మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో గిరిజనుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. చాలా స్థానాల్లో వీరి పాత్ర కీలకం. రాజస్తాన్‌లోని పలు నియోజకవర్గాల్లోనూ వీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే గిరిజనుల మద్దతుంటే.. గెలుపు మరింత సులువవుతుందని బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఈ వర్గమంతా బీజేపీకే అనుకూలంగా ఉంది. అయితే తమకు ఒనగూరిందేమీ లేదని కమలంపై కస్సుబుస్సవుతున్న ఈ వర్గం.. ఈసారి కాంగ్రెస్‌కు జై కొడుతుందా అనేది ఆసక్తికరం.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ గిరిజనులు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కానీ 2010 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘వనవాసీ కళ్యాణ్ పరిషత్’ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. వీరి విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చడంతోపాటు చైతన్యం తీసుకొచ్చింది. దీని ఫలితంగానే.. 2013 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆదివాసీలు ఏకపక్షంగా బీజేపీకి జైకొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గంపగుత్తగా బీజేపీకి ఓటేశారు. అయితే ఏడాది కాలంగా బీజేపీ పట్ల గిరిజనుల్లో విముఖత వ్యక్తమవుతోందని.. లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడైంది. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి చేసిన సవరణలు, అటవీ హక్కుల చట్టం అమలులో నెలకొన్న నిర్లక్ష్యం, అటవీ ఉత్పత్తులకు తగిన ధర కల్పించడంలో వైఫల్యం, ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన లేకపోవడం తదితర అంశాలతో ఆదీవాసీలు బీజేపీకి దూరమవుతున్నారని ఆ సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహకారంతో జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) నాయకుడు డాక్టర్ హీరాలాల్ తన వర్గాన్ని ఎస్టీ రిజర్వ్‌డ్ ప్రాంతాల్లో రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. హీరారాల్ రంగంలోకి దిగితే బీజేపీకి గట్టిదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో చక్రం తిప్పేదెవరు?
ఛత్తీస్‌గఢ్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే 9% ఎక్కువగా వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే పైచేయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినా.. నక్సల్స్ సమస్య అభివృద్ధికి అడ్డంకిగా మారింది. కొన్ని గ్రామాల్లో ఆదివాసీలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. పదిహేనేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉండి కూడా తమకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అయితే.. ఈసారి గిరిజనులకు పట్టున్న ప్రాంతాల్లో అజిత్ జోగి కీలకం కానున్నారని సర్వేలంటున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పవు. రాజస్తాన్‌లో మాత్రం గత ఎన్నికల్లో ఎస్టీలు బీజేపీకే జై కొట్టారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు
ఆదివాసీల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానంగా పేర్కొంటోంది.
ఒక ఊరు.. నలుగురు ఓటర్లు!
నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పోలింగ్ బూత్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. భరత్‌పూర్ నియోజకవర్గంలోని షెరందంద్ ఊర్లోని ఓ పోలింగ్ బూత్‌లో కేవలం నలుగురంటే నలుగురే ఓటర్లుండటం ఈ ఎట్రాక్షన్‌కు కారణం. ఏ ఒక్క ఓటరూ.. తన హక్కును కోల్పోకూడదని సకల ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఈ నలుగురి కోసం కూడా పోలింగ్ బూత్‌ను సిద్ధం చేయనుంది. అయితే బూత్ కోసం సరైన వసతుల్లేకపోవడంతో ఓ టెంట్ కిందే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరుంటుంది. కానీ ఇక్కడి చేరుకోవడం ఓ సాహసమే. రోడ్డు మార్గం లేదు. కనీసం కాలిబాట కూడా ఉండదు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉండే పెద్ద నదిని దాటి.. ఆ తర్వాత రాళ్లు, రప్పల మధ్య రెండు కొండలు ఎక్కిదిగితే గానీ ఆ ఊరికి చేరుకోలేం.
Comments
Please login to add a commentAdd a comment