ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐదు గంటలతో ట్రేడింగ్ ముగిసే దేశీయ ఇంట్రా బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ సోమవారం 65.10 వద్ద ముగిసింది.
శుక్రవారం ముగింపుతో పోల్చితే ఇది 31పైసలు తక్కువ. అంటే శుక్రవారం ఈ ధర 64.79 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, దేశీయంగా కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు రూపాయి బలహీనతకు దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రాత్రి 10 గంటల సమయానికి రూపాయి మరింత బలహీనపడి 65.30 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటివరకూ రూపాయి ఇంట్రాడేలో ఇదే కనిష్టస్థాయికాగా, గరిష్టం 64.74. ఇక ఇదే సమయానికి డాలర్ ఇండెక్స్ 92.46 వద్ద ట్రేడవుతోంది.
పసిడిపై ‘యుద్ధ భయం’ ఎఫెక్ట్...
ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడు సార్లు వడ్డీరేట్ల పెంపు ఖాయమని ఫెడ్ సంకేతాలు ఇచ్చిన పది నిముషాలలోపే (గత బుధవారం) డాలర్ ఇండెక్స్ ఎగసిన స్థాయి ఇది (91.42 నుంచి). దీనితో అప్పట్లో పసిడి కూడా భారీగా 1,300 స్థాయి దిగువకు పడిపోయింది. అయితే ఇప్పుడు డాలర్ మళ్లీ పైకి దూకుతోంది. కారణం... ఉత్తరకొరియా ఉద్రిక్తత పసిడికి కొంత బలంగా మారుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక యుద్ధంగానే పరిగణిస్తామని, తమ గగనతలంలోకి ప్రవేశిస్తే, అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తామని ఉత్తరకొరియా చేసిన ప్రకటన సోమవారం పసిడి రేటును అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కసారిగా ఔన్స్‌కు 1,314 డాలర్లకు పెంచేసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 10.15 గంటల సమయంలో 1,313 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం కనిష్ట స్థాయి నుంచి ఇది 15 డాలర్లు అధికం. ఇక అంతర్జాతీయంగా పలు ఈక్విటీ మార్కెట్లు కూడా సోమవారం నష్టాలను చవిచూశాయి. యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు విలువైన మెటల్స్‌ను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.