Mizoram Elections 2018
-
మిజోరం కొత్త సీఎం ప్రమాణం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు. తాన్లూ్యయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు. -
మిజోరం సీఎంగా ఎల్లుండి జోరంథంగా ప్రమాణం
ఐజ్వాల్: మిజోరం నూతన సీఎంగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్ఎన్ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి కొత్తగా ఎన్నికై న శాసనసభా సభ్యుల జాబితా అందడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ జోరంథంగాను ఆహ్వానించారు. మరోవైపు, కొత్త అసెంబ్లీ కొలువుదీరేందుకు ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేశారు. జోరంథంగాతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేస్తారా? లేదా? అన్నది తెలియరాలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన జోరంథంగా పదేళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఎమ్ఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ 5 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ ఒక సీటు గెలుచుకుని మిజోరంలో బోణీ చేసింది. కాంగ్రెస్ కొంప ముంచిన ‘మద్యం’ మిజోరంలో 20 ఏళ్లపాటు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యాక 2015లో మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్య నిషేధా న్ని డిమాండ్ చేస్తూ క్రైస్తవ వర్గాలు విస్తృతంగా ఆందోళనలు చేపట్టాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పెడచెవినపెట్టి భారీ మూల్యం చెల్లించుకుందని భావిస్తున్నారు. -
మిజోరంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎంఎన్ఎఫ్
ఐజ్వాల్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 24 స్ధానాల్లో గెలుపొందిన మిజో నేషనల్ ఫ్రంట్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మిజోరంలో తమ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము యూపీఏలో చేరబోమని ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరంతంగా తెలిపారు. తాము నార్త్ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మద్య నిషేధం విదించడంతో పాటు రహదారుల మరమ్మత్తులు, సామాజికార్ధిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడమే అజెండాగా పనిచేస్తామన్నారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్‌కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► బాగేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌లో నువ్వా–నేనా ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్‌లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
పీపుల్స్ పల్స్: ఎంపీలో కాంగ్రెస్, మిజోరంలో హంగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, చత్తీస్‌గఢ్‌లో కూడా 15 ఏళ్ల బీజేపీ పాలకను తెరపడబోతోందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నవంబర్‌లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడబోవడం విశేష పరిణామం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 41.6 శాతం ఓట్లతో 116 నుంచి 120 సీట్లను గెలుచుకోబోతుండగా, పాలకపక్ష బీజేపీ పార్టీ 39.3 శాతం ఓట్లతో 98–102 స్థానాలకు పరిమితం కాబోతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41.6 % 116-120 బీజేపీ 39.3 % 98-102 బీఎస్పీ 4.2 % 0-2 ఇతరులు 14.9 % 2-5 చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41. % 43-45 బీజేపీ 40 % 40-42 జేసీసీ-బీఎస్పీ 11 % 2-3 ఇతరులు 8 % 0-1 ఇక బహుజన సమాజ్ పార్టీ 4.2 శాతం ఓట్లతో 0–2 సీట్ల వరకు, ఇతరులు 14.9 శాతం ఓట్లతో రెండు నుంచి ఐదు సీట్ల వర కు కైవసం చేసుకోబోతోంది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా రాణించినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకే కాస్త ఆధిక్యత లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లతో 43 నుంచి 45 సీట్లు, బీజేపీకి 40 శాతం ఓట్లతో 40 నుంచి 42 సీట్లు, జేసీసీ–బీఎస్పీ 11 శాతం ఓట్లతో రెండు నుంచి మూడు సీట్లు, ఇతరులు ఎనిమిది శాతం ఓట్లతో ఒక్క సీటు సాధించే అవకాశం ఉంది. అదే మిజోరంకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మిజో నేషనల్ ఫ్రంట్‌కు 15–19 సీట్లు, పాలకపక్ష కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు, జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు 2–4 సీట్లు, బీజేపీకి 0–2 సీట్ల వరకు రావచ్చని సర్వేలో తేలింది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల వివరాలు (అంచనా) పార్టీ గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 14-19 ఎంఎన్ఎఫ్ 15-19 జెడ్పీఎం 2-4 బీజేపీ 0-2 మిజోరం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ల మధ్యనే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. తొలిసారిగా బీజేపీ మిజోరం ఎన్నికల్లోకి దిగడం, కొత్తగా ఏర్పడిన జోరమ్ పీపుల్స్ ఫ్రంట్‌కు కూడా పలు స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పీపుల్స్ పల్స్ ప్రతినిధులు మిజోరంలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించగా, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 18 నుంచి 26వ తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.మధ్యప్రదేశ్‌లోని ఆరు భిన్న ప్రాంతాల్లో ఓటర్ల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించగా ఎక్కువ ప్రాంతాల్లో బీజేపీ నష్టపోతున్నట్లు తెల్సింది. చంబల్, గ్వాలియర్ రీజన్లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బుందేల్‌ఖండ్, బఘేల్ఖండ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఎక్కువగా ఉంది. మహాకోశల్ ప్రాంతంలో పాలక పక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా ఉంది. మాల్వా రీజన్లో కాంగ్రె‹స్కు, భోపాల్ రీజన్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది. -
మిజోరం ఎన్నికల్లో విజయం ఎవరిది?
సాక్షి, ఐజాల్ : మిజోరంలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలు నిజమయ్యేనా? పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పెరిగిపోయిన అవినీతి, బంధుప్రీతి పార్టీ విజయావకాశాలను దెబ్బతీయవా? వ్యవసాయ సంక్షోభం కారణంగా పాలకపక్షంపై మండిపడుతున్న రైతులు కాంగ్రెస్ విజయావకాశాలను ఏ మేరకు దెబ్బతీయగలరు? క్రైస్తవ విలువలకు కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యనిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తామంటూ విస్తతంగా ప్రచారం చేస్తున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఏ మేరకు రాణించనుంది? మిజోరం ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో చేసుకుంటున్న పోడు వ్యవసాయం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వ్యవసాయం కోసం కొత్త భూమిని వినియోగించే విధానం’ను 2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రవేశపెట్టింది. 2013 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఆ విధానమే పార్టీకి తోడ్పడింది. ఫలితంగా రాష్ట్రంలోని 40 సీట్లకుగాను 2008లో 32 సీట్లను గెలుచుకోగా, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 34 సీట్లను గెలుచుకుంది. ఓట్ల శాతం కూడా 38.89 శాతం నుంచి 44.63 శాతానికి పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానం ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో రైతుల్లో నిరాశ నిస్పహలు పెరిగి పోయాయి. గతంలో మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ ప్రధానంగా పోటీ పడగా, ఈసారి బీజేపీతోపాటు ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్’ పేరిట ఏడు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈ మూవ్మెంట్ కింద పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతున్న మిజో నేషనల్ ఫ్రంట్, రాష్ట్ర స్థాయిలో ‘నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్‌లో కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి జోరమ్‌థంగా పదే పదే ఖండిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి బీజేపిని అడ్డుకునేందుకు తాము ఎన్నికల అనంతరం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇటు కాంగ్రెస్‌కు అటు మిజో నేషనల్ ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రజల ముందుకు వచ్చామని జోరం పీపుల్స్ మూవ్మెంట్ వచ్చామని చెబుతున్నప్పటికీ జోరం అభ్యర్థులు మిజో నేషనల్ ఫ్రంట్‌ను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌కు లాభం చేకూర్చే అవకాశాలే స్థానికంగా ఎక్కువ కనపిస్తున్నాయి. ఫలితంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే గతంలోకెల్లా సీట్లు గణనీయంగా తగ్గిపోవచ్చు. మిజోరంలో బుధవారం కొనసాగుతున్న పోలింగ్ సరళి కూడా ఇదే సూచిస్తోంది. -
మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరగనుంది. మధ్యప్రదేశ్, మిజోరం పోలింగ్ లైవ్ అప్డేట్స్: సాయంత్రం 5.45: మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్: మధ్యప్రదేశ్‌లో సుమారు 65.5శాతం, మిజోరంలో 73శాతం పోలింగ్ నమోదు మధ్యాహ్నం 2.30: మధ్యప్రదేశ్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 2.15: కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన హస్తం గుర్తు చూపించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఎవరికి ఓటేశారని జర్నలిస్టులు అడిగితే చేతి గుర్తు చూపించానని ఆయన వివరణయిచ్చారు. కమలం గుర్తు చూపించమంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు. మధ్యాహ్నం 1.45: పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు, వీవీప్యాట్ల మొరాయింపుపై ప్రధాన సీఈసీ ఓపీ రావత్ స్పందించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్య తలెత్తినట్టు తెలిపారు. సమస్య తలెత్తిన ఈవీఎంలను, వీవీప్యాట్లను రీప్లేస్ చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఈవీఎం పనిచేయకపోవడం ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి వెళ్లినట్టయితే.. ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1.30: మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యప్రదేశ్‌లో 28.68 శాతం, మిజోరంలో 49 శాతం పోలింగ్ నమోదయింది. మద్యాహ్నం 12.30: ఈవీఎంలలో లోపాలు తలెత్తినట్టు 100కు పైగా పోలింగ్ కేంద్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించామని పేర్కొన్నారు. మద్యాహ్నం 12.00: పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈసీ ఓటింగ్ సమయాన్ని పెంచాలని జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఉదయం 11.40: ఉదయం 11 గంటల వరకు మిజోరంలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11.30: మధ్యప్రదేశ్‌లోని గుణ, ఇండోర్లలో ఎన్నికలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన ముగ్గురు అధికారుల కుటుంబాలకు ఈసీ పరిహారం ప్రకటించింది. ఉదయం 11.00: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల ఆశీస్సులతో డిసెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 10.00: ఉదయం 9 గంటల వరకు మిజోరంలో 15 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.32 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తింది. ఉదయం 9.30: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. ఉదయం 9.15: మధ్యప్రదేశ్, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. మరోవైపు మిజోరం ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉదయం 8.35: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు చింద్వారా హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ప్రజలపై పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. చాలా కాలం నుంచి రాష్ట్రంలోని అమాయక ప్రజలను బీజేపీ మోసం చేస్తూ వస్తుందన్నారు. ఉదయం 8.20: మిజోరంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 8.00: మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 2 లక్షల మంది పోలీసులతో ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా సీఎం పీఠంపై కన్నేసింది. మరోవైపు బీజేపీ వ్యతిరేకతను తమవైపు మలుచుకుని ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది. ఉదయం 7.50: రాష్ట్రవ్యాప్తంగా మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నర్మద తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని 3 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 227 నియోజకవర్గాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7.00: మిజోరంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 7.7 లక్షల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2008, 2013లలో మిజోరంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
డ్రగ్స్.. మద్యం..మిజోరం
‘తాగుడు, మాదక ద్రవ్యాల వ్యవసాలున్న వారిని మా పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టం. ఎలాటి చెడు అలవాట్లు లేని వారికే టికెట్లిస్తాం’ మిజోరం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల నిఘా వేదికకు సమర్పించాల్సిన అవగాహన పత్రమిది. ‘ఎన్నికల్లో తాగుబోతులు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి ఓటు వేయకండి. ఈ అలవాట్లున్న వారిని దూరం పెట్టండి’ ఎన్నికలప్పుడు క్రైస్తవ మత పెద్దలు ప్రజలకిచ్చే సందేశమిది. ఈ రెండు ప్రకటనలు చాలు మిజోరంలో మద్యం, డ్రగ్స్ పోషిస్తున్న కీలకపాత్రను అర్థం చేసుకునేందుకు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ రెండు అంశాలు పార్టీల తలరాతలను నిర్ణయించనున్నాయి. ఇక్కడి నుంచే దేశంలోకి! రాష్ట్ర జనాభాలో 87% వరకు క్రైస్తవులే. అక్కడ చర్చి పెద్దల మాటే శాసనం. అయితే.. మద్యం, మాదక ద్రవ్యాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుండటంతో ప్రతి ఎన్నికల్లో ఈ రెండు అంశాలు కీలకంగా మారతాయి. ప్రతి పార్టీ ప్రతి ఎన్నికల్లో ఈ రెండింటినీ తరిమేస్తామని వాగ్దానం చేస్తుంది. ఏ పార్టీ ఈ వాగ్దానాలను అమలుచేయగలదని అనుకుంటారో.. ఆ పార్టీనే ఓటర్లు గెలిపిస్తూ వస్తున్నారు. ప్రజలను ఈ చెడు అలవాట్లనుంచి దూరం చేయడానికి ప్రిస్బిటేరియన్ సినోడ్ (చర్చిలతో కూడిన అతిపెద్ద సంస్థ) ప్రయత్నిస్తోంది. ప్రతి ఎన్నికల్లో తాగుబోతులకు ఓటెయ్యవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తుంది. అలాగే, చర్చి మద్దతు ఉన్న మిజోరం పీపుల్స్ ఫోరం (ఎన్నికల నిఘా వేదిక) కూడా రాజకీయ పార్టీల నుంచి హామీ పత్రం తీసుకుంటుంది. మరోవైపు యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)కు చెందిన సప్లయ్ రిడక్షన్ స్క్వాడ్ (ఎస్సారెస్) రాష్ట్రంనుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడానికి పోరాటం చేస్తోంది. డ్రగ్స్ వాడే వారు రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడిపోతుంటారు. ఈ ఏడాది ఇంత వరకు 36 మంది డ్రగ్స్ కారణంగా చనిపోయారని, వారిలో 15 చావులకు హెరాయినే కారణమని ఎస్సారెస్ బాధ్యుడు చవాంగ్ తెలిపారు. 2004లో 142 మంది డ్రగ్స్‌కు బలయ్యారని ఆయన అన్నారు. ఉత్తరాన కాచర్ పర్వతాలు, తూర్పున మయన్మార్, దక్షిణాన ఉన్న బంగ్లాదేశ్ నుంచి మిజోరంకు భారీగా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అఫ్గానిస్తాన్ తర్వాత ప్రపచంలో అత్యధికంగా హెరాయిన్‌ను సరఫరా చేసేది మయన్మారే. మిజోరం నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అన్ని పార్టీల దృష్టి వీటిపైనే ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీలు మేనిఫెస్టోల్లో పేర్కొనకపోయినా మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రచారాల్లో మాత్రం తప్పక ప్రస్తావిస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ బాధితుల కోసం మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పార్టీలంటున్నాయి. రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి మద్యనిషేధం అమల్లో ఉంది. అయితే 2015లో కాంగ్రెస్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. మద్యనిషేధం కారణంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే బీజేపీ మాత్రం స్థానిక బ్రాండ్లనే ప్రోత్సహిస్తామని ప్రచారం చేస్తోంది. -
పట్టుచిక్కేదెవరికి?
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లతో పరిమాణంలో చిన్నగానే కనబడుతున్నా.. ఇది కీలకమైన రాష్ట్రమే. బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఇది అత్యంత కీలకం. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈశాన్యంలో ఒక్కోరాష్ట్రంలో పట్టుకోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. ఈ ప్రాంతంలో మిగిలిన చిట్టచివరి రాష్ట్రం మిజోరం. అందుకే ఎలాగైనా ఇక్కడ పట్టునిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అటు బీజేపీ కూడా మిజోరంను తమ ఖాతాలో వేసుకుంటే.. కాంగ్రెస్ ముక్త్ ఈశాన్య నినాదాన్ని సంపూర్ణం చేసినట్లు ఉంటుందని భావిస్తోంది. అయితే ఇంతవరకు మిజోల గడ్డపై ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా.. క్రైస్తవుల కోటలో పాగా వేయాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బుధవారం ఎన్నికలు జరగనున్న మిజోరంలో ప్రతిపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్మెన్‌ఎఫ్) ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఏదేమైనా మిజోరంలో గెలవడం కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య. బీజేపీతో సమస్యలు: కాంగ్రెస్ విమర్శ అధికార కాంగ్రెస్, విపక్ష ఎమ్మెన్‌ఎఫ్ పార్టీలకు బీజేపీ తమ శత్రువు అని చెప్పుకోవడమే ప్రధాన ప్రచారాంశంగా మారింది. మిజోరం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకుంటున్న బీజేపీ.. నేరుగా కాంగ్రెస్‌తో తలపడటం వీలుకాకపోవడంతో ఎమ్మెన్‌ఎఫ్ సాయంతో పోటీ చేస్తోందంటూ సీఎం లాల్ థన్వాలా విమర్శిస్తున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, ఎమ్మెన్‌ఎఫ్ కలిసిపోతాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటుగా.. క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని క్రిస్టియన్ల అస్తిత్వానికి సమస్యలు ఎదురవుతాయని కూడా కాంగ్రెస్ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలు గెలుచుకుంటామని థన్వాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆరు సార్లు సీఎంగా పని చేసిన థన్వాలా.. 2014లో బీజేపీ హవా నడిచిన సమయంలో కూడా మిజోరంలో తన పట్టు నిలుపుకోగలిగారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీజేపీని హిందూత్వ పార్టీగానే గుర్తిస్తున్నారని, ఆపార్టీకి అధికారం అప్పగించరని ఆయన అన్నారు. ధీమాగా ఎమ్మెన్‌ఎఫ్ విపక్షమైన ఎమ్మెన్‌ఎఫ్ కూడా విజయంపై ధీమాగానే ఉంది. బీజేపీతో తమకెలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సీఎం అభ్యర్థి, మాజీ సీఎం జొరాంతంగ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి ఒక్క సీటు దక్కితే గొప్పేనంటున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో ఇటీవలే ఏర్పాటైన జేడ్పీఎం కూటమి కూడా గణనీయమైన ప్రభావం చూపించగలదని పరిశీలకులు అంటున్నారు. ఈ కూటమి పోటీ చేస్తున్న 35 స్థానాల్లో ప్రధాన పార్టీల ఓట్లు చీల్చుతుందని వారంటున్నారు. కాంగ్రెస్ 40 సీట్లలో, బీజేపీ 39 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. ఎమ్మెన్‌ఎఫ్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) 35 సీట్లలో బరిలో ఉంది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఎ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు కూడా కొన్ని చోట్ల అభ్యర్ధులను పోటీలో దించాయి. కమలానికి ఓట్లు తక్కువే! గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 0.37% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా ఈ సారి బీజేపీ 39 స్థానాల్లో పోటీ పడుతోంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తనకు మేలు చేస్తాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఇటీవల పార్టీకి రాజీనామా చేయడాన్ని తమకనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది. సీఎం సహా 9మందిపై క్రిమినల్ కేసులు ముఖ్యమంత్రి థన్వాలా, ప్రతిపక్ష నేత జొరాంతంగ సహా 9 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని మిజోరం ఎలక్షన్ వాచ్ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 200 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 116 మంది కోటీశ్వరులు. వీరిలో 35 మంది ఎమ్మెన్‌ఎఫ్, 33 మంది కాంగ్రెస్ వాళ్లున్నారు. ఆయన ఆస్తి 55 కోట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరిలో కోటీశ్వరుడు ఎమ్మెన్‌ఎఫ్ నాయకుడు రాబర్ట్ రోమావియా రోవ్టే. ఈయన ఆస్తి 55 కోట్లు. రాబర్ట్ (51)కు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక ఫుట్‌బాల్ క్లబ్ ఉంది. ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాబర్ట్ ఇన్ని కోట్లున్నా ప్రచారం మాత్రం కాలినడకనే. ఇంటింటికీ తిరిగి ఆయన ప్రచారం చేస్తున్నారు. బ్యానర్లు, కటౌట్ జోలికి పోకుండా విజిటింగ్ కార్డు సైజున్న కార్డులపై పేరు, నియోజకవర్గం ముద్రించి పంచిపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం రాబర్ట్‌కు ఇదే మొదటి సారి. ప్రచారంలో ప్రత్యర్థులెవరినీ వ్యక్తిగతంగా దూషించని రాబర్ట్ తన అనుచరులకు కూడా అదే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి లాల్సవ్టాపై ఆయన పోటీ చేస్తున్నారు. ప్రముఖనాయకులు: లాల్ థన్వాలా (కాంగ్రెస్), జొరామ్‌తంగ (ఎమ్మెన్‌ఎఫ్), జేవీ హ్లునా (బీజేపీ), ఎన్నికల్లో కీలకాంశాలు: మద్యనిషేధం, అక్రమ వలసదారులు, మౌలిక వసతుల లేమి, నిరుద్యోగం, బ్రూ శరణార్థులు, ప్రభుత్వ వ్యతిరేకత, రెబెల్ అభ్యర్ధులు. మేనిఫెస్టోల్లో ప్రధానాంశాలు బీజేపీ: రూ.1కే కిలో బియ్యం, అందరికీ ఇళ్లు కాంగ్రెస్: విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, కొత్త భూ–వినిమయ చట్టం తీసుకురావడం. ఎమ్మెన్‌ఎఫ్: సామాజిక రాజకీయ అభివృద్ది, గ్రామస్థాయిలో పౌరుల నమోదు. -
‘ఈశాన్య’ సంస్కృతి వాళ్లకో వింత
ఐజ్వాల్/లుంగ్లీ: ఈశాన్య ప్రాంతమంటే కాంగ్రెస్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, అక్కడి సంప్రదాయాలు, వస్త్రధారణను ఆ పార్టీ వింతగా చూడటం తనను బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరంలోని లుంగ్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతంలో రవాణా మార్గాలను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్నదే తమ అభివృద్ధి మంత్రమని తెలిపారు. లుంగ్లీలో ప్రచారం ముగిశాక రాజధాని ఐజ్వాల్‌లో మోదీ..ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలతో ముచ్చటించారు. వారికి అధికారమే కావాలి.. కాంగ్రెస్‌ను వదిలించుకునేందుకు మిజోరంకు ఇదే చక్కటి అవకాశమని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రధాన్యతాంశాల్లో ప్రజలు లేరని, అధికారం కోసమే వెంపర్లాడుతోందని మండిపడ్డారు. ‘మీ ఆశలు, ఆకాంక్షలంటే కాంగ్రెస్‌కు పట్టింపు లేదు. అధికారం దక్కించుకోవడమే వారికి ముఖ్యం. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే మిజోరం అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. బీజేపీ హయాంలో ఈశాన్య ప్రాంతంలో రైల్వే మార్గాల విస్తరణ మూడింతలు పెరిగింది. క్రీడా నైపుణ్యానికి మిజోరం కేంద్ర బిందువు. ఇక్కడ పుట్టిన బిడ్డ ‘రోటి’ అనే పదం పలకడానికి ముందే బలంగా బంతిని తన్నడం నేర్చుకుంటాడుæ’ అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. -
శరణార్థినే శరణుజొచ్చి!
మిజోరం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అసెంబ్లీలో ఖాతా తెరవని బీజేపీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఏ అవకాశాన్నీ వదలకుండా తీవ్రంగా కృషిచేస్తోంది. మిజోరంలోని చక్మాలు, మారాలు, లాయిస్, బ్రూల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది. త్రిపురలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న బ్రూ గిరిజన తెగ శరణార్థుల ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిందేమీ లేదంటూ.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 1997 సంవత్సరంలో మిజోలకు, బ్రూలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. అవి హింసాత్మకంగా మారడంతో బ్రూలు పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఉత్తర త్రిపురలో మొత్తం 6 తాత్కాలిక శిబిరాల్లో బ్రూ తెగవారు తలదాచుకుంటున్నారు. వీరిని వెనక్కి తీసుకురావడానికి మిజోరం, త్రిపురల్లో బ్రూ తెగ సంక్షేమం కోసం పోరాడుతున్న సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే.. కేవలం 31 కుటుంబాలే తిరిగి రాష్ట్రానికి వచ్చాయి. మరో 32 వేల మంది శరణార్థులు అక్కడే ఉన్నారు. వారిలో 11,232 మందికి ఓటు హక్కు ఉంది. అదే ఇప్పుడు బీజేపీ వీరిపై దృష్టిపెట్టేందుకు కారణమైంది. ఓటు హక్కుపై రగడ ఇంకా సొంత రాష్ట్రానికి తిరిగి రాని బ్రూ తెగ గిరిజనులు ఓటు హక్కు వినియోగంపై మిజోరంలో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఎస్బీ శశాంక్ పదవికే ఎసరు వచ్చింది. త్రిపురలో శరణార్థి శిబిరాల్లో బ్రూలు ఓటు హక్కు వినియోగానికి శశాంక్ అనుమతినిచ్చారు. శశాంక్ నిర్ణయాన్ని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి చువాంగ్ తప్పుపట్టారు. దీంతో ఎన్నికల విధుల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ శశాంక్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ చువాంగ్‌పై వేటు వేసింది. ఈ పరిణామాలపై పౌర సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బ్రూలకు కొమ్ముకాస్తున్నారంటూ శశాంక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. మిజోరం వచ్చి వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని డిమాండ్లు వినిపించాయి. ఈ ఆందోళనలకు తలొగ్గిన ఎన్నికల సంఘం.. శశాంక్‌ను తప్పించి ఆశిష్ కుంద్రాకు ఎన్నికల అధికారిగా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు బ్రూలు స్థానికుల డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నారు. 2013 ఎన్నికల్లోనూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ తాము ఈ శిబిరాల నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి మధ్యేమార్గంగా మిజోరం, త్రిపుర సరిహద్దు గ్రామాల్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి బ్రూలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆశిష్ చర్యలు చేపట్టారు. అయితే బ్రూ గిరిజనులు ఓటు వేయడం పట్ల మెజారిటీ మిజోలకు కంటగింపుగా ఉంది. త్రిపురలో ఉన్న బ్రూలు ఓటేయడానికి ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి మిజో విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. స్పష్టమైన లక్ష్యాలతో.. ఈశాన్య ముక్త్ కాంగ్రెస్ కలను సాకారం చేసుకోవడానికి మిజోరం ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించేందుకు పకడ్బందీ వ్యూహాలనే రచిస్తోంది. బ్రూ గిరిజన తెగ శరణార్థి ఓటర్ల సంఖ్య 11 వేలే అయినప్పటికీ జనాభా తక్కువగా ఉన్న మిజోలో స్వల్ప ఓట్లు కూడా అభ్యర్థి జయాపజయాల్ని నిర్ణయిస్తాయి. అందుకే ఆ ఓట్లను ఆకర్షించడానికి శరణార్థి శిబిరాలకు వెళ్లి మరీ ప్రచారం చేస్తోంది. బ్రూలను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రయత్నించిందని, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే వారి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తామంటూ ప్రచారం చేస్తోంది. 40 స్థానాలున్న మిజో అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేసి 0.37శాతం మాత్రమే ఓటు షేర్ సాధించింది. ఇప్పుడు 39 స్థానాల్లో పోటీకి దిగుతోంది. క్రిస్టియన్ల జనాభా మెజారిటీగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి విజయావకాశాలు తక్కువే. అయితే వరసపెట్టి ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు బిగుస్తూ వస్తున్న కమలనాథులు మిజోరంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ)తో ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకోనప్పటికీ, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎన్నికల తర్వాత చేతులు కలిపే అవకాశాలున్నాయి. నామినేషన్లు కుప్పలుతెప్పలు.. ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఛత్తీస్‌గఢ్‌లో ఒక సీటుకు సరాసరిగా 34 నామినేషన్లు దాఖలవగా.. మిజోరంలో కనిష్టంగా సగటున సీటుకు 5గురు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నామినేషన్ల సంఖ్య వేలల్లో ఉంది. ప్రచార సామగ్రికి డిమాండ్! రాజస్తాన్‌లో ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పార్టీల్లో, ప్రచారంలో వేడి పెరుగుతోంది. రోజురోజుకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సామగ్రికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పార్టీలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారంలో పోటీపడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఎనలేని పాట్లు పడుతున్నాయి. ప్రమోషన్ కటౌట్లు, బ్యానర్లు, స్టికర్లు తదితర ప్రచార సామగ్రిని వినియోగిస్తున్నాయి. వీటి కోసం భారీగా ఆర్డర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యానర్లు, పోస్టర్లకు బాగా గిరాకీ ఉందని వీటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు పోటీలో ఉన్నాయి. అన్ని పార్టీల సామగ్రికీ గిరాకీ ఉందన్నారు. -
ఈసారి ‘వైఎంఏ’ మద్దతు ఎవరికో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిసారి మిజోరమ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)’ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 1998–2003 ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీయే విజయం సాధించింది. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా వైఎంఏ మద్దతుతో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 28వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వాన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ కూడా రంగప్రవేశం చేయడంతో వైఎంఏ ఈసారి ఎవరికి మద్దతు ఇస్తున్నది ఆసక్తిగా మారింది. యంగ్ మిజో అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీతోని అనుబంధం లేకుండా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా 4,27,323 మంది సభ్యులు ఉన్నారు. సామాన్యంగా వీరంత నాయకత్వం మాటకు కట్టుబడి ఓటేస్తారు. మొత్తం రాష్ట్ర జనాభాలో వైఎంఏ సభ్యుల సంఖ్య దాదాపు 40 శాతం ఉండడంతో వారు ఎవరికి ఓటేస్తే ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. అందుకని ఎన్నికల బరిలో దిగే ప్రతిపార్టీ వైఎంఏ మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ సంఘంలోని వివిధ విభాగాలు, వివిధ కమిటీలు రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి ఎవరికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది? ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యకమాలు కొనసాగుతాయి? అన్న అంశాలతోపాటు గత ప్రభుత్వం పాలనాతీరును కూడా క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. 91 శాతం అక్షరాస్యత కలిగిన మిజోరంలో ఈ సంఘం సభ్యులు చాలా చైతన్యవంతులు. వారికి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సభ్యులంతా చురుగ్గా పాల్గొంటారు. అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడరు. మురికి వాడలను శుద్ధిచేయడంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సంఘం తరఫున రోడ్లు వేస్తారు. మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటారు. ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా సంఘం సభ్యులు వెళ్లి దగ్గరుండి దహన సంస్కారాల వరకు అన్ని చూసుకుంటారు. శ్మశానంలో సమాధి కోసం గోతులు కూడా స్వయంగా తవ్వుతారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబం వెంట సంఘం సభ్యులు కనీసం మూడు రోజులు ఉంటారు. ఆ సందర్భంగా వారికి అన్ని విధాల అండగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు కూడా సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 804 బ్రాంచీలు, 17 కమిటీలు వైఎంఏకు రాష్ట్రవ్యాప్తంగా 47 గ్రూపు యూనిట్లు, 804 బ్రాంచీలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే కమిటీతోపాటు సంగీతం, సాహిత్యం, క్రీడలకు కలుపుకొని మొత్తం 17 కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఆరుగురు కార్యవర్గ సభ్యులతో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మాత్రం ఆవిర్భావం నుంచి ఇంతవరకు ఒక మహిళ కూడా ఎన్నిక కాలేదు. గత మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు పోటీ చేయగా, ఈసారి ఎన్నికల్లో 15 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. యువతే ఉండాల్సిన అవసరం లేదు యంగ్ మిజో అసోసియేషన్ అనగానే ఇందులో యువతీ యువకులే ఉంటారని ఎవరైనా అనుకోవచ్చు. 14 ఏళ్ల దాటిన మిజోలందరూ ఐదు రూపాయల రుసుము చెల్లించి ఈ సంఘంలో చేరవచ్చు. సభ్యత్వం పునరుద్ధరణకు వారు ప్రతి ఏటా ఐదు రూపాయలు చెల్లిస్తూ పోవాలి. అలా జీవితాంతం సంఘంలో సభ్యులుగా కొనసాగవచ్చు. సభ్యత్వం వద్దనుకుంటే ఏ వయస్సులోనైనా వదులుకోవచ్చు. ఈ సంఘాన్ని 1935లో ఓ క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం నుంచి ఏ క్రైస్తవ మిషనరీతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సంస్థగానే ఇది పనిచేస్తూ వస్తోంది. ఇందులో మెజారిటీ సభ్యులు క్రైస్తవులే అయినప్పటికీ ఏ మతస్థులైనా చేరవచ్చు. మిజోరం మొత్తం జనాభాలో 85 శాతం క్రైస్తవులే అన్న విషయం తెల్సిందే. సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయం ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపైన వీరు వివిధ స్థాయిల్లో, వివిధ గ్రూపులతో సంప్రతింపులు, చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని అధికారికంగా బయటకు వెళ్లడించరు. లోపాయికారిగానే సందేశం వెళుతుంది. ఆ సందేశానికి దాదాపు 90 శాతం మంది సభ్యులు కట్టుబడి ఓటేస్తారు. ఈ సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భయపడిందంటే సంఘానికున్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా ఆందోళన నవంబర్ ఆరవ తేదీన సంఘం సభ్యులు దాదాపు 50 వేల మంది తరలివచ్చి ఎన్నికల సంఘం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఎన్నికల సంఘం ఓ ఉద్యోగిని బదిలీ చేసింది. త్రిపుర శిబిరంలో తలదాచుకుంటున్న 32 వేల మంది శరణార్థి బ్రూలు ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినందునే వారు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో మైనారిటీలైన బ్రూలన్నా, చక్మాలన్నా ఈ సంఘం సభ్యులకు పడదు. అందులో అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండడం కారణమని మైనారిటీలు ఆరోపిస్తున్నారు. వీరంతా అక్రమంగా తమ రాష్ట్రానికి వలస వచ్చిన వారన్నది వైఎంఏ నమ్మకం. అందుకనే ప్రతి ఎన్నికల సందర్భంగా మైనారిటీల నుంచి ఎవరికి టిక్కెట్లు ఇవ్వరాదని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ సంఘం విజ్ఞప్తి చేయడం పరిపాటిగా మారింది. కొన్ని సార్లు వీరి మాటను రాజకీయ పార్టీలు విన్నాయి. కొన్ని సార్లు సున్నితంగా తిరస్కరించాయి. ఏదిఏమైనా సంఘం మద్దతే పార్టీకి విజయం. సంప్రతింపుల్లో సంఘం సభ్యులు ఈసారి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెల్సింది. -
ఇంటింటికా.. ఓకే!
మిజోరం ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్ధులు ఇకపై ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. ఎన్నికలంటేనే ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడమే కదా, మళ్లీ కొత్తగా చెప్పేదేంటి అనుకుంటున్నారా? ఇది తెలియాంటే మీకు మిజోరామ్ పీపుల్స్ ఫోరమ్ (ఎంపీఎఫ్) గురించి తెలియాలి. ఎన్నికల సమయంలో ఎంపీఎఫ్ సంస్థ వాచ్డాగ్ లాగా పనిచేస్తుంది. చర్చి అండతో ఏర్పాటైన ఎంపీఎఫ్‌లో పలు ప్రభుత్వేతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఎంపీఎఫ్ శాసిస్తుంది, ప్రజలు పాటిస్తారు. అదంతే. దాన్నెవరూ మార్చలేరు. ఎంపీఎఫ్ పుణ్యమా అని మిజోరంలో గత రెండు ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారానికి అవకాశం లేదు. ఏదైనా నియోజకవర్గంలో పోటీపడుతున్న వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరూ ఒకే ఉమ్మడి వేదికపైనే ప్రచారం చేసుకోవాల్సి వచ్చేది. ఆయా అభ్యర్థులు తమ గుణగణాలు, తామేం చేయదలచుకున్నది ఆ వేదిక ద్వారా ప్రజలకు చెప్పేవారు. అభ్యర్థులు కూడా ఎంపీఎఫ్‌ను కాదని ముందడుగు వేయడానికి సాహసించలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్టాండ్ తీసుకున్న ఎంపీఎఫ్ ఈసారికి నిబంధనలను కాస్త సడలించింది. ఒకే వేదిక ప్రచార విధానాన్ని పక్కనపెట్టి ఇంటింటి ప్రచారానికి అనుమతించింది. దీంతో పార్టీలు ఎగిరిగంతేశాయి. అయితే ఎంపీఎఫ్ ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఇంటింటికీ తిరిగే అభ్యర్ధుల వెంట కార్యకర్తలు ఉండకూడదు, అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు ఆయనతోపాటు ఎంపీఎఫ్ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. ఇది వినేందుకు కాస్తంత ఇబ్బదికరంగానే ఉన్నా.. పాపం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఇచ్చారుగా అన్న సంతోషంతో పార్టీలన్నీ ఈ నిబంధనకు అంగీకరించాయి. 2006లో ఎంపీఎఫ్ ఏర్పాటైంది. అంతకుముందు ఎన్నికల సందర్భంగా హింస, ప్రలోభాలు తీవ్రస్థాయిలో ఉండేవని, వీటిని అడ్డుకునేందుకే.. చర్చి రంగంలోకి దిగి ఈ ఫోరమ్ ఏర్పరిచిందని ప్రతినిధులు చెప్పారు. తమ సంస్థ ఏపార్టీకీ అనుకూలం కాదని, తాము ఎన్నికల్లో తటస్థంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీఎఫ్ కళ్లు గప్పి ఓటర్లను ప్రలోభపెడుతోందని మిజో పీపుల్స్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఎంపీఎఫ్ సభ్యులను కలుపుకుని ప్రచారానికి వెళ్లడం అసౌకర్యంగా ఉందని మెజారిటీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీలో చేరిన మిజోరం స్పీకర్ హైఫీ
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత హైఫీ(81) సొంత పార్టీకి షాకిచ్చారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హైఫీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ లాల్‌రినవ్మకు హైఫీ సోమవారం తన రాజీనామాను సమర్పించగా, ఆయన ఆమోదించారు. స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా కౌన్సిళ్ల అధికారాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడంతో బీజేపీ లో చేరినట్లు హైఫీ తెలిపారు. హైఫీ అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికయ్యారు. -
‘థర్టీన్’ చౌహాన్..యూత్ మహాన్..
పదమూడేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు చౌహాన్ పలు యత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.09%. అంటే సగానికి పైగా ఓటర్లు యువతే. అందుకే వారి వ్యతిరేకత బీజేపీని భయపెడుతోంది. అసంతృప్తితతో ఉన్న యూత్‌ను ఆకర్షించడానికి చౌహాన్ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. రెండునెలల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుందనగా మెగా ఎంప్లాయిమెంట్ డ్రైవ్స్, స్టార్టప్ ఫెయిర్స్ నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే మేధావి విద్యార్థి యోజన పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేశారు. మొదటి సారి కాలేజీలో అడుగు పెడుతున్న 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, మరో 22 వేల మందికి ల్యాప్‌ట్యాప్‌ల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎందుకీ అసంతృప్తి ? రెండేళ్లుగా మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యువత నైపుణ్యం పెంచుతూ వారిని పారిశ్రామిక రంగం వైపు మళ్లేలా చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగంపై గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో నిరుద్యోగులు 46శాతం, గ్రామాల్లో44 శాతం ఉన్నారు. నికరంగా నిరుద్యోగం 43 శాతంగా ఉంది. 13 ఏళ్ల పాలనలో చౌహాన్ సర్కార్ ఏడాదికి సగటున 17,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. యువతలో నిరుద్యోగిత, అల్పుఉద్యోగిత(చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం) కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62కి పెంచడం కూడా నిరుద్యోగాన్ని పెంచిందనే విమర్శలూ ఉన్నాయి. యువ నేతలకు ప్రోత్సాహం సామాజికంగా యువతను ఆకట్టుకునే పథకాలతో పాటు రాజకీయంగా యువనేతలను ప్రోత్సహించేందుకు బీజేపీ నడుం బిగించింది. మధ్యప్రదేశ్‌లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యువ నేతల్ని ప్రోత్సహిస్తోంది. అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ప్రచార బాధ్యతల్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌ని తీసుకువస్తూ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. గ్వాలియర్‌లో మారథన్ రన్లు, బుందేల్ ఖండ్‌లో జానపద నృత్యాల ఫెస్టివల్, భోపాల్‌లో కవి సమ్మేళనాలు, కుస్తీ పోటీలు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. - మేధావి విద్యార్థి యోజన: అఖిలభారత ఎంట్రన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఫీజు మినహాయింపు. - యువ కాంట్రాక్టర్ ఇంజనీర్ యోజన: మౌలిక సదుపాయాల రంగంలో యువ ఇంజనీర్లకు ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కాంట్రాక్ట్ లైసెన్స్ ఇస్తారు. - ప్రతిభ కిరణ్ యోజన: సాధికారత కోసం మహిళలకు ఉన్నతవిద్యలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. - గావోంకీ బేటీ యోజన: పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు పైచదువుల కోసం ఆర్థిక సాయం. - లాడ్లీ లక్ష్మి యోజన: అమ్మాయిలు విద్యార్థి దశలో ఉన్నప్పట్నుంచి బాండ్ల రూపంలో ఆర్థిక సాయం. - కన్యావివాహ్ యోజన: సామూహిక వివాహాలు జరిపించి పెళ్లీడు ఆడపిల్లల పెళ్లికి 15 వేల ఆర్థిక సాయం - యువ స్వరోజ్‌గార్ యోజన: చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా యువతకు రుణాల్లో సబ్సిడీ, బ్యాంకు గ్యారంటీ. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 5.39కోట్లు తొలిసారి ఓటు వేస్తున్నవారు 15 లక్షలకు పైగా 18 –29 ఏళ్ల ఓటర్లు 1.53 కోట్లు 30–39 ఏళ్ల ఓటర్లు 1.28 కోట్లు కాంగ్రెస్‌లో కిరార్ కిరికిరి! మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు గులాబ్ సింగ్ కిరార్ని కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పార్టీలోకి ఆహ్వనించారు. అయితే వ్యాపం స్కాంతో కిరార్‌కు సంబంధం ఉన్నదంటూ గతంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగిన విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. నాటి విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. మొదట కిరార్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వనిస్తూ అధికారిక వెబ్సైట్ లో చేసిన ట్వీట్‌ని తొలగించడమే కాకుండా.. గులాబ్ సింగ్ కిరార్ తమ పార్టీలో చేరారన్న వాదనను కాంగ్రెస్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ గందరగోళంలోనే కిరార్ కాంగ్రెస్‌లో చేరినట్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది. అయితే తనగురించి కాంగ్రెస్ ఎలా అనుకున్నా, నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తాననీ, ఎందుకంటే తాను కాంగ్రెస్ సభ్యుడిననీ గులాబ్ సింగ్ చెప్పుకుంటున్నాడు. కిరార్ వ్యవహారంతో కాంగ్రెస్ బుద్ధి బట్టబయలైందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. కిరార్ కిరికిరి కాంగ్రెస్ నైజాన్ని బహిర్గతం చేసిందన్న ఆనందంలో బీజేపీ ఉంది. కిరార్ మధ్యప్రదేశ్ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్ మాజీ సభ్యుడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2011 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష సందర్భంగా జరిగిన అవకతవకల్లో కిరార్కీ, అతని కుమారుడికీ సంబం«ధం ఉందని సీబీఐ ఆరోపించింది. వ్యాపం స్కాంతో ఆయనకు సంబంధమున్నట్లు బయటపడడంతో మూడేళ్ల క్రితమే బీజేపీ అతన్ని పార్టీనుంచి తొలగించింది. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహిళలకే మీ ఓటు! మిజోరంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువఉన్నప్పటికీ.. శాసనసభలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ఈ రాష్ట్రంలోని ఏకైక మహిళా సంస్థ ’మిజో మీచే ఇన్సుయిఖ్వామ్ పాల్’ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉధృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని.. అన్ని పార్టీల్లోని మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది. మహిళలు తమ శక్తిని చాటేందుకు ఇంతకన్నా మంచి సమయం రాదంటోంది ఈ సంస్థ. ’మాకు పార్టీ ముఖ్యం కాదు. మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడమే ముఖ్యం’ అని ఈ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 1978 నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలు మాత్రమే మిజో శాసనసభకు ఎన్నికయ్యారు. గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి పట్టు మధ్యప్రదేశ్‌లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజవర్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు ఎన్నికలుగా బీజేపీ పట్టు సాధిస్తోంది. గిరిజనులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు మాత్రం కమలంపైనే విశ్వాసం ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో పరిస్థితిని ఓసారి గమనిస్తే.. ఇటలీ, స్వీడన్.. ఇవన్నీ ఓటర్ల పేర్లే మేఘాలయలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇటలీ, అర్జెంటైనా, స్వీడన్, ఇండోనేసియాలు దిగ్విజయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దేశాలేంటి, మేఘాలయ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడమేంటి అనుకుంటున్నారా.. అవి దేశాల పేర్లు కాదండీ బాబూ.. అవి మేఘాలయకు చెందిన ఉమ్ని– మర్ఎలాకా గ్రామ ప్రజల పేర్లు. అవేం పేర్లు అని ఆశ్చర్యపోకండి, ఆ ఊర్లో అందరి పేర్లూ విచిత్రంగానే ఉంటాయి. ఈ ఊళ్లో జనాలకు ఇంగ్లీష్ రైమ్స్పై ఆసక్తి కాస్త ఎక్కువంట. కానీ వాటి అర్ధాలు మాత్రం తెలియవట. అందుకే శబ్దం బాగుంటే పేరుగా పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పదాలు బాగున్నాయనే ఏకైక కారణంతో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని అక్కడి సర్పంచ్ ప్రీమియర్ సింగ్ చెప్పారు. టేబుల్, గ్లోబ్, పేపర్, శాటరన్, అరేబియన్ సీ, రిక్వెస్ట్, లవ్లీనెస్, హ్యాపీనెస్, గుడ్నెస్, యూనిటీ, స్వీటర్, గోవా, త్రిపుర.. లాంటి పలు నామధేయులు ఆ ఊర్లో మీకు ఎదురవుతారు. అన్నింటికనా విచిత్రంగా ఆ ఊర్లో ఒకామె పేరు ‘‘ఐ హావ్ బీన్ డెలివర్డ్’’. ఇవన్నీ చదువుతుంటే మనకు సరదాగా ఉంది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అధికారులు మాత్రం ఈ పేర్లతో గజిబిజి పడుతున్నామని వాపోతుంటారు. -
మహిళా ఓటర్లు ఎక్కువ అయినా..
అక్కడ మహిళల సంఖ్య ఎక్కువే. వారికి ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. స్కూటర్ల మీద రయ్ రయ్‌మని వెళ్లిపోతుంటారు. చదువుల్లో మగవారినే మించిపోయారు. పారిశ్రామిక రంగంలో పురుషులతో పోటీ పడుతున్నారు. కానీ.. రాజకీయాలకు వచ్చేసరికి వారికి చోటే లేదు. అదేమంటే రాజకీయం అన్నది మగాళ్లు చేసే పని. ఆడవాళ్లకు చేతకాదు అన్న బూజుపట్టిన అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి. అదే మిజోరం.. మిజోరంలో వాస్తవానికి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. వారిలో చైతన్యం ఎక్కువే. ఎన్నికలొస్తే గంటల తరబడి పోలింగ్ బూతుల దగ్గర బారులతీరు నిల్చొని మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ అసెంబ్లీకి పోటీ అంటే అందని ద్రాక్షే. ఇప్పటి వరకు కేవలం నలుగురంటే నలుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారీ మొండి చెయ్యే ! ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళలకు సీటు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. 2003లో చివరి సారిగా మిజో నేషనల్ ఫ్రంట్ మహిళకి టిక్కెట్ ఇస్తే, కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం ఒక్క మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జోర్‌మాతాంగా మహిళలకు టిక్కెట్లు ఇవ్వకపోవడాన్ని అడ్డంగా సమర్థించుకుంటున్నారు. మహిళలకు గెలిచే సత్తా ఉంటే తప్పకుండా ఇస్తాం. కానీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చే మహిళామణులెవరూ కనిపించడం లేదు అని అంటున్నారు. గత ఏడాదే ఏర్పాటైన మరో రాజకీయ పార్టీ జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జడ్పీఎం) ఇద్దరు మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం పార్టీలే కాదు అక్కడ సమాజంలో కూడా ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని కొత్తగానే చూస్తున్నారు. 2003లో అయిదుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.. 2008 నాటికి వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కానీ అందరూ స్వతంత్ర అభ్యర్థులగానే బరిలోకి దిగారు. ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఉండడం సామాజిక పురోగతిని సూచిస్తుంది. కానీ రాజకీయాలు వచ్చేసరికి అదే సంకుచిత ధోరణే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్షాల నుంచి మరో వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధాన్ని ఎత్తివేయడంతో ఎందరో మగవాళ్లు చీప్ లిక్కర్ తాగి చనిపోతున్నారని, అందుకే మహిళల సంఖ్య పెరిగిపోతోందని దానివల్ల ఓటింగ్‌లో వారు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారన్న విచిత్ర వాదన ఒకటి తెరపైకి తెచ్చారు. ఇటీవల కాలంలో నమోదైన మరణాల సంఖ్యలో 80–85 శాతం మంది మగవారేనంటూ ఎంఎన్ఎఫ్ నేత జోర్‌మాతాంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మరోవైపు మిజోరంలో యువతులు తమకి రాజకీయాలపై ఆసక్తి లేదని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో విద్యార్థినుల్ని ప్రశ్నిస్తే కెరీర్వైపే తమ దృష్టి ఉందని అంటున్నారు. ‘‘మిజోరం మహిళలు విద్యావంతులు. మగవారిలో కంటే చిత్తశుద్ధి ఎక్కువే. కానీ ఎందుకో తెలీదు వారికి రాజకీయాలంటే ఆసక్తి లేదు‘అని క్రిస్టీ అనే విద్యార్థిని వెల్లడించారు. కొంతమందిలో ఆసక్తి లేకపోతే లేకపోవచ్చు కానీ కొందరు మహిళల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం ఉంది. మరి అలాంటి ఉత్సాహవంతులనైనా పార్టీలు ప్రోత్సహిస్తాయా ? వేచి చూడాల్సిందే. ఆ నలుగురు.. 1. థాన్మావి. 1978లో తొలిసారిగా అసెంబ్లీకి. 2. కె. థాన్సియామి. అయిజ్వాల్ (పశ్చిమ) నుంచి 1984లో ఎన్నిక 3. లాల్హింపూయి హమర్, 1987లో ఎమ్ఎన్ఎఫ్ తరపున ఎన్నిక. 4. 20 ఏళ్ల తర్వాత 2014 ఉప ఎన్నికల్లో వన్లలంపూయీ చ్వాంగ్తూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు.