న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్‌నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్‌నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్‌కు మధ్యప్రదేశ్‌లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు.
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్‌ను కలవడంపై కమల్‌నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్‌లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్‌తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్‌నాథ్ వెల్లడించారు.
అవి తప్పుడు ఆరోపణలు
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్‌నాథ్‌పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment