మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది.
వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్‌కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్‌పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్‌లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఎస్‌ఏపీఏకేఎస్ ఏర్పాటు
మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్‌డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్‌ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి.
దళితుల్లో అసంతృప్తి
బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి.
జై ఆదివాసీ యువ సంఘటన్
మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్‌తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే.
అన్నదాతల ఆగ్రహం
శివరాజ్‌సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు.
కేంద్రంపై వ్యతిరేకత
గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్‌కు నష్టం చేకూరుస్తుందంటున్నారు.
బలాలు
♦ ప్రజలతో మమేకం కావడం
♦ పని రాక్షసుడని పేరు
♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు
బలహీనతలు
♦ ప్రభుత్వ వ్యతిరేకత
♦ రైతుల్లో అసంతృప్తి
♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు
♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు
చెక్ పెట్టగలరా?
చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం
ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా
పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్‌తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది.
అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
వివాదంలో కాషాయ నేతలు
బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్‌ను చెరిపేస్తున్నారు.
ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్‌దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్‌లకు పడడం లేదు.
కాంగ్రెస్ విశ్వప్రయత్నం
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది.
ఆ ముగ్గురిపై నమ్మకం
కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది.
పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment