మాజీ ఎమ్మెల్యే షబ్నం మౌసీ బనో(ఫైల్ ఫోటో)
భోపాల్ : షబ్నం 'మౌసీ' బనో దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ పేరు తొలిసారి తెరమీదకు వచ్చింది. భారతదేశంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ‘ట్రాన్స్‌జెండర్’ (లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తి)గా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి గెలుపొందారు. ఇంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న షబ్నం త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగబోయో అసెంబ్లీ ఎన్నికల్లో అనుప్పురు జిల్లా, కొట్మా నియోజక వర్గం నుంచి పోటి చేయనున్నట్లు తెలిపారు.
అయితే గతంలో షబ్నం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆశించారు. కానీ వారు ఆమె అభ్యర్ధనను తిరస్కరించడమే కాక అవమానించారు. ఈ విషయం గురించి షబ్నం ‘దేశంలో అతి పురాతన పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ నా పట్ల చాలా అమర్యదగా ప్రవర్తించింది. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు. నా సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా భావిస్తున్నాను. కానీ ఇప్పటికి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమే. వారు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు.
అంతేకాక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగానే పోటీ చేస్తాను కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే ఎన్నికల్లో విజయం సాధిస్తారా అని అడగ్గా ‘ప్రస్తుతం ఈ నియోజక వర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ అగర్వాల్ ఎంత అవినీతిపరుడో జనాలు చూస్తూనే ఉన్నారు. నియోజక అభివృద్ధి కోసం ఆయన చేసిందేమి లేదు. కనుక నేను తప్పక గెలుస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో ఆర్‌జేడీ నాయకుడు లాలు ప్రసాద్ యాదవ్ కూడా తనకు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ‘లాలుజీ నా పట్ల చాలా అమర్యదగా ప్రవర్తించారు. నన్ను చాలా అవమానించారు. అందుకు ఫలితం నేడు అనుభవిస్తోన్నారు. నా శాపం వల్లే లాలు పరిస్థితి ఇలా అయ్యింద’ని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment