s/o సన్నాఫ్‌.. | Son's Campaign on behalf of fathers | Sakshi
Sakshi News home page

s/o సన్నాఫ్‌..

Published Mon, Nov 5 2018 3:11 AM | Last Updated on Mon, Nov 5 2018 3:11 AM

Son's Campaign on behalf of fathers - Sakshi

మధ్యప్రదేశ్‌ వారసత్వానికి ఒక  లక్షణం ఉంది. అదే పేరు, అదే వంశం,.. ఉంటే చాలు ఏ కాస్త క్వాలిటీ ఉన్నా రాణించేయొచ్చు. రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ. మధ్యప్రదేశ్‌లో మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బడా నేతలంతా పొలిటికల్‌ పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. మరి ఈ వారసుల్లో మహావృక్షంగా మారేవారెవరు? మర్రిచెట్టు కింద మొక్కలా మిగిలేవారెవరు? చూడాలి..


మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఈ సారి వారసుల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దగ్గర నుంచి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ వరకు అన్ని కుటుంబాల్లో పుత్రోత్సాహం పొంగిపొరలుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసు రాకపోయినా ఈ నయా లీడర్లు  వచ్చే ఎన్నికలకు పునాదిగా తండ్రుల నియోజకవర్గాల్లో వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 55 శాతం వరకు 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉంటే, ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది వృద్ధులే. అందుకే వారసుల్ని రంగంలోకి దింపి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు నేతలు.  

వారసత్వ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌
మధ్యప్రదేశ్‌ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, మనవలు ఇప్పటికీ వంశం పేరు చెప్పుకునే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారు. రవిశంకర్‌ శుక్లా కుమారుడు శ్యామ్‌ చరణ్‌ శుక్లా, మనవడు అమిత్‌ శుక్లా, మోతీలాల్‌ ఓరా కుమారుడు అరుణ్‌ ఓరా, దిగ్విజయ్‌సింగ్‌ కుమారుడు జైవర్ధన్‌ సింగ్, దివంగత కేంద్ర మంత్రి అర్జున్‌ సింగ్‌ కుమారుడు అజయ్‌ సింగ్, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తండ్రులు, తాతల పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణించారు. ఒకసారి బలపడ్డాక క్రమంగా లీడర్లుగా స్వీయ ప్రతిభ చూపుతున్నారు.  

చక్రం తిప్పుతున్న సింధియా కుటుంబం
 సింధియా రాచ కుటుంబం అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. విజయ రాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె కుమారుడు, దివంగత నేత మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి మారిపోయారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విజయ రాజే సింధియా కుమార్తె వసుంధరా రాజె రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ లోక్‌సభ ఎంపీ.  కుమార్తె యశోధర రాజె సింధియా మధ్యప్రదేశ్‌ లో మంత్రిగా ఉన్నారు.

నయా లీడర్స్‌
కార్తికేయ సింగ్‌ చౌహాన్‌: ముఖ్యమంత్రిగా పార్టీని ముందుండి నడిపించాల్సిరావడంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన సొంత నియోజకవర్గం బుధ్నీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఈ బాధ్యతల్ని ఆయన కుమారుడు కార్తికేయ సింగ్‌ చౌహాన్‌ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఇంకా రాకపోయినప్పటికీ ప్రచారంలో తనదైన ముద్ర చూపుతున్నాడు. బుధ్నీ నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క భోపాల్‌లో పూలు, పాల వ్యాపారాలు చూసుకుంటూనే తండ్రి నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు.

మహానర్యామన్‌ : కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ సారథి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానర్యామన్‌కి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. డూన్‌ స్కూలులో గ్రాడ్యుయేషన్‌ చేసిన మహానర్యామన్‌ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు.

నకుల్‌నాథ్‌ : మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమలనాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌. తండ్రి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడే నకుల్‌ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో నైట్‌ లైఫ్‌కు బాగా అలవాటు పడిన నకుల్‌ ఎన్నికల వేళ మాత్రం భోపాల్‌లోనే ఉంటూ తెగ తిరిగేస్తున్నారు. బోస్టన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన నకుల్‌ బేతల్‌ నుంచి పోటీ పడే అవకాశాలున్నాయి.  


అభిషేక్‌ భార్గవ్‌ : మధ్యప్రదేశ్‌ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్‌ భార్గవ్‌ కుమారుడైన అభిషేక్‌ రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించారు. రెహిల్‌ నియోజకవర్గం నుంచి గోపాల్‌ భార్గవ్‌ గత ఏడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అభిషేకే తండ్రి తరఫు పొలిటికల్‌ మేనేజర్‌గా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచార వ్యూహాలన్నీ అభిషేకే రచించారు.  

విక్రాంత్‌ భూరియా: కాంగ్రెస్‌ నాయకుడు కాంతిలాల్‌ భూరియా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమారుడు విక్రాంత్‌ భూరియా తండ్రి నియోజకవర్గమైన రట్లామ్‌ బాధ్యతలు తీసుకున్నారు ప్రజా సంబంధాలు ఏర్పరచుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తండ్రిని గెలిపించుకున్నారు.  

పైన చెప్పినవాళ్లే కాకుండా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కుమారుడు మంధర్‌ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్‌ వార్గియా కుమారుడు ఆకాశ్‌ , ప్రజా సంబంధాల శాఖా మంత్రి డా. నరోత్తమ్‌ మిశ్రా కుమారుడు సుకర్ణ మిశ్రా, ఆర్థిక మంత్రి జయంత్‌ మాలవీయ కుమారుడు సిద్ధార్థ మాలవీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడు దేవేంద్ర సింగ్‌ తోమర్‌ తదితరులు సైతం రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో పలువురు తమ సత్తా చూపాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement