సందీప్ శుక్లా
భోపాల్ : అంతా అనుకున్నట్లు జరిగితే మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో మరో కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. ప్రజల తీర్పు అనుకూలంగా ఉంటే దేశంలోనే తొలిసారి ఓ మూగ-చెవిటి వ్యక్తి చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. అవును సుదీప్ శుక్లా అనే మూగ, చెవిటి వ్యక్తి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. నెలకు లక్ష రూపాయలు వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకోని మరి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఇప్పటి వరకు పనిచేసిన సుదీప్ శుక్లా.. దివ్యాంగులపై జరుగుతున్న అఘాయిత్యాలు.. ముఖ్యంగా మూగ, చెవిటి వారి పట్ల జరిగిన దురాగతాలతో కలత చెందారు. దీంతో ఉద్యోగం మానేసి ఆయా వర్గాల ప్రజల తరుపున పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో విభిన్న వర్గాలకు అవకాశం కల్పించిన మధ్యప్రదేశ్.. తనకు కూడా మంచి అవకాశం కల్పిస్తోందని సుదీప్ శుక్లా భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ఓ హిజ్రా తొలిసారి ఎమ్మెల్యేగా గెలువగా.. ఓ అంధుడు మొదటిసారి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. శాబ్నమ్ మౌసీ అనే హిజ్రా 1998 అసెంబ్లీ ఎన్నికల్లో సోహగపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా గెలిచి తొలి హిజ్రా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించాడు. యమునా ప్రసాద్ శాస్త్రి అనే అంధనేత (1977, 1989) రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు ఎమ్మెస్సీ (ఐటీ) పట్టభద్రుడైన సుదీప్ శుక్లా తొలి మూగ చెవిటి ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. సుదీప్‌కు దివ్యాంగుల కోసం ఎన్జీవోను నడుపుతున్న గ్యానేంద్ర పురోహిత్ మద్దతిస్తున్నారు. అతని ప్రచారం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూగ-చెవిటి ప్రజాప్రతినిధులు వస్తారని గ్యానేంద్ర తెలిపారు. తొలి ఆసియా చెవిటి ఎంపీ అయిన నెపాల్ దేశస్థుడు రాఘవ్ బిర్ జోషి, ప్రపంచ తొలి మూగ, చెవిటి ఎంపీ ఎన్దీజ్ అలెక్స్(ఉగాండ), న్యూజిలాండ్ తొలి మూగ, చెవిటి ఎంపీ మోజో సెలెస్ట్ మాథర్స్‌లు సుదీప్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారన్నారు. మరో వెయ్యిమంది దివ్యాంగ కార్యకర్తలు సుదీప్ గెలుపు కోసం కృషి చేయనున్నారని పేర్కొన్నారు.
పనిచేసే ప్రదేశాల్లో మూగ, చెవిటి వ్యక్తులు లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారని, అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వీటిని చూడలేక సుదీప్ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. చట్టసభల్లో పాత్రినిథ్యం వహించేలా దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, లేకపోతే నామినేషన్ పద్దతిలోనైనా అవకాశం కల్పించాలని సుదీప్ శుక్లా డిమాండ్ చేస్తున్నారు. తేనటీగలు పూల మకరంధాన్ని పీల్చుకున్నట్లు రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచేస్తూ సమాజాన్ని కలుషితం చేశారని ఆరోపించారు. తనకు అవకాశం కల్పిస్తే నీటి శుద్ది చేసే యంత్రంలా.. సామజాన్ని శుద్ది చేస్తానని తెలిపారు. సుదీప్ భార్య కూడా మూగ, చెవిటియే. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వస్తుండా ఆమె మాత్రం ఉద్యోగం చేస్తూ సుదీప్‌కు కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఈ దివ్యాంగుడి కల నెరవేరాలని అందరు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment