
ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, సొంత వాహనాలు, వ్యవసాయ భూములు, బ్యాంకు డిపాజిట్లు చూపించడమే మనకి ఇప్పటివరకు తెలుసు. కానీ మధ్యప్రదేశ్‌లో నేతల రూటే సెపరేటు. తుపాకీ ఉన్నోడే నాయకుడు అనుకుంటున్నారో, ఏమో తమ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, వాటి విలువెంతో లెక్కలు కట్టి మరీ అఫిడవిట్‌లో సమర్పిస్తున్నారు. వారి దగ్గరున్న ఆయుధాల చిట్టా చూస్తే విస్తుపోవాల్సిందే. ఒక్కొక్క నేత ఇల్లు ఒక్కొక్క ఆయుధ భాండాగారం అని అనిపించకమానదు. పది వేల రూపాయల విలువైన చిన్నపాటి రివాల్వర్ దగ్గర్నుంచి 4.5 లక్షల రూపాయల ఖరీదైన రైఫిల్ వరకు అన్ని రకాల ఆయుధాలు వారి దగ్గరున్నాయి. నేతలకు ఈ తుపాకులతో పనేంటి అని ప్రశ్నలు వస్తే ఆత్మరక్షణ కోసమే అన్న సమాధానం వినిపిస్తోంది. సీఎం శివరాజ్ చౌహాన్ దగ్గర రూ.5,500 విలువైన రివాల్వర్ ఉంటే, ఆయన ప్రత్యర్థి, మాజీ పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ దగ్గర లక్ష రూపాయల విలువైన రైఫిల్, రివాల్వర్ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కున్వర్ విజయ్ షా దగ్గర రెండు రైఫిల్స్, ఒక రివాల్వర్ ఉంటే, మరో బీజేపీ నాయకుడు శరద్ జైన్ వద్ద లక్ష రూపాయల రివాల్వర్ ఉంది.
కాంగ్రెస్ నేతలకు నాలుగు తుపాకులు ఎక్కువే
ఆయుధాల విషయంలో కాంగ్రెస్ నాయకులు నాలుగాకులు ఎక్కువే చదివారు. రాజ్‌నగర్ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ దగ్గర ఏకంగా నాలుగు ఆయుధాలు ఉన్నాయి. ఒక డబుల్ బారెల్, 30–06 రైఫిల్, .375 మాగ్నం ఇలా మొత్తంగా 4.5 లక్షల విలువైన ఆయుధాలు ఉన్నాయి. మరో ఇద్దరు నేతలు రామ్‌నివాస్ రావత్, గోవింద్ సింగ్‌ల దగ్గర మూడేసి ఆయుధాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ రాజేంద్ర సింగ్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న రైఫిల్స్ ఉన్నాయి. వీటి విలువ 1.8 లక్షల వరకు ఉంటుంది. ఇక చాలా మంది అభ్యర్థుల దగ్గర 12 బోర్, 315 బోర్ రైఫిల్స్ ఉన్నట్టు అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలతో వెల్లడైంది. ఇద్దరు మహిళా అభ్యర్థుల దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి. అయితే అక్రమంగా ఆయుధాలున్న నేతలు కూడా చాలా మందే ఉన్నారు.
నాకు టికెట్ వద్దు!
ఎన్నికల్లో నాకు సీటివ్వలేదని అలిగి రెబెల్‌గా పోటీచేసే వాళ్ల గురించి రోజూ చూస్తేనే ఉన్నాం. ఎన్నిసార్లు పోటీ చేసి.. గెలుస్తూనే ఉన్నా తనివితీరని వాళ్లకు లెక్కే లేదు. అలాంటిది.. ఈ సారి పోటీ నుంచి నన్ను మినహాయించండని ఎవరైనా అడుగుతారా? కానీ ఇలాగే అడిగేశారు మధ్యప్రదేశ్ మంత్రి సూర్యప్రకాశ్ మీనా. ‘అయ్యా ఈసారి పోటీ చేసే ఓపిక లేదు. దయచేసి ఎన్నికల బరినుంచి నన్ను మినహాయించండి’ అని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖరాశారు.
ఈ లేఖ మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర అంశంగా మారింది. మధ్యప్రదేశ్ ఉద్యానవన, ఆహార మంత్రిత్వ శాఖ (స్వతంత్ర) మంత్రి సూర్య ప్రకాశ్ మీనా.. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. విదిశ ఎంపీ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి 100%చిత్తశుద్ధితో పనిచేస్తాను’ అని లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని శంషాబాద్ నియోజవకర్గం నుంచి 2008, 2013లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. తన పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతోనే ఆయన తప్పుకున్నాడంటూ ప్రచారం సాగుతోంది.
ఓట్లు అడగకండి ప్లీజ్
ఇది మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా బాగ్నా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. విషయం ఏమిటంటే..ఇక్కడ దాదాపు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఏడు కాలనీల ప్రజలకు గుర్తింపు, ఇళ్ల పట్టాలు, కనీస సౌకర్యాలు సమస్య ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, మీకు చట్టబద్ధత కల్పిస్తామని, అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోతున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఎన్నికల ప్రచారం కోసం వారి కాలనీల్లోకి వచ్చే నాయకులకు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ‘మేము చట్టబద్ధం కానప్పుడు, మా ఓటు చట్టబద్ధం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని ఓట్లు అడగకండి ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మా సమస్యలు తీరేంత వరకు ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పారు. ఓటు కోసం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొదంటూ ఇళ్ల గోడలపై ప్రజలే పోస్టర్లు వేసి మరీ నిరసన తెలుపుతున్నారు. ఓ మహిళ మరీ ఆగ్రహంతో ఊగిపోతూ...ఓట్లు అడగడానికి వచ్చిన వారికి చెప్పులతో స్వాగతం పలుకుతామని హెచ్చరించడం స్థానిక నేతలను నివ్వెరపరచింది.
Comments
Please login to add a commentAdd a comment