న్యూఢిల్లీ: అక్టోబరు 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానా బీజేపీ ఎనిమిది మంది రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా ఇతర బీజేపీ నాయకులపై పోటీ చేసేందుకు రెబల్స్ ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధిష్టానం వారిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ జాబితాలో మాజీ మంత్రి రంజిత్ చౌతాలా సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. లాడ్వా నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన సందీప్ గార్గ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
బహిష్కరణకు గురైన ఇతర ఆరుగురు నాయకులు అసంధ్ స్థానం నుండి పోటీ చేస్తున్న జిలే రామ్ శర్మ, సఫిడో నుండి మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహమ్ నుండి రాధా అహ్లావత్, గుర్గావ్ నుండి నవీన్ గోయల్, హతిన్ నుండి కెహర్ సింగ్ రావత్, మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యన్ ఉన్నారు.
రంజిత్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రానియా నుండి ఎన్నికల టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment