోజూ రూపాయి నేల చూపులే చూసింది. డాలర్‌తో బుధవారం మరో 17 పైసలు ఆవిరై 71.75 వద్ద స్థిరపడింది. కనిష్టంలో ఇది మరో రికార్డు. వరుసగా ఆరు రోజుల్లో రూపాయి 165 పైసల మేర తన విలువను కోల్పోయింది. ఇంట్రాడేలో రూపాయి నూతన రికార్డు కనిష్టాన్ని 71.97 వద్ద నమోదు చేసింది. ఆ తర్వాత కాస్త రికవరీ అయింది. ఆర్‌బీఐ రంగంలోకి దిగి రూపాయి పతనాన్ని కొంత వరకు నిలువరించిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ప్రధానంగా ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధాలే రూపాయిని పడేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు కూడా ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. ద్రవ్యలోటు, కరెంటు ఖాతాల లోటుతో దేశ ఆర్థిక రంగానికి సమస్యలు పొంచి ఉన్నాయని ఓ ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు.
డాలర్ బలపడిందంతే...: జైట్లీ
‘‘రూపాయి విలువ క్షీణించడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం. దేశీయ ఆర్థిక పరిస్థితి చూడండి. అలాగే, అంతర్జాతీయ పరిస్థితులనూ చూడండి. ఇందుకు దేశీయ కారణాలు ఎంత మాత్రం కాదు. వర్ధమాన దేశాల్లో ప్రతీ కరెన్సీతోనూ డాలర్ బలపడింది. రూపాయి బలహీనపడలేదు. పౌండ్, యూరో తదితర కరెన్సీలతో రూపాయి బలపడింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment