సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిసారి మిజోరమ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)’ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 1998–2003 ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీయే విజయం సాధించింది. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా వైఎంఏ మద్దతుతో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 28వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వాన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ కూడా రంగప్రవేశం చేయడంతో వైఎంఏ ఈసారి ఎవరికి మద్దతు ఇస్తున్నది ఆసక్తిగా మారింది.
యంగ్ మిజో అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీతోని అనుబంధం లేకుండా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా 4,27,323 మంది సభ్యులు ఉన్నారు. సామాన్యంగా వీరంత నాయకత్వం మాటకు కట్టుబడి ఓటేస్తారు. మొత్తం రాష్ట్ర జనాభాలో వైఎంఏ సభ్యుల సంఖ్య దాదాపు 40 శాతం ఉండడంతో వారు ఎవరికి ఓటేస్తే ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. అందుకని ఎన్నికల బరిలో దిగే ప్రతిపార్టీ వైఎంఏ మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ సంఘంలోని వివిధ విభాగాలు, వివిధ కమిటీలు రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి ఎవరికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది? ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యకమాలు కొనసాగుతాయి? అన్న అంశాలతోపాటు గత ప్రభుత్వం పాలనాతీరును కూడా క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి.
91 శాతం అక్షరాస్యత కలిగిన మిజోరంలో ఈ సంఘం సభ్యులు చాలా చైతన్యవంతులు. వారికి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సభ్యులంతా చురుగ్గా పాల్గొంటారు. అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడరు. మురికి వాడలను శుద్ధిచేయడంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సంఘం తరఫున రోడ్లు వేస్తారు. మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటారు. ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా సంఘం సభ్యులు వెళ్లి దగ్గరుండి దహన సంస్కారాల వరకు అన్ని చూసుకుంటారు. శ్మశానంలో సమాధి కోసం గోతులు కూడా స్వయంగా తవ్వుతారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబం వెంట సంఘం సభ్యులు కనీసం మూడు రోజులు ఉంటారు. ఆ సందర్భంగా వారికి అన్ని విధాల అండగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు కూడా సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
804 బ్రాంచీలు, 17 కమిటీలు
వైఎంఏకు రాష్ట్రవ్యాప్తంగా 47 గ్రూపు యూనిట్లు, 804 బ్రాంచీలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే కమిటీతోపాటు సంగీతం, సాహిత్యం, క్రీడలకు కలుపుకొని మొత్తం 17 కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఆరుగురు కార్యవర్గ సభ్యులతో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మాత్రం ఆవిర్భావం నుంచి ఇంతవరకు ఒక మహిళ కూడా ఎన్నిక కాలేదు. గత మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు పోటీ చేయగా, ఈసారి ఎన్నికల్లో 15 మంది మహిళలు పోటీ చేస్తున్నారు.
యువతే ఉండాల్సిన అవసరం లేదు
యంగ్ మిజో అసోసియేషన్ అనగానే ఇందులో యువతీ యువకులే ఉంటారని ఎవరైనా అనుకోవచ్చు. 14 ఏళ్ల దాటిన మిజోలందరూ ఐదు రూపాయల రుసుము చెల్లించి ఈ సంఘంలో చేరవచ్చు. సభ్యత్వం పునరుద్ధరణకు వారు ప్రతి ఏటా ఐదు రూపాయలు చెల్లిస్తూ పోవాలి. అలా జీవితాంతం సంఘంలో సభ్యులుగా కొనసాగవచ్చు. సభ్యత్వం వద్దనుకుంటే ఏ వయస్సులోనైనా వదులుకోవచ్చు. ఈ సంఘాన్ని 1935లో ఓ క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం నుంచి ఏ క్రైస్తవ మిషనరీతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సంస్థగానే ఇది పనిచేస్తూ వస్తోంది. ఇందులో మెజారిటీ సభ్యులు క్రైస్తవులే అయినప్పటికీ ఏ మతస్థులైనా చేరవచ్చు. మిజోరం మొత్తం జనాభాలో 85 శాతం క్రైస్తవులే అన్న విషయం తెల్సిందే.
సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయం
ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపైన వీరు వివిధ స్థాయిల్లో, వివిధ గ్రూపులతో సంప్రతింపులు, చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని అధికారికంగా బయటకు వెళ్లడించరు. లోపాయికారిగానే సందేశం వెళుతుంది. ఆ సందేశానికి దాదాపు 90 శాతం మంది సభ్యులు కట్టుబడి ఓటేస్తారు. ఈ సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భయపడిందంటే సంఘానికున్న శక్తిని అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా ఆందోళన
నవంబర్ ఆరవ తేదీన సంఘం సభ్యులు దాదాపు 50 వేల మంది తరలివచ్చి ఎన్నికల సంఘం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఎన్నికల సంఘం ఓ ఉద్యోగిని బదిలీ చేసింది. త్రిపుర శిబిరంలో తలదాచుకుంటున్న 32 వేల మంది శరణార్థి బ్రూలు ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినందునే వారు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో మైనారిటీలైన బ్రూలన్నా, చక్మాలన్నా ఈ సంఘం సభ్యులకు పడదు. అందులో అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండడం కారణమని మైనారిటీలు ఆరోపిస్తున్నారు. వీరంతా అక్రమంగా తమ రాష్ట్రానికి వలస వచ్చిన వారన్నది వైఎంఏ నమ్మకం. అందుకనే ప్రతి ఎన్నికల సందర్భంగా మైనారిటీల నుంచి ఎవరికి టిక్కెట్లు ఇవ్వరాదని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ సంఘం విజ్ఞప్తి చేయడం పరిపాటిగా మారింది. కొన్ని సార్లు వీరి మాటను రాజకీయ పార్టీలు విన్నాయి. కొన్ని సార్లు సున్నితంగా తిరస్కరించాయి. ఏదిఏమైనా సంఘం మద్దతే పార్టీకి విజయం. సంప్రతింపుల్లో సంఘం సభ్యులు ఈసారి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెల్సింది.
Comments
Please login to add a commentAdd a comment