మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బాబాల హడావుడి జోరందుకుంది. కొందరేమో టికెట్లు ఆశించి పార్టీల చుట్టూ తిరుగుతుండా, మరికొందరు కొన్ని పార్టీలకు అనుకూల, వ్యతిరేక ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. స్వామీజీల్లో కొందరు చౌహాన్‌పై అసహనంగా ఉన్నారు. మరికొందరేమో చౌహాన్‌కు జై అంటూ టిక్కెట్ల కోసం యత్నిస్తున్నారు. పార్టీల చుట్టూ బాబాల సందడి పెరగడంతో ఆయా పార్టీల కార్యాలయాల వద్ద మరిన్ని బలగాలు నియమించాల్సి వస్తోంది.
ప్రభావం ఎంత ?
మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపుగా 90శాతం హిందువులే కావడంతో అక్కడ బాబాలకు ఆదరణ ఎక్కువే. అందుకే బాబాల మద్దతు కోసం రాజకీయ నాయకులు వారి ఆశ్రమాల వద్ద క్యూ కడతారు. ఉజ్జయిని, జబల్‌పూర్, భోపాల్ వంటి పట్టణాల్లో అడుగడుగునా ఆశ్రమాలు కనిపిస్తాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పదేళ్లలో ప్రభుత్వ పాలనపై బాబాల ప్రభావం ఎక్కువైందన్న విమర్శలూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. బాబాల సంఖ్య పెరిగిపోవడంతో వారి ప్రభావమూ తగ్గుతూ వస్తోంది.
బై బీజేపీ.. బైబై బీజేపీ..
మతగురువులను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. గత ఏప్రిల్‌లో ఒకేసారి ఏకంగా అయిదుగురు బాబాలకు కేబినెట్ హోదా కల్పించింది. కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహంత్, నర్మదానంద, హరిహరానంద, భయ్యా మహరాజ్‌కు కేబినెట్ హోదాలు కట్టబెట్టింది. వీరిలో గురువు భయ్యా మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. కంప్యూటర్ బాబా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నర్మదా నదీ తీర ప్రాంతంలో అక్రమ తవ్వకాలను సీఎం ప్రోత్సహిసున్నారని, గోవులకు రక్షణ లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.
బరిలోకి దిగుతాం..
దాతియా జిల్లాకు చెందిన పంధోకర్ సర్కార్ ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దూకారు. సాంజీ విరాసత్ పార్టీ పేరుతో 50 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. సంత్ సమాజాన్ని సీఎం తీవ్రంగా అవమానించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరొక గురువు దేవకినందన్ ఠాకూర్ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి, రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. చౌహాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
కొందరు స్వాములేమో బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. బాబా బిపిన్ బిహారి సాగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలతో టిక్కెట్ కోసం పైరవీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో నేతలు బాబాల కాళ్లు పట్టుకునే దృశ్యాలే కనిపించేవి. ప్రభుత్వమే శంకరాచార్య యాత్ర లాంటివి స్వయంగా జరిపించింది. అలాంటిది ఇప్పుడు బాబాలు టిక్కెట్ల కోసం నేతలతో పైరవీలు చేయించుకోవడం కనిపిస్తోంది. ఇలాంటి దృశ్యం మధ్యప్రదేశ్ రాజకీయల్లో ఇదే మొదటిసారంటూ రాజకీయ పరిశీలకులు అవాక్కవుతున్నారు.
కీలక బాబాలు
ఆధ్యాత్మిక గురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతికి మహాకోసల ప్రాంతంలో బాగా పట్టు ఉంది. స్వరూపానంద కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రావత్‌పుర సర్కార్, ఆచార్యదేవ్ ప్రభాకర్ శాస్త్రి దాదాజీ, జాబూ ప్రాంతంలో ఎక్కువ మంది అనుచరగణం ఉన్న స్వామి ఉత్తమ్, రాష్ట్రవ్యాప్తంగా శిష్యులున్న భయ్యాజీ సర్కార్‌లు ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ బాబాకు కౌంటర్‌గా స్వామి అఖిలేశ్వరానంద రంగంలోకి దిగారు. గోసంరక్షణ బోర్డు చైర్మనైన ఈ స్వామీజీ ఇటీవల సంత్ సమాగమం పేరుతో సదస్సును ఏర్పాటు చేసి సీఎం చౌహాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment