
పట్టుదల ఉంటే సాధ్యంకానిదేదీ ఉండదని రుజువు చేశారు మధ్యప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. పంట సాగుకోసం తమ తండ్రి పడుతున్న బాధలను చూసిన వారు కదిలిపోయారు. తండ్రి బాధను తమ బాధగా భావించి తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఆయన కలను సాకారం చేశారు. ఆ తరువాత తండ్రి కళ్లల్లో ఆనందం చూసి మురిసిపోయారు. ఇంతకీ ఆ పిల్లలేం చేశారో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో రైతులు వ్యవసాయ బావులు లేదా చెక్‌డ్యామ్‌లపై ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ జిల్లాలోని భీకన్‌గావ్ గ్రామానికి చెందిన రైతు బాబు భాస్కర్ పొలంలో బావి నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. అయితే పేద రైతు కావడంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్జీఈజీఏ) కింద బావి పనులు చేపడితే తనకు భారం తగ్గుతుందని ఆలోచించాడు. ఈ నేపథ్యంలో 2011లో సంబంధిత అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాకుండా ఓ వినతిపత్రం కూడా అందజేశాడు. ఈ విన్నపాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీఇచ్చారు.
పక్షం రోజుల తర్వాత తమను కలవాలని సూచించారు. సరిగ్గా 16వ బాబు భాస్కర్ తాను వినతిపత్రం సమర్పించిన కార్యాలయానికి వెళ్లాడు. మరో వారం తర్వాత మళ్లీ కలవాల్సిందిగా వారు తెలిపారు. సరేనంటూ తలూపిన భాస్కర్ ఆ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించాడు. రెండు నెలల తర్వాత ఈ వినతిపత్రానికి సంబంధిత అధికారులు ఆమోదముద్ర వేశారు. నిధులు మంజూరు చేశారు. దీంతో బావి తవ్వకపు పనులు మొదలయ్యాయి. భాస్కర్ సంబరపడ్డాడు. తన పొలం పచ్చని పంటలతో కళకళలాడుతుందని భావించాడు. పది అడుగుల మేర బావి తవ్వకం పూర్తయింది. ఆ తర్వాత అధికారులు నిధులు మంజూరు చేయలేదు. దీంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. భాస్కర్ మరలా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు.
అయితే ఎంతకాలం తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన డీలాపడిపోయాడు. ఇది గమనించిన భాస్కర్ కుమార్తెలు జ్యోతి, కవిత తండ్రి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఆ పనిని తామే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర కుటుంబసభ్యులను కలుపుకొని బావి నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. అక్కడి నుంచి నాలుగు నెలలపాటు వీలైనంత సమయం కేటాయించి తవ్వకపు పనులు చేపట్టారు. ఈ ఏడాది జులై చివరి నాటికి మరో 17 అడుగుల లోతు మేర బావిని తవ్వారు. అలా బావి నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి, కవిత మీడియాతో మాట్లాడుతూ ‘బావి పనుల కోసం మేము కూడా సంబంధిత అధికారుల చుట్టూ మూడేళ్లపాటు ప్రదక్షిణలు చేశాం, అయినా ఎటువంటి స్పందనా కనిపించలేదు.
దీంతో మిగిలిన కుటుంబసభ్యులను కూడా కలుపుకుని పనులు మొదలుపెట్టాం. ఎండాకాలంలో కూడా ఆపలేదు. మా నాన్న కలను నిజం చేసి చూపాం. ఈ రకంగానైనా తండ్రి రుణం తీర్చుకునే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ‘మాకు ఎద్దులు కూడా లేవు. మా అమ్మాయిలు రోజూ బావి నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు. మట్టి, రాళ్లను తట్టల్లోకి ఎత్తేవారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలు ఇలా చాకిరి చేస్తుండడం బాధ కలిగించింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. ఆడపిల్లలైనా మగపిల్లల మాదిరిగా పనిచేశారు’ అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment