పదమూడేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు చౌహాన్ పలు యత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.09%. అంటే సగానికి పైగా ఓటర్లు యువతే. అందుకే వారి వ్యతిరేకత బీజేపీని భయపెడుతోంది. అసంతృప్తితతో ఉన్న యూత్‌ను ఆకర్షించడానికి చౌహాన్ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. రెండునెలల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుందనగా మెగా ఎంప్లాయిమెంట్ డ్రైవ్స్, స్టార్టప్ ఫెయిర్స్ నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చే మేధావి విద్యార్థి యోజన పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేశారు. మొదటి సారి కాలేజీలో అడుగు పెడుతున్న 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, మరో 22 వేల మందికి ల్యాప్‌ట్యాప్‌ల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఎందుకీ అసంతృప్తి ?
రెండేళ్లుగా మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యువత నైపుణ్యం పెంచుతూ వారిని పారిశ్రామిక రంగం వైపు మళ్లేలా చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగంపై గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో నిరుద్యోగులు 46శాతం, గ్రామాల్లో44 శాతం ఉన్నారు. నికరంగా నిరుద్యోగం 43 శాతంగా ఉంది. 13 ఏళ్ల పాలనలో చౌహాన్ సర్కార్ ఏడాదికి సగటున 17,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. యువతలో నిరుద్యోగిత, అల్పుఉద్యోగిత(చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం) కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62కి పెంచడం కూడా నిరుద్యోగాన్ని పెంచిందనే విమర్శలూ ఉన్నాయి.
యువ నేతలకు ప్రోత్సాహం
సామాజికంగా యువతను ఆకట్టుకునే పథకాలతో పాటు రాజకీయంగా యువనేతలను ప్రోత్సహించేందుకు బీజేపీ నడుం బిగించింది. మధ్యప్రదేశ్‌లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యువ నేతల్ని ప్రోత్సహిస్తోంది. అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ప్రచార బాధ్యతల్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌ని తీసుకువస్తూ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. గ్వాలియర్‌లో మారథన్ రన్‌లు, బుందేల్ ఖండ్‌లో జానపద నృత్యాల ఫెస్టివల్, భోపాల్‌లో కవి సమ్మేళనాలు, కుస్తీ పోటీలు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
- మేధావి విద్యార్థి యోజన: అఖిలభారత ఎంట్రన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఫీజు మినహాయింపు.
- యువ కాంట్రాక్టర్ ఇంజనీర్ యోజన: మౌలిక సదుపాయాల రంగంలో యువ ఇంజనీర్లకు ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కాంట్రాక్ట్ లైసెన్స్ ఇస్తారు.
- ప్రతిభ కిరణ్ యోజన: సాధికారత కోసం మహిళలకు ఉన్నతవిద్యలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
- గావోంకీ బేటీ యోజన: పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు పైచదువుల కోసం ఆర్థిక సాయం.
- లాడ్లీ లక్ష్మి యోజన: అమ్మాయిలు విద్యార్థి దశలో ఉన్నప్పట్నుంచి బాండ్ల రూపంలో ఆర్థిక సాయం.
- కన్యావివాహ్ యోజన: సామూహిక వివాహాలు జరిపించి పెళ్లీడు ఆడపిల్లల పెళ్లికి 15 వేల ఆర్థిక సాయం
- యువ స్వరోజ్‌గార్ యోజన: చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా యువతకు రుణాల్లో సబ్సిడీ, బ్యాంకు గ్యారంటీ.
మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 5.39కోట్లు
తొలిసారి ఓటు వేస్తున్నవారు 15 లక్షలకు పైగా
18 –29 ఏళ్ల ఓటర్లు 1.53 కోట్లు
30–39 ఏళ్ల ఓటర్లు 1.28 కోట్లు
కాంగ్రెస్‌లో కిరార్ కిరికిరి!
మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు గులాబ్ సింగ్ కిరార్‌ని కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పార్టీలోకి ఆహ్వనించారు. అయితే వ్యాపం స్కాంతో కిరార్‌కు సంబంధం ఉన్నదంటూ గతంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగిన విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. నాటి విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. మొదట కిరార్‌ని కాంగ్రెస్‌లోకి ఆహ్వనిస్తూ అధికారిక వెబ్‌సైట్ లో చేసిన ట్వీట్‌ని తొలగించడమే కాకుండా.. గులాబ్ సింగ్ కిరార్ తమ పార్టీలో చేరారన్న వాదనను కాంగ్రెస్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ గందరగోళంలోనే కిరార్ కాంగ్రెస్‌లో చేరినట్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది. అయితే తనగురించి కాంగ్రెస్ ఎలా అనుకున్నా, నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తాననీ, ఎందుకంటే తాను కాంగ్రెస్ సభ్యుడిననీ గులాబ్ సింగ్ చెప్పుకుంటున్నాడు. కిరార్ వ్యవహారంతో కాంగ్రెస్ బుద్ధి బట్టబయలైందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. కిరార్ కిరికిరి కాంగ్రెస్ నైజాన్ని బహిర్గతం చేసిందన్న ఆనందంలో బీజేపీ ఉంది. కిరార్ మధ్యప్రదేశ్ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్ మాజీ సభ్యుడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2011 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష సందర్భంగా జరిగిన అవకతవకల్లో కిరార్‌కీ, అతని కుమారుడికీ సంబం«ధం ఉందని సీబీఐ ఆరోపించింది. వ్యాపం స్కాంతో ఆయనకు సంబంధమున్నట్లు బయటపడడంతో మూడేళ్ల క్రితమే బీజేపీ అతన్ని పార్టీనుంచి తొలగించింది. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
మహిళలకే మీ ఓటు!
మిజోరంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువఉన్నప్పటికీ.. శాసనసభలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ఈ రాష్ట్రంలోని ఏకైక మహిళా సంస్థ ’మిజో మీచే ఇన్సుయిఖ్వామ్ పాల్’ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉధృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని.. అన్ని పార్టీల్లోని మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది. మహిళలు తమ శక్తిని చాటేందుకు ఇంతకన్నా మంచి సమయం రాదంటోంది ఈ సంస్థ. ’మాకు పార్టీ ముఖ్యం కాదు. మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడమే ముఖ్యం’ అని ఈ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 1978 నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలు మాత్రమే మిజో శాసనసభకు ఎన్నికయ్యారు.
గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి పట్టు
మధ్యప్రదేశ్‌లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజవర్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు ఎన్నికలుగా బీజేపీ పట్టు సాధిస్తోంది. గిరిజనులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు మాత్రం కమలంపైనే విశ్వాసం ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో పరిస్థితిని ఓసారి గమనిస్తే..
ఇటలీ, స్వీడన్.. ఇవన్నీ ఓటర్ల పేర్లే
మేఘాలయలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇటలీ, అర్జెంటైనా, స్వీడన్, ఇండోనేసియాలు దిగ్విజయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దేశాలేంటి, మేఘాలయ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడమేంటి అనుకుంటున్నారా.. అవి దేశాల పేర్లు కాదండీ బాబూ.. అవి మేఘాలయకు చెందిన ఉమ్ని– మర్‌ఎలాకా గ్రామ ప్రజల పేర్లు. అవేం పేర్లు అని ఆశ్చర్యపోకండి, ఆ ఊర్లో అందరి పేర్లూ విచిత్రంగానే ఉంటాయి. ఈ ఊళ్లో జనాలకు ఇంగ్లీష్ రైమ్స్‌పై ఆసక్తి కాస్త ఎక్కువంట. కానీ వాటి అర్ధాలు మాత్రం తెలియవట. అందుకే శబ్దం బాగుంటే పేరుగా పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పదాలు బాగున్నాయనే ఏకైక కారణంతో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని అక్కడి సర్పంచ్ ప్రీమియర్ సింగ్ చెప్పారు. టేబుల్, గ్లోబ్, పేపర్, శాటరన్, అరేబియన్ సీ, రిక్వెస్ట్, లవ్లీనెస్, హ్యాపీనెస్, గుడ్‌నెస్, యూనిటీ, స్వీటర్, గోవా, త్రిపుర.. లాంటి పలు నామధేయులు ఆ ఊర్లో మీకు ఎదురవుతారు. అన్నింటికనా విచిత్రంగా ఆ ఊర్లో ఒకామె పేరు ‘‘ఐ హావ్ బీన్ డెలివర్డ్’’. ఇవన్నీ చదువుతుంటే మనకు సరదాగా ఉంది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అధికారులు మాత్రం ఈ పేర్లతో గజిబిజి పడుతున్నామని వాపోతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment