
ఎన్నికల్లో పోటీ అంటేనే.. మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్పుకోవడంతోపాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చెడామడా కడిగేయడం చేయాల్సిందే. అలా చేయకపోతే మనమేంటో ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇది సహజకంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై మనకుండే అభిప్రాయం. కానీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో ఓ మూగ, చెవుడు అభ్యర్థి రంగంలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుదీప్ శుక్లా.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సాత్నా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాటలు రాకపోయినా.. రాజకీయాల్లో తన గొంతుకను వినూత్నంగా వినిపించాలని ఆయన భావిస్తున్నారు.
మూగ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని సుదీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఒకవేళ గెలిస్తే.. భారత చరిత్రలో ఎమ్మెల్యేగా ఎన్నికైన మూగ, చెవుడు వ్యక్తిగా నిలిచిపోతారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌లో నెలకు లక్ష రూపాయల జీతాన్ని వదులుకున్నారు. అయితే ఈయన ప్రచారం ఎలా సాగుతుందనేదే ఆసక్తికరంగా మారింది. ఆయనకు ప్రముఖుల నుంచి మద్దతు అందుతోంది. వికలాంగులకోసం స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న జ్ఞానేంద్ర పురోహిత్ శుక్లాకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment