మరు నిమిషం ఏమవుతుందో ఎవరికీ తెలీకపోయినా, తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గదు. భవిష్యత్ చెప్పే వాళ్లంటే ప్రజలకు భలే మోజు. చిలక జోస్యుల దగ్గర నుంచి నోస్ట్రడామస్ వరకు ఇందుకే పాపులర్ అవుతుంటారు. రాజకీయ నాయకుల్లో ఈ ఆసక్తి మరీ అధికం. ఎన్నికల వేళ నాయకులకు కాలునిలవదు. గెలుస్తామా, గెలవమా అనే మీమాంసతో జోతిష్యంపై మరింతగా ఆధారపడుతుంటారు. ఇలాంటి నేతలంతా ప్రస్తుతం రాజస్తాన్‌లోని కరోయ్ నగరానికి బారులు తీరుతున్నారు.
రాజస్థాన్‌లోని భిల్వారాకు 20 కి.మీ దూరంలోని చిన్నగ్రామం కరోయ్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల రాజకీయనాయకులు ఈ ఊరికి క్యూ కడుతున్నారు. ఈ ఊర్లో పండిట్ నాథూలాల్ భైరూలాల్ వ్యాస్ అనే 96 ఏళ్ల జ్యోతిష్కుడి కోసం బారులు తీరుతున్నారు. ఎన్నికల సంరంభం ఆరభం కాగానే పార్టీ టికెట్ వస్తుందా? లేదా? అని, షెడ్యూలు వచ్చాక ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని, ఎన్నికల తర్వాత మంత్రి అవుతామా? లేదా? అని తెలుసుకునేందుకు వ్యాస్ వద్దకు వస్తుంటారు.
ఆయన లెక్కే వేరు!
వ్యాస్ జోస్యంపై పెద్దవాళ్లకు నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల కాలంలో ఈ నమ్మకం మరింత బలపడేందుకు కారణం... ప్రతిభాపాటిల్ సింగ్. దేశంలోనే అత్యున్నత స్థానాన్ని ఆమె అందుకోబోతున్నట్టు ఎవరు ఊహించడానికి ముందే ఆయన తన భవిష్యవాణిలో వెల్లడించారు. నాధూలాల్‌ను కలుసుకునేందుకు తన భర్త దేవీసింగ్ పటేల్‌తో కలిసి ప్రతిభాపాటిల్ వెళ్లినపుడు ఆమెకు వ్యాస్ ఈ విషయం తెలియజేశారు.
ఈ జోస్యం నిజం కావడంతో తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వ్యాస్‌ను ఆమె ఆహ్వానించారు. నాథూలాల్ ప్రాభవం ప్రతిభాసింగ్‌తోనే మొదలు కాలేదు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబాని కూడా గతంలో వ్యాస్‌ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివిధ అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండేవాళ్లు. ధీరూభాయ్‌తో పాటు గతంలో యూపీ, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అమర్‌సింగ్, ప్రసుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు వ్యాస్ శిష్యబృందంలో సభ్యులుగా ఉన్నారు. పలువురు విదేశీ భక్తులు కూడా ఆయనను కలుసుకునేందుకు వస్తుంటారు.
ప్రత్యేకత ఏమిటి?
సంస్కృత జ్యోతిష విధానం ‘భృగు సంహిత’లో వ్యాస్ నిష్ణాతులు. ఆయన లెక్క తప్పదని ప్రజల్లో నమ్మకం. భృగు సంహిత ఆధారంగా వ్యాస్ జరగబోయే విషయాలపై రాజకీయశిష్యులకు జోస్యం చెబుతుంటారు. ఆయన చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకంతో నేతలు వ్యాస్ చెప్పే సూచనలను, సూచించే పూజలను తప్పక పాటిస్తుంటారు. కేవలం గెలపోటములపై సలహాలే కాకుండా, గెలుపునకు ఏమి చేస్తే బావుంటుంది, ఎలాంటి వ్యూహాలు చేపడితే బావుంటుందన్న దానిపై కూడా సలహాలు తీసుకుంటున్నారు.
‘ సమాజం సాంకేతికరంగంలో అభివృద్ధి సాధిస్తున్నా సాంస్కృతిక మూలాలు మరిచిపోకుండా స్మృతీ ఇరానీ వంటి వారు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు. నమ్మకమే వారిని గెలిపిస్తోంది’’అంటారు వ్యాస్. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే కూడా తన శిష్యురాలేనని చెప్పారు. స్మృతీతో పాటు వసుంధర భవిష్యత్ గురించి చెప్పిన జోస్యాలు ఫలించాయని వ్యాస్ చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment