ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 40 అసెంబ్లీ సీట్లతో పరిమాణంలో చిన్నగానే కనబడుతున్నా.. ఇది కీలకమైన రాష్ట్రమే. బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఇది అత్యంత కీలకం. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈశాన్యంలో ఒక్కోరాష్ట్రంలో పట్టుకోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు.. ఈ ప్రాంతంలో మిగిలిన చిట్టచివరి రాష్ట్రం మిజోరం. అందుకే ఎలాగైనా ఇక్కడ పట్టునిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అటు బీజేపీ కూడా మిజోరంను తమ ఖాతాలో వేసుకుంటే.. కాంగ్రెస్ ముక్త్ ఈశాన్య నినాదాన్ని సంపూర్ణం చేసినట్లు ఉంటుందని భావిస్తోంది. అయితే ఇంతవరకు మిజోల గడ్డపై ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా.. క్రైస్తవుల కోటలో పాగా వేయాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బుధవారం ఎన్నికలు జరగనున్న మిజోరంలో ప్రతిపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్మెన్‌ఎఫ్) ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఏదేమైనా మిజోరంలో గెలవడం కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య.
బీజేపీతో సమస్యలు: కాంగ్రెస్ విమర్శ
అధికార కాంగ్రెస్, విపక్ష ఎమ్మెన్‌ఎఫ్ పార్టీలకు బీజేపీ తమ శత్రువు అని చెప్పుకోవడమే ప్రధాన ప్రచారాంశంగా మారింది. మిజోరం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనుకుంటున్న బీజేపీ.. నేరుగా కాంగ్రెస్‌తో తలపడటం వీలుకాకపోవడంతో ఎమ్మెన్‌ఎఫ్ సాయంతో పోటీ చేస్తోందంటూ సీఎం లాల్ థన్‌వాలా విమర్శిస్తున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ, ఎమ్మెన్‌ఎఫ్ కలిసిపోతాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటుగా.. క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని క్రిస్టియన్ల అస్తిత్వానికి సమస్యలు ఎదురవుతాయని కూడా కాంగ్రెస్‌ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలు గెలుచుకుంటామని థన్‌వాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆరు సార్లు సీఎంగా పని చేసిన థన్‌వాలా.. 2014లో బీజేపీ హవా నడిచిన సమయంలో కూడా మిజోరంలో తన పట్టు నిలుపుకోగలిగారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీజేపీని హిందూత్వ పార్టీగానే గుర్తిస్తున్నారని, ఆపార్టీకి అధికారం అప్పగించరని ఆయన అన్నారు.
ధీమాగా ఎమ్మెన్‌ఎఫ్
విపక్షమైన ఎమ్మెన్‌ఎఫ్ కూడా విజయంపై ధీమాగానే ఉంది. బీజేపీతో తమకెలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సీఎం అభ్యర్థి, మాజీ సీఎం జొరాంతంగ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి ఒక్క సీటు దక్కితే గొప్పేనంటున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో ఇటీవలే ఏర్పాటైన జేడ్‌పీఎం కూటమి కూడా గణనీయమైన ప్రభావం చూపించగలదని పరిశీలకులు అంటున్నారు. ఈ కూటమి పోటీ చేస్తున్న 35 స్థానాల్లో ప్రధాన పార్టీల ఓట్లు చీల్చుతుందని వారంటున్నారు. కాంగ్రెస్ 40 సీట్లలో, బీజేపీ 39 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. ఎమ్మెన్‌ఎఫ్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం) 35 సీట్లలో బరిలో ఉంది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఎ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు కూడా కొన్ని చోట్ల అభ్యర్ధులను పోటీలో దించాయి.
కమలానికి ఓట్లు తక్కువే!
గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 0.37% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా ఈ సారి బీజేపీ 39 స్థానాల్లో పోటీ పడుతోంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తనకు మేలు చేస్తాయని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఇటీవల పార్టీకి రాజీనామా చేయడాన్ని తమకనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది.
సీఎం సహా 9మందిపై క్రిమినల్ కేసులు
ముఖ్యమంత్రి థన్‌వాలా, ప్రతిపక్ష నేత జొరాంతంగ సహా 9 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని మిజోరం ఎలక్షన్ వాచ్ తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 200 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 116 మంది కోటీశ్వరులు. వీరిలో 35 మంది ఎమ్మెన్‌ఎఫ్, 33 మంది కాంగ్రెస్ వాళ్లున్నారు.
ఆయన ఆస్తి 55 కోట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులందరిలో కోటీశ్వరుడు ఎమ్మెన్‌ఎఫ్ నాయకుడు రాబర్ట్ రోమావియా రోవ్టే. ఈయన ఆస్తి 55 కోట్లు. రాబర్ట్ (51)కు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక ఫుట్‌బాల్ క్లబ్ ఉంది. ఐజ్వాల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాబర్ట్ ఇన్ని కోట్లున్నా ప్రచారం మాత్రం కాలినడకనే. ఇంటింటికీ తిరిగి ఆయన ప్రచారం చేస్తున్నారు. బ్యానర్లు, కటౌట్ జోలికి పోకుండా విజిటింగ్ కార్డు సైజున్న కార్డులపై పేరు, నియోజకవర్గం ముద్రించి పంచిపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం రాబర్ట్‌కు ఇదే మొదటి సారి. ప్రచారంలో ప్రత్యర్థులెవరినీ వ్యక్తిగతంగా దూషించని రాబర్ట్ తన అనుచరులకు కూడా అదే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి లాల్‌సవ్టాపై ఆయన పోటీ చేస్తున్నారు.
ప్రముఖనాయకులు:
లాల్ థన్‌వాలా (కాంగ్రెస్), జొరామ్‌తంగ (ఎమ్మెన్‌ఎఫ్), జేవీ హ్లునా (బీజేపీ),
ఎన్నికల్లో కీలకాంశాలు:
మద్యనిషేధం, అక్రమ వలసదారులు, మౌలిక వసతుల లేమి, నిరుద్యోగం, బ్రూ శరణార్థులు, ప్రభుత్వ వ్యతిరేకత, రెబెల్ అభ్యర్ధులు.
మేనిఫెస్టోల్లో ప్రధానాంశాలు
బీజేపీ: రూ.1కే కిలో బియ్యం, అందరికీ ఇళ్లు
కాంగ్రెస్: విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, కొత్త భూ–వినిమయ చట్టం తీసుకురావడం.
ఎమ్మెన్‌ఎఫ్: సామాజిక రాజకీయ అభివృద్ది, గ్రామస్థాయిలో పౌరుల నమోదు.
Comments
Please login to add a commentAdd a comment