ఉల్లి ధరలు ఆకాశాన్నంటినపుడు సామాన్యుడి కడుపు మండి.. ప్రభుత్వాలు కుప్పకూలిన ఘటనలు గుర్తున్నాయ్ కదా.. ఇప్పుడు వెల్లుల్లి ధర తగ్గడం అదే తరహాలో ఘాటెక్కిస్తోంది. వ్యవసాయం, రైతు సమస్యలే ప్రధాన ప్రచారాస్త్రంగా సాగుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ఎన్నికల్లో అధికార పక్షాలను గార్లిక్ గజగజ వణికిస్తోంది.
పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్తాన్ ప్రాంతాల్లో ప్రధాన పంట అయిన వెల్లుల్లి ధర అమాంతంగా కిలో రూపాయి, రెండ్రూపాయలకు పడిపోవడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినప్పటికీ.. రాజస్తాన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
సంతోషం ఆవిరైన వేళ
పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం, తూర్పు రాజస్తాన్‌లోని హదోటీ ప్రాంతాల్లో వెల్లుల్లి ప్రధాన పంట. దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% ఈ ప్రాంతాలనుంచే వస్తుంది. రెండేళ్ల క్రింది వరకు ఈ రైతులు సంతోషంగా ఉండేవారు. పంటకు తగిన గిట్టుబాటు ధరతో సమస్యల్లేకుండా ఉన్నారు. అయితే.. 2017 మార్చి నుంచి ఈ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పంటను తీసుకుని మార్కెట్‌కు తీసుకొచ్చే సరికి రేటు పడిపోయిందనే సమాచారం. సర్లే.. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ.. అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో పెట్టుబడికి రెండు, మూడు రెట్ల నష్టంతోనే వెల్లుల్లిని అమ్ముకోవాల్సి వచ్చింది.
ఏడాదిన్నరయినా పరిస్థితిలో మార్పు రాకపోగా.. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతేడాది వెల్లుల్లి ధరలు తగ్గేంతవరకు దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% వాటా.. ఈ రెండు ప్రాంతాలదే. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అంటే కిలోకు రూ.100 అన్నమాట. సీజన్‌లో అయితే ఈ రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ నాణ్యమైన వెల్లుల్లి సీజన్‌లేని సమయంలోనూ క్వింటాలుకు రూ.13వేలకు మించే పలుకుతుంది. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రూపాయి, రెండ్రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
విపక్షాలకు సువర్ణావకాశంగా..
వెల్లుల్లి ధరలు పడిపోవడమే.. విపక్ష కాంగ్రెస్‌కు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ప్రచారం చేసినా.. రాహుల్ వెల్లుల్లి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు కిలో రూ.130గా ఉన్న వెల్లుల్లి ధర.. ఇప్పుడు రూపాయి, రెండు రూపాయలకు పడిపోయిందంటూ గుర్తుచేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో రైతు ఆందోళనలు జరగటం.. తదనంతర పరిస్థితుల్లో పోలీసు కాల్పులకు ఆరుగురు అన్నదాతలు మృతిచెందడం గుర్తుండే ఉంది కదా. ఆ ఆందోళనలకు కారణం కూడా ‘వెల్లుల్లే’. 2016 నోట్లరద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా దారుణమైన మార్పులు చోటుచేసుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మద్దతు ధర పెంపు, ఇతర ఉద్దీపనల ద్వారా ఇతర పంటలను కేంద్రం ఆదుకున్నప్పటికీ.. వెల్లుల్లి విషయంలో మాత్రం ఎలాంటి ‘ప్యాకేజీ’ అమలు చేయలేదు.
రాజేకు గడ్డుపరిస్థితులు
రాజస్తాన్‌లోని కోటా పెద్ద వెల్లుల్లి మార్కెట్. ఇక్కడ జూలైలో రూ. 25కు కిలో ఉన్న ధర.. సెప్టెంబర్‌కు రూ.20కి.. ఆ తర్వాత అక్టోబర్ చివరకు ఐదు రూపాయలకు పడిపోయింది. డిమాండ్‌కు మించిన సప్లై కారణంగా ధరలు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. రాజస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో నెలకొన్న నైరాశ్యం ప్రభావం ఈ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వసుంధరా రాజేపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిన ఫలితంగా బీజేపీ గద్దె దిగడం ఖాయమంటున్నారు.
సినిమా భాషలో చెబితేనే చెవికెక్కుతుంది..
ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం.. ఎన్నికల అధికారుల బాధ్యత. ఇందుకోసం ఒక్కొక్క అధికారి ఒక్కో స్టైల్లో ప్రయత్నిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా ఎన్నికల అధికారి విశేష్ గర్ఫాలే కూడా ఇలాగే వినూత్నమైన పద్ధతిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుల ద్వారా బాలీవుడ్ స్టార్లు షారుక్, సల్మాన్, అమీర్, అనుష్క శర్మల డైలాగ్‌లతో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు.
‘అధికారులు నిరక్షరాస్యులకు ఒటుపై అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓటు ప్రాముఖ్యత తెలియడం లేదు. ఇందుకోసంబాలీవుడ్ సినిమాల ఫేమస్ డైలాగ్‌లను ఉపయోగించాలని అనుకున్నారు. అలాంటి ఫేమస్ డైలాగుల్లో.. ‘మైనే ఏక్ బార్ కమిట్‌మెంట్ కర్ ది తో మై వోట్ జరూర్ కర్తాహూ’ (నేను ఒక్క సారి ఓటు వేయాలని కమిటైతే ఓటు వేసి తీరతా), ‘మేరే పాస్ బంగ్లాహై, గాడీహై తుమ్హారేపాస్ క్యా హై’ మేరే పాస్ ఓటర్ కార్డ్ హై!’వంటి డైలాగులతో.. మిమిక్రీ కళాకారులు వీధి ప్రదర్శనలు చేస్తున్నారు’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
వీటికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ తరహా ప్రచారానికి మరిన్ని వినూత్న ఆలోచనలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఓ పోటీ నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారిలో కొందరు జంగిల్‌బుక్‌లోని కార్టూన్ క్యారెక్టర్స్‌తో అలరించారు. ఈ ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం ద్వారా మరింత మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముంటుందని గర్పాలే అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment