బెస్ట్ ఓటు నాదేనోచ్.. గ్వాలియర్‌లో ఓటేశానంటూ సిరా గుర్తు చూపుతున్న 109 ఏళ్ల అవ్వ
భోపాల్, ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యప్రదేశ్‌లో 74.6%, మిజోరంలో 75 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి రావడంతో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ శాసనసభలోని 230 స్థానాలకు గానూ.. 227 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని లాన్జీ, పరస్‌వాడ, బైహార్ (మూడు) నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకే పోలింగ్ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ ఈసారి 2 శాతం పెరిగింది. మావోయిస్టు ప్రభావిత మూడు జిల్లాల్లోనే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది.
పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) లు మొరాయించాయని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. సాంకేతిక లోపాలున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,145 ఈవీఎంలు, 1,545 వీవీప్యాట్‌లను మార్చినట్లు ఆయన చెప్పారు. ‘ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఫిర్యాదులు 2% మాత్రమే వచ్చాయనీ, బుధవారం మాత్రం అది 2.5% వరకు ఉంది. ధర్, ఇండోర్, గుణ జిల్లాల్లో పోలింగ్ విధుల్లో ఉన్న ముగ్గురు సిబ్బంది అనారోగ్య కారణాలతో చనిపోగా, వ్యక్తిగత గొడవల్లో మరో వ్యక్తి మృతి చెందాడు. మరోచోట పోలింగ్ అధికారి తనకు అప్పగించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో అనుమతి లేకుండా హోటల్‌లో బస చేయడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించాం’అన్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతికలోపాలు తలెత్తడం, ఓటర్లు ఎదురుచూడాల్సి రావడంపై కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఈవీఎల కారణంగా పోలింగ్ ఆలస్యమైన ప్రాంతాల్లో అదనపు సమయం కేటాయించాలని అధికారులను కోరారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. అదనపు సమయం కేటాయించడంపై స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపింది.
ఓటేసిన శతాధిక వృద్ధులు
మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. సుమారు 73 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలో నిలుచుని ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ముఖ్యమంత్రి లాల్ థన్‌వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ నియోజకవర్గంలో అత్యధికంగా 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఐజ్వాల్ తూర్పు–1 నియోజకవర్గంలోని జెమబౌక్ నార్త్ ప్రాంతానికి చెందిన స్థానిక మత పెద్ద రొచింగా (108) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు 106, 104, 96 ఏళ్ల వృద్ధ ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకున్నారు. ‘ఓటు వేయడం నేనెప్పుడూ మర్చిపోలేదు.
ఓటేయడం మన బాధ్యత. దానిని మనం విస్మరిస్తే.. బాధ్యత మరిచిన సందర్భాల్లో ప్రభుత్వాన్ని మనం ఎలా ప్రశ్నించగలం’ అని రొచింగా అన్నారు. హచ్చెక్, మిజోరం నియోజకవర్గాల్లోనూ శతాధిక వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. త్రిపుర సరిహద్దుల్లోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బ్రూ శరణార్థులు 55 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు తోడ్పాటు అందించిన మిజో ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 40 సీట్లకుగాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment