‘తాగుడు, మాదక ద్రవ్యాల వ్యవసాలున్న వారిని మా పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టం. ఎలాటి చెడు అలవాట్లు లేని వారికే టికెట్లిస్తాం’ మిజోరం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల నిఘా వేదికకు సమర్పించాల్సిన అవగాహన పత్రమిది.
‘ఎన్నికల్లో తాగుబోతులు, మాదక ద్రవ్యాలు తీసుకునే వారికి ఓటు వేయకండి. ఈ అలవాట్లున్న వారిని దూరం పెట్టండి’ ఎన్నికలప్పుడు క్రైస్తవ మత పెద్దలు ప్రజలకిచ్చే సందేశమిది.
ఈ రెండు ప్రకటనలు చాలు మిజోరంలో మద్యం, డ్రగ్స్ పోషిస్తున్న కీలకపాత్రను అర్థం చేసుకునేందుకు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ రెండు అంశాలు పార్టీల తలరాతలను నిర్ణయించనున్నాయి.
ఇక్కడి నుంచే దేశంలోకి!
రాష్ట్ర జనాభాలో 87% వరకు క్రైస్తవులే. అక్కడ చర్చి పెద్దల మాటే శాసనం. అయితే.. మద్యం, మాదక ద్రవ్యాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుండటంతో ప్రతి ఎన్నికల్లో ఈ రెండు అంశాలు కీలకంగా మారతాయి. ప్రతి పార్టీ ప్రతి ఎన్నికల్లో ఈ రెండింటినీ తరిమేస్తామని వాగ్దానం చేస్తుంది. ఏ పార్టీ ఈ వాగ్దానాలను అమలుచేయగలదని అనుకుంటారో.. ఆ పార్టీనే ఓటర్లు గెలిపిస్తూ వస్తున్నారు. ప్రజలను ఈ చెడు అలవాట్లనుంచి దూరం చేయడానికి ప్రిస్బిటేరియన్ సినోడ్ (చర్చిలతో కూడిన అతిపెద్ద సంస్థ) ప్రయత్నిస్తోంది. ప్రతి ఎన్నికల్లో తాగుబోతులకు ఓటెయ్యవద్దంటూ ప్రజలకు పిలుపునిస్తుంది. అలాగే, చర్చి మద్దతు ఉన్న మిజోరం పీపుల్స్ ఫోరం (ఎన్నికల నిఘా వేదిక) కూడా రాజకీయ పార్టీల నుంచి హామీ పత్రం తీసుకుంటుంది.
మరోవైపు యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)కు చెందిన సప్లయ్ రిడక్షన్ స్క్వాడ్ (ఎస్సారెస్) రాష్ట్రంనుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడానికి పోరాటం చేస్తోంది. డ్రగ్స్ వాడే వారు రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ పడిపోతుంటారు. ఈ ఏడాది ఇంత వరకు 36 మంది డ్రగ్స్ కారణంగా చనిపోయారని, వారిలో 15 చావులకు హెరాయినే కారణమని ఎస్సారెస్ బాధ్యుడు చవాంగ్ తెలిపారు. 2004లో 142 మంది డ్రగ్స్‌కు బలయ్యారని ఆయన అన్నారు. ఉత్తరాన కాచర్ పర్వతాలు, తూర్పున మయన్మార్, దక్షిణాన ఉన్న బంగ్లాదేశ్ నుంచి మిజోరంకు భారీగా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయి. అఫ్గానిస్తాన్ తర్వాత ప్రపచంలో అత్యధికంగా హెరాయిన్‌ను సరఫరా చేసేది మయన్మారే. మిజోరం నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
అన్ని పార్టీల దృష్టి వీటిపైనే
ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీలు మేనిఫెస్టోల్లో పేర్కొనకపోయినా మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రణ గురించి ప్రచారాల్లో మాత్రం తప్పక ప్రస్తావిస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే డ్రగ్స్ బాధితుల కోసం మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పార్టీలంటున్నాయి. రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి మద్యనిషేధం అమల్లో ఉంది. అయితే 2015లో కాంగ్రెస్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. మద్యనిషేధం కారణంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే బీజేపీ మాత్రం స్థానిక బ్రాండ్లనే ప్రోత్సహిస్తామని ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment