
రైతుల ఆందోళనతో అట్టుడికిన మందసోర్‌లో తగ్గని బీజేపీ ప్రాబల్యం
భోపాల్ : హిందీ బెల్ట్‌లో కీలక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పరాజయం ఎదురైనా మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రైతుల ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ రైతుల సమస్యలు, అన్నదాతల ఆందోళన ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గత ఏడాది రైతుల ఆందోళన సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీసి ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే.
రైతుల మృతితో మందసోర్ జాతీయ పతాకశీర్షికలకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. రైతుల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచి వివిధ రాష్ర్టాల్లో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మందసోర్‌లో ఊహించని ఫలితాలు రావడం విశేషం. మందసోర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మందసోర్, మల్హర్‌గర్, నీముచ్, మనస, జవాద్, జవోర స్ధానాలను బీజేపీ నిలబెట్టుకోగా, 2013లో కాంగ్రెస్ గెలుపొందిన సువర్సా స్ధానంలోనూ బీజేపీ విజయం సాధించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment