ఇండోర్: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు సాధారణంగా వారికి తప్ప ఎవరికీ అర్థం కావు. సామాన్య ప్రజలకైతే మరీ కష్టం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీ ఓ వినూత్న ఆలోచన చేసింది. ప్రిస్క్రిప్షన్లు స్పష్టంగా రాసేందుకు వారికి ఒక సబ్జెక్టు నిపుణునితో చేతిరాతలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అర్థం కాని ప్రిస్క్రిప్షన్ల ద్వారా జూనియర్ డాక్టర్లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ (ఎమ్‌జీఎమ్) డిగ్రీ, పీజీ వైద్య విద్యార్థులకు ఈమేరకు శిక్షణ ఇవ్వనుంది.
ఆదివారం ఎమ్‌జీఎమ్ డీన్ జ్యోతి బిందాల్ మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్లు రాయడంలో వారి చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జూనియర్ డాక్టర్లకు ఒక సబ్జెక్టు నిపుణునితో శిక్షణ ఇప్పిస్తామని, తద్వారా వారు రాసే ప్రిస్క్రిప్షన్లను సులభంగా అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. మధ్యప్రదేశ్ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ వీసీ రవిశంకర్ శర్మ మాట్లాడుతూ ‘కొందరు డాక్టర్లు కేవలం 30 సెకన్లలోనే ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ రాయడానికి కనీసం మూడు నిమిషాలైనా తీసుకోవాలి. రోగుల లక్షణాలు, వ్యాధి, మందుల గురించి స్పష్టంగా రాయాలని డాక్టర్లకు సూచించాన’ని ఆయన తెలిపారు.
‘అందరి డాక్టర్ల చేతిరాత అందంగా ఉండకపోవచ్చు. కానీ ప్రిస్క్రిప్షన్లు కనీసం చదవడానికి వీలుండేలా రాయాలి’ అని అన్నారు. అర్థం కాకుండా రాయడం వల్ల రోగులు మందులు కొనుగోలు చేసేటపుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని సంఘటనల్లో డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు అర్థం కాక మెడికల్ ఇన్సూరెన్స్ పొందడంలో రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాగా, అస్పష్టమైన ప్రిస్క్రిప్షన్ల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాక్టర్లకు కొన్ని నిబంధనలను తప్పనిసరి చేసింది. మందుల పేర్లను పెద్ద అక్షరాలతోనే స్పష్టంగా రాయాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment