శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్/దతియా: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీలు గెలుచుకునే సీట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతుండటం తెలిసిందే. అదే జరిగితే, ఈ రెండు పార్టీల్లో ఏ దానికీ, స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఆ రాష్ట్రంలో బీఎస్పీతోపాటు పలు చిన్న పార్టీలు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పనీ, తమ పార్టీ 12 వరకు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని ఇప్పటికే బీఎస్పీ నాయకులు అంటున్నారు.
ఒక్క టైమ్స్ నౌ–సీఎన్‌ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, సీఎస్‌డీఎస్ సర్వే ఒక్కటే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. మిగిలిన అన్ని సర్వేల్లోనూ ఈ రెండు పార్టీలు సాధించే సీట్ల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుందన్నాయి. బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 15 సీట్ల వరకు వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఓ దానికి పూర్తి ఆధిక్యం రాని పక్షంలో ఈ చిన్న పార్టీలే, స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
మళ్లీ మాదే అధికారం: శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలుస్తుందనీ, వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘నేను అతిపెద్ద సర్వేయర్‌ను. రోజు మొత్తం ప్రజల మధ్యే గడుపుతా. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుంది’ అని శివరాజ్ అన్నారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ తమ పక్షానే నిలిచారనీ, తామే గెలవబోతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment