
సాక్షి, భోపాల్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. రైతులతో సమావేశమయ్యేందుకు ఇటీవల ఆయన చేపట్టిన మందసోర్ పర్యటనను ప్రస్తావిస్తూ రాహుల్‌కు కనీసం ఉల్లి ఎలా పెరుగుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమని ఆయన చెబుతున్నా తనను ప్రధానిగా చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
ఇక మధ్యప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనాశీర్వాద్ యాత్రతో ఉజ్జయిని నుంచి ప్రచార పర్వానికి సీఎం శ్రీకారం చుట్టారు. శనివారం నాడు ప్రారంభమైన ఈ యాత్రను బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రారంభించారు.
యాత్రను ప్రారంభించే ముందు ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర దేవాలయంలో చౌహాన్ పూజలు చేశారు. సెప్టెంబర్ 25న ముగిసే ఈ యాత్రలో సీఎం రాష్ట్రంలో 230 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా ర్యాలీలలు, బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.