మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ర్యాలీలో ప్రసంగిస్తున్న మోదీ
ఛింద్వారా/మహాసముంద్: మోసం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. దళితుడైనందునే సీతారాం కేసరిని ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా తొలగించి సోనియాను అందలం ఎక్కించారని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది.
కానీ, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరు. గోవును కీర్తిస్తూ మధ్యప్రదేశ్ మేనిఫెస్టోలో పథకాలు కూడా ఆ పార్టీ ప్రకటించింది. కేరళలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆవు దూడలను తింటూ పశుమాంసం తినడం తమ హక్కంటారా?’ అని ప్రజలను అడిగారు. ‘ఆధార్ ఆధారిత సాంకేతికతతో ప్రభుత్వ పథకాలను అనర్హుల పాలు కాకుండా చేసి ఏడాదికి 90 వేల కోట్ల రూపాయల దోపిడీని ఆపుతున్నా. అందుకే కాంగ్రెస్ నేతలు నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు’ అని మోదీ అన్నారు.
కేసరిని అర్ధంతరంగా తొలగించారు
ఏఐసీసీ అధ్యక్షుడు(1996–98)గా ఉన్న సీతారాం కేసరి దళితుడైనందునే ఆ పార్టీ ఆయన్ను అర్ధంతరంగా పదవి నుంచి దించేసిందని మోదీ విమర్శించారు. పదవీ కాలం పూర్తి కాకుండానే సీతారాం కేసరిని పార్టీ ఆఫీసు నుంచి బయటకు నెట్టేసిన ఆ పార్టీ నేతలు సోనియా గాంధీని పదవిలో కూర్చోబెట్టారన్న విషయం అప్పట్లో దేశ ప్రజలకు కూడా తెలుసునని పేర్కొన్నారు.
‘ఆ ఒక్క కుటుంబం నాలుగు తరాలుగా అధికారంలో ఉంటూ లాభం పొందగా, వారి పాలనతో దేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు’ అని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందని సమర్థుడైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కాంగ్రెస్‌కు ఆయన సవాల్ విసిరారు. ‘రైతు రుణాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన అలాంటి హామీని అక్కడి ప్రభుత్వం ఏడాదవుతున్నా అమలు చేయలేదు. పైపెచ్చు రుణగ్రహీతలైన అక్కడి రైతులకు వారంట్లు జారీ చేస్తూ అరెస్టులు చేయిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లో బరిలో 1,101 మంది
ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశలో ఈనెల 20వ తేదీన 72 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. పోటీలో 1,101 మంది అభ్యర్థులున్నారు. రాయ్‌పూర్ సిటీ దక్షిణ స్థానం కోసం అత్యధికంగా 46 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 18 స్థానాలకు 12న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.
కేసరి దళితుడు కాదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి దళితుడు అంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేసరి దళితుడు కాదు, ఇతర వెనుక బడిన కులాల(ఓబీసీ)కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేసింది. ‘సీతారాం కేసరి బిహార్ ఓబీసీల్లోని బనియా కులానికి చెందిన వ్యక్తి. ఆయన దళితుడు కాదు. ఆయనకు పార్టీ తగు గౌరవం ఇచ్చింది. అయినా.. నిజాలు, సత్యాలను ప్రధాని మోదీ ఎన్నడైనా చెప్పారా?’అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘కొత్తకొత్త అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్‌రాజ్ మిశ్రా, కేశూభాయ్ పటేల్‌లాంటి బీజేపీ ప్రముఖ నేతలను ఎలా గౌరవించారో ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ మోదీని వ్యంగ్యంగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment