ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారుల అలసత్వం బయట పడింది. ఓ స్వీపర్, అంధ ఫ్రొఫెసర్‌లను పోలింగ్ అధికారులుగా నియమించడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఇక స్వీపర్‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించడంపై ఆ రాష్ట్ర అధ్యాపకులు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల విడుదల చేసిన ఎన్నికల విధుల రోస్టర్‌లో ఈ విషయం వెలుగు చూడటంతో అధ్యాపకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-4 ఉద్యోగుల పర్యవేక్షణలో సీనియర్ అధ్యాపకులమైన తాము ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.
ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితని మండిపడ్డారు. ఎన్నికల రోస్టర్‌ను మార్పు చేయాలని తమ సంఘం తరపున కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులకు ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో సీనియర్ అధికారులు, జూనియర్ అధికారుల కింద పనిచేయవద్దని 2013లో జబల్‌పూర్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఇప్పుడు స్వీపర్‌ను ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తే సీనియర్ అధ్యాపకులమైన తాము అతని కింద పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన సీనియర్ అంధ ప్రొఫెసర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అధికారిగా తానేలా పనిచేయాలో అర్థం కావడం లేదన్నారు. ఈసీ అధికారులు మాత్రం క్లాస్-3 ఉద్యోగులనే ప్రిసైడింగ్ అధికారులుగా నియమించమని, అలాంటింది స్వీపర్‌ను ఎలా నియమిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల పేస్కేల్, పోస్ట్, హోదాను బట్టే పోలింగ్ అధికారులుగా నియమిస్తామని, గెజిటెడ్ అధికారులకే అవకాశం ఉంటుదన్నారు. పోలింగ్ అధికారుల కన్నా ప్రిసైడింగ్ అధికారుల గ్రేడ్, జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment